| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - అష్టమాశ్వాసము |
| ఉ. |
ఆ నరుమీఁద ఘోరనిశితాశని వైచె నఖండ చండ ఝం ఝానిలజర్జరీకృతమహాజలధారలతో నిరంతరా నూన పయోధరప్రకర ముద్ధత మై హరిదంతరంబులన్ భానుపథంబు నొక్కమొగిఁ బర్వి భయంకరలీలఁ గప్పఁగన్. |
276 |
| ఉ. |
అ న్నవవారివాహ నివహమ్ములఁ జూచి భయప్రపన్నుఁ డై యున్నహుతాశనున్ విజయుఁ డోడకు మంచును మారుతాస్త్రమ త్యున్నతచిత్తుఁ డేసె; నదియున్ విరియించె రయంబుతో సము త్పన్నసమీరణాహతి నపార పయోద కదంబకంబులన్. |
277 |
| వ. | అంత. | 278 |
| సీ. |
బలవైరి కృష్ణుపైఁ బార్థుపై గడునల్గి | పంచినఁ గలయంగఁ బన్ని కడఁగి సురగరుడోరగాసురసిద్ధగంధర్వు | లార్చుచుఁ దాఁకి యుగ్రాహవంబు సేసిన నమరులఁ జెచ్చెరఁ బార్థుండు | భంజించెఁ దనదివ్యబాణశక్తిఁ; జక్రధరుండును జక్రబలంబున | గరుడోరగాసురఖచరవరులఁ |
|
| ఆ. |
దత్‌క్షణంబ విగతదర్పులఁ జేసె; న | య్యిద్దఱకు సురాసురేశు లెల్ల భీతు లగుట చూచి పెద్దయు విస్మిత | హృదయుఁ డయ్యె సురగణేశ్వరుండు. |
279 |
| వ. | మఱియును వారల బల పరాక్రమంబు లెఱుంగ వేఁడి శక్రుండు శిలావర్షంబుఁ గురియించిన. | 280 |
| క. |
నిశితశరవర్షమున ను | గ్రశిలావర్షమ్ముఁ జిత్రగతి నస్త్రకలా కుశలుఁడు నరుఁ డశ్రమమునఁ | బ్రశాంతిఁ బొందించె నమరపతి వెరఁగందన్. |
281 |
| క. |
కొడుకుభుజవిక్రమమునకుఁ | గడుసంతసపడియుఁ దృప్తిగానక చల మే ర్పడఁగ హుతాశను నార్పం | గడఁగి మహారౌద్రభంగిఁ గౌశికుఁడు వడిన్. |
282 |
| చ. |
అరుదుగ దివ్యరత్ననివహంబులఁ జేసి వెలుంగుచున్న మం దర శిఖరంబు నెత్తికొని తద్దహనార్చు లడంగునట్లుగాఁ దెరలఁగ వైచినం దపనతేజుఁడు పాండుసుతుండు దానిజ ర్జరితము సేసె వజ్రమయశాతశిలీముఖచండధారలన్. |
283 |
| క. |
ధరణీధరుచక్రమునకుఁ | బురుహూతతనూజుబాణముల కనిలో నె వ్వరు మార్కొ ననోపరు సుర | గరుడోరగ సిద్ధసాధ్యగణములలోనన్. |
284 |
| వ. | అంత నొక్కయశరీరవాణి పాకశాసనున కి ట్లనియె. | 285 |
| క. |
పరమమును లయిన తొల్లిటి | నరనారాయణులు కృష్ణనామంబుల ను ర్వర నుదయించిరి; నీ క | య్యిరువుర పేర్మియును వింతయే దివిజేంద్రా! |
286 |
| చ. |
అలఘులు కృష్ణపార్థులు మహాత్ములు యాదవకౌరవాన్వయం బులు వెలుఁగించుచున్న నృపపూజ్యులు; వీరల నీకు నోర్వఁగా నలవియె? వీరు దొల్లియు సురాసుర యుద్ధమునాఁడు దైత్యులన్ వెలయఁగ నోర్చియున్న రణవీరులు గావుట ము న్నెఱుంగవే? |
287 |
| వ. | నీయిష్టసఖుం డయిన తక్షకుం డిం దుండక ముందరన కురుక్షేత్రంబున కరిగి ఖాండవప్రళయంబునకుఁ దప్పె; ఖాండవం బగ్నిచేత దగ్ధం బగు నని తొల్లి బ్రహ్మవచనంబు గలుగుటం జేసి యిది హుతాశనున కశనం బయ్యె; నింక దీనికి వగవం బనిలే; దనిన దాని విని సురపతి సురగణంబులతో మరలిన. | 288 |
| క. |
బలయుతులు మనుజసింహులు | నలిఁ గృష్ణార్జునులు సింహనాదముల వియ త్తలమును దిక్కులు బధిరం | బులుగాఁ జేసిరి త్రిలోకములు భయ మందన్. |
289 |
| వ. | అట్టియవసరంబున నముచి యను దనుజుననుజుండు మయుం డనువాఁడు ఖాండవంబు వెలువడనేరక తక్షకుగృహంబునఁ బరిభ్రమించుచున్నంతఁ ద న్నగ్ని చుట్టుముట్టిన నచ్యుతుండును జంప వచ్చిన నతిభీతుం డై యర్జునుమఱువు సొచ్చిన. | 290 |
| వ. |
శరణాగతరక్షణత | త్పరుఁడు ధనంజయుఁడు మయునిప్రాణము గాచెం; గరుణను శరణాగతులగు | పురుషుల రక్షించునంత పుణ్యము గలదే. |
291 |
| తే. |
మయుఁడు నశ్వసేనుండును మందపాల | సుతులు నలువురు శార్ఙ్గకు లతులదావ దాహభీతి కయ్యార్వురుఁ దప్పి రన్య | జీవులెల్ల నం దపగతజీవు లైరి. |
292 |