| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - అష్టమాశ్వాసము |
| వ. |
అతిమానుష మత్యద్భుత | మతిదుష్కర మయిన కేశవార్జునకృతి గో పతి చూచి మెచ్చి సురపరి | వృతుఁ డయి చనుదెంచెఁ గృష్ణవిజయులకడకున్. |
319 |
| క. |
అనఘులు నరనారాయణు | లన నాదియుగంబునన్ సురాసురనుతు ల య్యును నపుడు మనుజు లగుటను | వినయంబున మ్రొక్కి రమరవిభునకు నంతన్. |
320 |
| వ. | ఇంద్రుండు నుపేంద్రార్జునుల నతిస్నేహంబునఁ గౌఁగిలించుకొని యర్జునునకు నాగ్నేయవారుణ వాయవ్యాది దివ్యబాణంబు లిచ్చి, ‘వీని కెప్పుడు నిష్టసఖుండ వయి యుండు’ మని కృష్ణుం బ్రార్థించి, దివ్యవిమానారూఢుం డయి దివిజాప్సరోగణసేవితుం డయి దివంబున కరిగె; నిట వాసుదేవార్జునులు మయుం దోడ్కొని మగిడి యింద్రప్రస్థపురంబునకు వచ్చి, ధర్మరాజునకు మ్రొక్కి ఖాండవదహనప్రకారంబు సెప్పి మయుం జూపి సుఖం బుండి రని. | 321 |
| క. |
జనమేజయజనపాలున | కనఘచరిత్రునకుఁ బ్రీతుఁ డయి వైశంపా యనుఁ డాదిపర్వకథ యె | ల్లను నిమ్ముగఁ జెప్పె నని విలాసమహేంందా! |
322 |