పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము
ధర్మజునకు భీష్ముం డనుష్ఠేయంబులఁ జెప్పుట (సం. 13-74-1)
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు గోవుల మహానుభావంబు విని పాండవాగ్రజుండు భీష్మునితో ‘ధర్మంబులు తేటపడ ననుగ్రహించుచుం బుయిలోట వాపి నన్నుం గలిపికొని కృపకు భాజనంబుగాఁ జేయుటం జేసి కొంకక యింకను నడిగెదఁ; దాత్పర్యంబున ననుష్ఠింపవలయునవి యెయ్యవి యెఱింగింపవే!’ యనుటయు నతనితో నతండు. 002
సీ. ‘విను నియమంబును వేదపాఠంబుఁ ద | ద్ధరణంబు దమము నధ్యాపనంబు
నప్రతిగ్రహమును నాత్మీయకర్మని | ష్ఠయు సకలేంద్రియ జయము సత్య
నిరతియు శ్రుతదాన పరతయు బ్రహ్మ చ | ర్యముఁ బితృశుశ్రూషణమును మాతృ
శుశ్రూషణము గురుశుశ్రూషణము నను | కంపయు గోవ్రత సంపదయును
 
ఆ. వత్స! యాచరింపవలయునట్టివి’ యని | పలుకుటయును నా నృపాలవరుఁడు
‘గో ప్రదానవిధి యకుంఠిత కృప నాకు | నెఱుఁగఁ జెప్పవే సమిద్ధబుద్ధి.’
003
వ. అని యడిగిన యక్కురుపతికిం గురుపితామహుం డిట్లనియె. 004
ఆ. ‘తనియ మేసి నీరు ద్రావి మందకు వచ్చి | సౌఖ్య మెసఁగఁ బసులు శయన మొంది
యుండ నచట నియతి నుండి మాంధాతృండు | పరమభక్తి నమరగురునిఁ దలఁచి.
005
వ. ఇట్ల యడుగం గలవాఁడై కరంబులు మొగిచి బహువిధంబులం బ్రస్తుతించిన, నా పురుహూత పురోహితుండు ప్రత్యక్షం బగుటయు, న ప్పుడమిఱేఁ డమ్మహాత్ముని పాదంబులకుం బ్రణమిల్లి యడిగిన నద్దేవగురుం డన్నర దేవోత్తమున కిట్లనియె. 006
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )