| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | శోకమూర్ఛితుండై మహీతలంబుపయిం బడిన యాతని నాశ్వాసించి శౌనకుం డను బ్రహ్మర్షి దొల్లి యాత్మ వ్యవస్థానార్థంబు జనకగీతంబు లైన శ్లోకంబుల యర్థంబులు యుధిష్ఠిరున కి ట్లనియె. | 19 |
| క. |
‘శోకభయస్థానంబు ల | నేకంబులు గలిగినను విహీన వివేకుం డాకులతఁ బొందునట్లు వి | వేకము గలవాఁడు బుద్ధి వికలుం డగునే? |
20 |
| క. |
శారీర మానస మహా | దారుణ దుఃఖములఁ జేసి తఱిఁగి శరీరుల్ క్రూరతరబాధఁ బొందుదు | రా రెంటిని జెఱుతు రార్యు లమలినబుద్ధిన్. |
21 |
| వ. | వ్యాధి శ్ర మానిష్ట సంస్పర్శ నేష్ట వివర్జనంబు లను నాల్గింటం బుట్టి శారీరదుఃఖంబు లాశుక్రియాది ప్రతి యోగంబుల నుపశమిల్లు; మఱి స్నేహజంబు లైన మానసదుఃఖంబులు జలంబుల నగ్ని యుపశమిల్లునట్లు విమల జ్ఞానంబునం జేసి యుపశమంబునం బొందు. | 22 |
| క. |
స్నేహార్ణవ మగ్నుం డయి | దేహి మహాదుఃఖముల నధృతిఁ బొందును; దుః ఖాహతుఁడు శోకతాపవి | మోహి యగున్; స్నేహమూలములు రాగాదుల్. |
23 |
| వ. | కావున బంధుమిత్త్రధనసంచయంబులవలని స్నేహంబు విడుచునది; పద్మపత్రంబు నీరం బొందనియ ట్లెఱుక గలవారి నెట్టియెడలను స్నేహంబు వొందదు; స్నేహంబున రాగంబును, రాగంబునం గామంబును, గామంబునం గ్రోధంబును, గ్రోధంబునం దృష్ణయు వర్తిల్లు. | 24 |
| క. |
అది సర్వదోషముల కా | స్పద, మది దురితక్రియానుబంధంబులకున్ మొదలు, నిరంతర దుఃఖ | ప్రద మని మదిఁ దలఁచి తృష్ణఁ బాతురు సుమతుల్. |
25 |
| వ. | మఱియుఁ దృష్ణాతురుం డర్థలోభంబునఁ గోటరస్థంబయిన యనలంబునం జేసి దగ్ధంబగు వృక్షంబునుంబోలె వినాశంబునం బొందు; నర్థాసక్తుండైనవాఁడు శుభంబులు వడయ నోపండు; మృత్యువువలనం బ్రాణులకు భయంబు గలుగు నట్లర్థవంతులకు రాజ చోర స్వజన జలానలంబులవలన భయంబు నియతంబు. | 26 |
| తే. |
జలములందు మత్స్యంబులు, చదలఁ బక్షు | లామిషం బెట్లు భక్షించు నట్లు దివిరి యెల్లవారును జేరి యనేకవిధుల | ననుదినంబును భక్షింతు రర్థవంతు. |
27 |
| క. |
అర్థమ యనర్థ మూలం; | బర్థమ మాయా విమోహనావహము; నరుం డర్థార్జన దుఃఖమున న | పార్థీకృతజన్ముఁ డగుట పరమార్థ మిలన్. |
28 |
| వ. | అట్టి యర్థంబువలన దర్పకార్పణ్య మాన భయోద్వేగంబులు పుట్టుఁ; గావున నర్థోపార్జనచింత సేయ వలదు. రూప యౌవన ధన విభవ ప్రియ సంవాసంబు లనిత్యంబు లగుట నందు బుద్ధిమంతులు విమోహింప’ రనిన నమ్మునివరునకు ధర్మతనయుం డిట్లనియె. | 29 |
| సీ. |
‘ఆత్మోపభోగార్థ మర్థలాభేచ్ఛ నా | కెన్నండు లేదు; మహీసురాగ్ర గణ్యుల నత్యుగ్ర కాననాంతరమున | నెవ్విధంబున భరియింతు నొక్కొ యని యిప్డు వగచెద; ననవద్యగుణయుక్తి | ననఘ! మాయట్టి గృహస్థతతికిఁ బోష్యుల నెయ్యెడఁ బ్రోవక యుండను | విప్రుల నతిథుల వృథయ పుచ్చఁ |
|
| ఆ. |
జనునె? నిజధనంబు సంవిభాగించి యీ | వలయు, సాధురక్ష వలయుఁ జేయ, నభిమతాశ్రమంబులందు గృహస్థాశ్ర | మంబకాదె యుత్తమంబు వినఁగ. |
30 |
| వ. | మఱి యార్తునకు శయనంబును, భీతున కభయంబును, దృషితునకు జలంబును, బుభుక్షితునకు నన్నంబును, శ్రాంతునకు నాసనంబును నిచ్చుట సనాతనంబైన యుత్తమ గృహస్థ ధర్మంబు; తృణ భూమ్యుదక ప్రియ వచనాదరంబు లెల్లవారికి నవశ్యంబ; యాత్మార్థంబుగా నన్నపాకంబును నసాక్షిక భోజనంబును, వృథాపశు ఘాతంబును బాపహేతువు, లగ్నిహోత్రంబులు ననడ్వాహంబులు నతిథి బాంధవ విద్వజ్జన గురుమిత్ర భామినీ నివహంబు లపూజితంబులై యెగ్గు సేయును; గావున గృహస్థుండు సర్వసంతర్పకుండ గావలయుం, గావునం బ్రతిదినంబును బక్షి శునక శ్వాపదార్థంబు సాయం ప్రాతస్సులయందు వైశ్వదేవంబు సేసి యమృతాశియు విఘసాశియుఁ గావలయు; యజ్ఞశేషం బమృతంబు నాఁ బరఁగు; నతిథిభుక్త శేషంబు విఘసంబు నాఁబడు; నట్టి వృత్తి వర్తిల్లువాఁ డుత్తమగృహస్థుం’ డనిన ధర్మరాజునకు శౌనకుం డిట్లనియె. | 31 |
| క. |
‘హారివిషయాభిలాషము | గారణముగ నెంత యెఱుక గలవారును దు ర్వారవికారముఁ బొందెడు | వారు నిజేంద్రియము లవి యవశ్యము లగుటన్. |
32 |
| వ. | సంకల్పజంబైనకామంబునఁదగిలిన మనస్సుచేతంబ్రేరితంబై శ్రోత్రాదీంద్రియంబులు శబ్దాది విషయంబులం బరిభ్రమించుటంజేసి విషయాభిలాష విశిఖవిద్ధులై దేహులు తేజోలుబ్ధంబులైన శలభంబులుంబోలె శోకానలంబునంబడి తమ్మెఱుంగక యవిద్యాకర్మతృష్ణలం జేసి సంసారచక్రంబునందుఁ బ్రవర్తిల్లుదు; రట్టి బ్రాహ్మాదితృణపర్యంతభూతప్రవృత్తియందు రాగద్వేష విముక్తులై యభిమాన మత్సరంబులు విడిచి, వేద చోదితంబైన సమ్యక్సంకల్ప సంబంధం బింద్రియనిగ్రహంబు వ్రతవిశేషంబు గురుసేవనం బాహారయోగం బధ్యయ నాగమంబు కర్మసన్న్యాసంబు చిత్తనిరోధంబను నెనిమిదింటను గర్మానుష్ఠానంబు సేసిన మహాత్ములు దమ తమ తపోమహత్త్వంబునం జేసి సంసారంబు జయింతురు; నీవును శుశ్రూషా శ్రవణ గ్రహణ ధారణోహాపోహార్థవిజ్ఞాన తత్త్వజ్ఞాన సమన్వితుండవు; నీచేతం బ్రారబ్ధంబులైన యవి సర్వంబులును సంపన్నంబులగు. | 33 |
| క. |
వసురుద్రాదిత్యాదులు | వసుధేశ! తపంబు గౌరవంబున నైశ్వ ర్యసమృద్ధులైరి; తపమునఁ | బ్రసిద్ధముగ నిష్టసిద్ధి వడయుము నీవున్. |
34 |
| వ. | తపస్సిద్ధులైనవారు దమ తలంచిన దానిన క్రమంబునం బడయుదురు; గావున నీవు నుపశమవంతుండవై తపంబు సేసి యోగార్థసిద్ధి వడసి, బ్రాహ్మణుల ననుచరించుచు నీ మనోరథంబు సఫలంబు సేయు’ మనిన శౌనకవచనంబు సేకొని భ్రాతృమధ్యగతుండైన ధర్మతనయుండు ధౌమ్యునకు నమస్కరించి యిట్లనియె. | 35 |
| తే. |
‘వనమునకు వచ్చి నవయంగ వలవ దుడుగు | డనిన నుడుగక; ‘మీతోన యరుగుదెంతు’ మనిరి బ్రాహ్మణుల్; వీరి కాహార మే యు | పాయమున నుగ్రవనమునఁ బడయ నేర్తు? |
36 |
| వ. | వీరల విడువ నోప; నేమి సేయుదు’? ననిన విని ధౌమ్యుండు పెద్దయుం బ్రొద్దు చింతించి, ధర్మరాజున కిట్లనియె. | 37 |
| ఆ. |
‘భూతరాశి దొల్లి పుట్టి బుభుక్షాభి | తప్తమయినఁ జూచి తద్భయంబు నపనయింపఁ గడఁగి యదితిసుతాగ్రణి | గమలబాంధవుండు గరుణతోడ. |
38 |
| వ. | ఉత్తరాయణగతుండై యుర్వీరసంబు పరిగ్రహించి, దక్షిణాయనగతిం బర్జన్యభూతుండై యోషధులం బడసి, రాత్రులయందుఁ జంద్రకిరణామృతంబునం జేసి వానిందడుపుచు వర్ధించి, యం దన్నంబు పుట్టించి, ప్రజారక్షణంబు సేయుటం జేసి యన్నం బాదిత్యమయంబని యెఱింగి, తొల్లి భీమవైన్య కార్తవీర్య నహుషాదులు యోగసమాధి నిష్ఠితులై సూర్యభజనంబున నన్నంబుఁబడసి యాపదలవలనం బ్రజల సముద్ధరించిరి గావున. | 39 |
| లయగ్రాహి |
వారిరుహమిత్త్రు నమరోరగమునిద్యుచర | చారణగత ప్రణుతచారుగుణు లోకా ధారు నఖిలశ్రుతిశరీరు హరిశంకర స | రోరుహభవప్రతిము దారుణతమిస్రా వారణ మరీచి పరిపూరిత దిగంతరుని | భూరికరుణానిరతు సూరుఁ ద్రిజగద్ర క్షారతు సహస్రకరుఁ గోరి భజియింపుము; మ | నోరథఫలంబు లగు భూరమణ! నీకున్’. |
40 |
| వ. | అని ధౌమ్యుండు విశుద్ధాత్ముండైన ధర్మరాజునకు సూర్యుం డర్యముండు భగుండను నివి మొదలుగాఁ గల నామంబుల యష్టోత్తరశతంబు నభీష్ట సిద్ధిప్రదం బయినదాని విస్పష్టార్థ వర్ణోచ్చారణంబును విధియుక్తంబునుగా నుపదేశించి, ‘దీనిం దొల్లి యింద్రువలన నారదుండు వడసె; నారదువలన వసువనురాజు వడసె; నాతనివలన నేను వడసితి; నేను నీ కిచ్చితి; నిది దేవనిర్మితంబు; దీన నాదిత్యు నతిభక్తి నారాధింపు’ మనిన. | 41 |