| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | నీవు నా కొడుకుల యున్నతి కెన్నండును సహింపవు; నీ సహాయత్వంబే నొల్లఁ; బాండవులకడ కేనియు నొండు గడకేనియు నీకిష్టం బైన చోటికి నరుగు’ మనిన నా క్షణంబ విదురుండు మనోజవైకరథారూఢుండై పాండవుల కడకుం గామ్యకవనంబున కరిగె; నంత నతనిరాక దవ్వులం గని ధర్మరాజు భీమసేనుని కిట్లనియె. | 54 |
| సీ. |
‘గాండీవ మాదిగాఁ గల యాయుధావలు | లుక్కివంబున నప్పు డొడిచి కొనఁగ మఱచినవాఁడయ్యు మందాత్ముఁ డా ధార్త | రాష్ట్రుండు గాంధారరాజతనయు వచనముల్ విని యక్షవతి నెపంబున వానిఁ | గష్టుఁడై కొన సమకట్టి మనల మగుడింపఁగా దుష్టమతిఁజేసి విదురుఁ బు | త్తెంచెఁ; గాకున్న నేతేరఁ డితఁడు |
|
| ఆ. |
నింక జూదమాడ నే నోప; నిది పని | గాఁగ వచ్చు నొక్కొ కడఁగి విదురుఁ; డేమి సేయు వార? మితని నియోగంబు | మనకుఁ జేయ కునికి మానుషంబె?’ |
55 |
| వ. | అని తమలోఁ బలుకుచున్న సమయంబున విదురుం డేతెంచిన నతనికిఁ బ్రత్యుద్గతులై వినయప్రియ సత్కారంబుల సంతుష్టుం జేసి, తదాగమననిమిత్తం బడిగిన, వారికి విదురుం డిట్లనియె. | 56 |
| క. |
‘మతి వారికి మాకును గడు | హితుఁడవు; చెపుమయ్య; యింక నెయ్యది కార్య స్థితి?’ యని ధృతరాష్ట్రుం డే | కత మిష్టంబైన కార్యగతి నన్నడుగన్. |
57 |
| వ. | ఏ నుభయపక్షంబులవారికి జగంబునకు లగ్గుగ హితంబైన విధంబు సెప్పిన, నది సర్వజన రుచికరంబైన యాహారంబు రోగాతురునకు నరుచికరంబైన యట్ల యతనికి రుచియింపదయ్యె. | 58 |
| ఆ. |
కార్యగతులతెఱఁగు కలరూపు సెప్పిన | నధికమతులు దాని నాదరింతు; రల్పకార్యబుద్ధు లగువారలకు నది | విరసకారణంబు విషమ పోలె. |
59 |
| వ. | దానన చేసి ధృతరాష్ట్రుండు నన్నొల్లక యెగ్గులు వలికి ‘నీవు విపరీతచేతస్కుండ; విందుండ వలవదు; పాండవుల పాలికిం బొ’ మ్మనిన వచ్చితి; రూపలావణ్యవతియై వృద్ధశ్రోత్రియునిచేతం బరిణీతయైన తరుణియుం బోలె రాజ్యలక్ష్మి యద్దురాత్మునందు విరక్తయగాని ప్రీతిఁ బుట్టదండ్రు. | 60 |
| ఆ. |
ధర్మరహితులైన ధార్తరాష్ట్రులకు భూ | రాజ్యలక్ష్మి సుస్థిరంబు గాదు; ధర్మతనయ! నిన్నుఁ దద్రాజ్యసంపదల్ | వలచి తమకుఁ దామ వచ్చి పొందు. |
61 |
| వ. | నా వచనంబున నెగడునది’ యనిన ధర్మరాజు ‘నట్ల చేయుదు’ నని యున్నంత; నిట ధృతరాష్ట్రుండు పాండవులయొద్ద విదురు నునికి యెఱింగి ధృతివిహీనుండై, తన హృదయంబును దృష్టియుం బోని విదురుం బాసి నిమిషం బేనియు నిర్వహింప నోపక సంజయున కిట్లనియె. | 62 |
| క. |
‘నెమ్మిగలవాని, నా చి | త్తమ్మెఱిఁగెడు వాని విదురు ధర్మప్రియు నా తమ్ము నిట వేగఁ దోడ్కొని | ర; మ్మరుగుము కామ్యకాఖ్య రమ్యాటవికిన్. |
63 |
| వ. | అని పంచిన నప్పుడ సంజయుం డతిత్వరితగతిం గామ్యకవనంబున కరిగి. | 64 |
| మ. |
ధరణీదేవసహస్రసంఘములతో ధౌమ్యుండు ధర్మక్షమా భరణుల్ నల్వురు దమ్ములున్ విదురుఁడుం బాంచాలియుం బ్రీతి బం ధురులై కొల్వఁగ నొప్పుచున్న బుధబంధున్ ధర్మరాజుం బ్రభా స్వరతేజుం బ్రభుఁ గాంచి సంజయుఁడు సంజాతప్రమోదాత్ముఁడై. |
65 |
| క. |
వనవాసము సేయుచుఁ ద్రిభు | వన రాజ్యము సేయునట్టి వడువున సంతో ష నిబద్ధ బుద్ధి యగు యమ | తనూజునకు భక్తి నెఱఁగి తా నిట్లనియెన్. |
66 |
| వ. | ‘మిమ్మును ధర్మార్థవిదుండైన విదురునిం గౌరవేంద్రుం డెప్పుడుం దలంచుచుండు; మీ యనుమతంబునఁ దన యనుజుం దోడ్కొని తేర నన్నుఁ బుత్తెంచె’ ననిన విని ధర్మరాజు విదురున కిట్లనియె. | 67 |
| తే. |
‘సర్వజనులును ధృతరాష్ట్రు శాసనంబు | సేయుచున్నచో మనకు విశేషభక్తిఁ జేయవలయుఁ; గావున నెడ సేయ కరుగు’ | మనిన విదురుండు గజపురి కరిగె నంత. |
68 |
| వ. | ధృతరాష్ట్రుండును దనకు వినయవినమితోత్తమాంగుఁ డైన విదురు నతిస్నేహంబునం గౌఁగిలించుకొని మూర్ధాఘ్రాణంబు సేసి ‘నీవు నిత్యక్షమానిరతుండవు నాబుద్ధిలేమికి క్షమియింపు’ మనిన విదురుం డిట్లనియె. | 69 |
| ఆ. |
‘నీవు నీ సుతుండు నెఱిఁ దప్పి పలికినఁ | బథ్యమయిన పలుక పలుకవలయు; వీరు లయిన పాండవేయులతో నిగ్ర | హంబు సేయు టిది నయంబు గాదు.’ |
70 |
| వ. | అనుచు నెప్పటి యట్ల కార్యసహాయుండై విదురుండు ధృతరాష్ట్రునొద్ద నున్న, నయ్యిద్దఱ సంగమంబునకు శంకించి దుర్యోధనుండు కర్ణ శకుని దుశ్శాసనులతో నిట్లనియె. | 71 |
| క. |
‘పాండవహితుఁ డగు విదురుఁడు | వెండియుఁ జనుదెంచి కార్యవిధులందు సహా యుండయ్యె; నతనితోడ హి | తుండయి మంతనము సేయఁ దొడఁగెన్ విభుఁడున్. |
72 |
| వ. | వీరలింకఁబాండవుల నిందులకు రావించు వారలయిన నగ్ని విష జలంబులు ప్రయోగించి వారల కపాయంబు సేయుద’ మనిన విని శకుని దుర్యోధనుం జూచి ‘యిట్లేల బాలిశంబైన మతిఁ దలంచితివి? విదుర ధృతరాష్ట్రులు విపరీతమతులై రావించినను, నిత్యసత్యనిరతులైన యప్పాండవులు దమ సేసిన సమయంబు సలుపక యేల వచ్చువార గుదు?’ రనిన శకునిదుర్యోధనులకుఁ గర్ణుం డిట్లనియె. | 73 |
| ఉ. |
‘ఇత్తఱిఁ బన్నిపోయి పయినెత్తి రణం బొనరించి వారలన్ మిత్తికి నంపి ధాత్రి నిరమిత్రముఁ జేయుద; మిట్టు లైనఁ ద ద్వృత్తులు నీక దక్కుఁ గురువీర; కడంగుము’ నావుడున్ మదో న్మత్తుఁడు గౌరవుం డతనిమాటకు సంతసమంది చెచ్చెరన్. |
74 |
| వ. | సమర సన్నద్ధుఁడై సమస్తబలంబును సమకట్టి వెలువడినం దన దివ్యదృష్టి నంతయు నెఱింగి కృష్ణద్వైపాయనుండు వచ్చి ‘యిది ధర్మువు గా దుడుగు’ మని దుర్యోధనుని వారించి ధృతరాష్ట్రున కిట్లనియె. | 75 |
| క. |
‘పుడమియు రాజ్యముఁ గోల్పడి | యడవుల నేకతమ యున్న యప్పాండవులం గడఁగి వధియింతు నని నీ | కొడు కరిగెడు; నిట్లు తలఁపఁ గూడునె బుద్ధిన్? |
76 |
| క. |
ధృతియుతులై సత్యవ్రత | రతులై పదుమూఁడు వత్సరంబులు ధర్మ స్థితి సలిపి వార కడఁగెద | రతులపరాక్రములు మీఁద నాహవమునకున్. |
77 |
| క. |
వనగతులని వారలపైఁ | జని భంగముఁ బొంది రాఁగ సమకట్టెడు నీ తనయుఁడు గావున నీ వా | తని వారింపు మది యనుచితం బని నెమ్మిన్. |
78 |
| క. |
విను మేనును నీవును శాం | తనవుఁడు విదురుండు నుండి తగునె యధర్మం బు నుపేక్షింపఁగ? ననయం | బును బాండవవిగ్రహంబు పుట్టుట లగ్గే?’ |
79 |
| వ. | అనిన విని ధృతరాష్ట్రుండు దుఃఖితుండై ‘నాకును గాంధారికిని భీష్మ విదుర కృప ద్రోణులకు ననిష్టంబైన దుష్ట ద్యూతంబు ప్రవర్తిల్లె; దుర్బుద్ధియైన దుర్యోధనుం బుత్త్రస్నేహంబున విడువనోప; నేమి సేయుదు?’ ననిన ధృతరాష్ట్రునకుఁ గృష్ణద్వైపాయనుం డిట్లనియె. | 80 |