పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము
భీమునకు హనుమంతుఁడు చతుర్యుగాచార వర్తనంబులను దెలుపుట (సం. 3-148-10)
తే. ‘కృతమ కాని కర్తవ్యంబు గృతయుగంబు | నందు లేదు; చతుష్పాద మగుచు ధర్మ
మనఘ! వర్తిల్లు; నచ్యుతుం డయ్యుగమున | శుక్లవర్ణుఁడై ప్రజలఁ గాచుచు వెలుంగు.
336
వ. అది సనాతనధర్మసనాథం; బందుల బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రు లేకవేదక్రియాయోగ్యులై యకామ ఫలసంయోగంబునఁ బుణ్యలోకంబులు వడయుదు; రందు నసూయాభిచార దర్పపైశున విగ్రహ క్రోధమదమత్సర భయ సంతాప వ్యాధి ప్రజాక్షయేంద్రియక్షయంబులు లేవు; మఱియుఁ ద్రేతాయుగంబునందుఁద్రిపాదంబై ధర్మువు వర్తిల్లు; నందు జనులు నిత్యసత్యవ్రతశీలురై యజ్ఞతపో దానాది క్రియల వర్తింతు; రందు రక్తవర్ణుండయి విష్ణుభట్టారకుండు ప్రజారక్షణంబుఁ జేయు. 337
తే. ద్వాపరంబున రెండుపాదములఁ జేసి | నడుచు ధర్మువు వేదముల్‌ నాల్గుదెఱఁగు
లై ప్రవర్తిల్లు వేదశాస్త్రార్థ చోది | తంబులై ధర్మకామముల్‌ ధరణిఁ బరఁగు.
338
తే. సత్యశమహీను లగుదురు జనులు గామ | కాములై చేయుదురు బహుక్రతువు లోలి;
నందుఁ ద్రైలోక్యవందితుం డచ్యుతుండు | కృష్ణవర్ణుఁడై జగము రక్షించు మఱియు.
339
క. కలియుగమునందు ధర్మము | బలమఱి వర్తిల్లు నేకపాదంబున; నం
దలఘుఁడు కృష్ణుఁడు జగతీ | వలయము రక్షించుఁ బీతవర్ణుం డగుచున్‌.
340
వ. అందుల జనులు తమోగుణ యుక్తులై కామక్రోధాది దోషవశంబునం దమ్మెఱుంగక యధర్మవర్తు లగుదు; రందుఁ జేసిన తపోదానాది కర్మంబులు స్వల్పంబులయ్యును బహుఫలంబు లగు’ నని యుగవర్తన ప్రకారంబులఁ జెప్పి, ‘నీ కిష్టావాప్తి యయ్యెడు, నరుగు’ మనిన భీముం డిట్లనియె. 341
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )