| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | నాకు మిమ్మును మీ కుబేరుం బ్రార్థించి కాని యిక్కొలని పువ్వులు గొనంగాదొకో?’ యని భీముండు రాక్షసుల నాదరింపక సౌగంధికవనంబు సొచ్చి కనకకమలంబులుం గొని యుత్తమవీర్యవంతంబు లైన తత్సలిలంబు లుపయోగించి యనంతబలసంపన్నుండై యున్న; నాతనిం జూచి రాక్షసు లలిగి యుద్యతాయుధహస్తులై తాఁకిన భీముండును భీకరాకారుండై. | 366 |
| చ. |
తన గదఁ జేసి రాక్షసుల దారుణశస్త్రచయంబు నశ్రమం బున నతివీరుఁడై విరిచి పోర నిశాచరులన్ బడల్పడన్ ఘనభుజదండ చండహతిఁ గ్రాఁచిన నుక్కఱి రక్కసుల్ కుబే రున కెఱిఁగింపఁ బాఱిరి సరోషవృకోదరభీమకర్మముల్. |
367 |
| వ. | కుబేరుండును బాంచాలీ ప్రియకరంబైన పవనతనయు పరాక్రమారంభంబు విని మెచ్చి దాని నుపేక్షించె; నట్లు భీమసేనుండు రాక్షససేన నోడించి సౌగంధిక కమలంబులు గొని తత్తీరకుసుమితలతాపాదపవనంబున విహరించుచున్నంత నట. | 368 |
| క. |
వడిఁ బడియెఁ బిడుగు లుడుగక, | వడఁకె మహీతలము, పాంసువర్షము గురిసెం గడు నెఱ్ఱ నయ్యె దిశ, లే | ర్పడకుండె నినుండు తిమిరపటలావృతుఁడై. |
369 |
| వ. | ఇట్టి మహోత్పాతంబు లుపలక్షించి విస్మితుండై ధర్మతనయుం ‘డివి భీమాహవ పిశునంబులై కానంబడియె నేమఱకుండ వలయు’ నని నాలుగుదిక్కులుం జూచి భీమసేనుం గానక తన సమీపంబున నున్న పాంచాలి కిట్లనియె. | 370 |
| క. |
‘ప్రియసాహసుండు భీముఁడు | భయవిరహితుఁ డెందుఁ బోయె బహురాక్షససం శ్రయ మిగ్గిరి గంధర్వా | న్వయ సేవ్యం బేకచరుఁడు వాఁ డెయ్యెడలన్. |
371 |
| ఆ. |
భూరిభుజుఁడు దానె పోయెనో? నీ వెట | యేని పుచ్చితో నిజేచ్ఛ నతని?’ నని యజాతశత్రుఁ డడిగినఁ బతికిఁ బాం | చాలి యిట్టు లనియె సంభ్రమమున. |
372 |
| మధ్యాక్కర |
‘ధరణీశ! నీకు నాయిచ్చిన పసిఁడి తామరపువ్వు గురువాయువశమున వచ్చినను దానిఁ గొని యిట్టిపువ్వు లరుదు గాన కుఱంగటం గలిగెనేని యర్థిఁ దె మ్మనిన నరిగె నీశానుదిక్కునకు నీ తమ్ముఁ డతివేగమునను.’ |
373 |
| వ. | అనిన ‘నట్లేని యందఱము వాని పోయిన వలనం బోవుద’ మని యెప్పటియట్ల రాక్షసస్కంధారూఢులై గగనగతి నరిగి సౌగంధిక తీరంబున. | 374 |
| చ. |
అతులబలాఢ్యు నుద్యతగదాయుధహస్తుఁ బటుప్రతాపవ ర్ధితయశుఁ బాండునందనుఁ దదీయమహోగ్రగదావిఘాత దా రిత పృథుయక్ష రాక్షస శరీరచయంబులుఁ జూచి విస్మయ స్మితముఖు లైరి బ్రాహ్మణసమేతులు ధర్మసుతాదు లచ్చటన్. |
375 |
| వ. | భీమసేనుండును ధౌమ్య ధర్మజ రోమశులకు మ్రొక్కి, తనకు మ్రొక్కిన కవలఁ గౌఁగిలించుకొని, వైడూర్యనాళంబులైన కనకకమలంబులు ద్రౌపది కిచ్చి యున్నంత నాతనికి ధర్మరా జిట్లనియె. | 376 |
| ఆ. |
‘చనునె నీకు నిట్టి సాహసక్రియఁ జేయ? | నెల్లవారికంటె నెఱుక గలవు గురుభుజుండ! నాకుఁ గూర్తేని చేయకు | మయ్య! యిట్టి చెయ్వు లనఘ! యింక’. |
377 |
| వ. | అని కఱపి యి ట్లందఱుం గుబేరోద్యానవనంబున విహరించుచున్నంతఁ దద్రక్షకులైన యక్షులు వచ్చి. | 378 |
| క. |
దేవర్షియైన రోమశు | దేవేంద్ర సమాను నయ్యుధిష్ఠిరు ధరణీ దేవోత్తములం గని విన | యావనతులు భక్తి నిట్టు లని రందఱకున్. |
379 |
| వ. | ‘మీ రిందు మసలవల; దిది యక్ష రాక్షస ప్రచారఘోరం’ బనిన నందుండ నొల్లక పాండవులు తత్సమీపంబున నివాసంబుఁ జేసికొని రాక్షస బలంబుతో ఘటోత్కచుఁ బోవంబనిచి యుండు నంత, జటాసురుం డను రాక్షసుండు బ్రాహ్మణరూపధరుండై’ యేను వేదవిదుండ, ధనుర్వేదవిదుండైన పరశురాము శిష్యుండ’ ననుచుం బాండవుల సేవించుచున్నంత నొక్కనాఁడు. | 380 |
| ఆ. |
మృగవిరోధిబలుఁడు మృగయావినోదార్థ | మడవి కనిలతనయుఁ డరిగినట్టి యవసరమున నజ్జటాసురుఁ డాసురా | కారవికృతరూపకంబుఁ దాల్చి. |
381 |
| క. |
చనుదెంచి ద్రౌపదిని యమ | తనూజు నకులుం దదాయుధంబులతోఁ బె ల్చన యెత్తికొని మహాజవ | మునఁ బఱచె మహీసురోత్తములు భయమందన్. |
382 |
| వ. | అంత సహదేవుండు భీముం బిలుచుచు వనంబున కరిగె; నిట ధర్మతనయుం డధర్మవర్తి యైన యసుర కిట్లనియె. | 383 |
| క. |
‘దేవాసురాదు లిం దుప | జీవింతురు మనుజులకు విశేషసుఖంబుల్ గావించుచు నమ్మనుజులఁ | గావంగలవార మేము గౌరవయుక్తిన్. |
384 |
| వ. | ఇట్టి మా కపకారంబు సేయుట లగ్గు గాదు; నీవు ధర్ము వెఱుంగవు; విశ్వసించినవారికిం గుడువంబెట్టినవారికి నెగ్గుచేయుట కడుంబాపంబు గావున. | 385 |
| మధ్యాక్కర |
మాయావి! మా యాయుధములు మా కిచ్చి మాతో రణమ్ము సేయు; మివ్విధమునఁ బోవఁ దగ’ దంచుఁ జిక్కనై యసుర నాయతబాహుఁడు గరము భరముగా నదిమె ధర్మజుఁడు మాయావి యగు వానిగమనవేగంబు మందమై యుండ. |
386 |
| వ. | ఇట్లు ధర్మజు నిబిడపీడన వేదనాభరంబున విగతవేగుండై యరుగు జటాసురున కడ్డంబు వచ్చి సహదేవుం డిట్లనియె. | 387 |
| క. |
‘న న్నెఱుఁగవె? పాండవుఁడఁ, బ్ర | సన్నయశోవీర్యయుతుఁడ సహదేవుఁడ; న త్యున్నతి యేర్పడ నిప్పుడ | ని న్నోర్చెదఁ జక్క నెదిరి నిలువుము పోరన్.’ |
388 |