పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
ధర్మవ్యాధుఁడు కౌశికునకు బ్రహ్మవిద్యాప్రపంచం బెఱింగించుట (సం. 3-201-16)
తే. అంబరము వాయు వగ్ని దోయమ్ము ధరణి | భూతపంచక మిది; క్రమంబున మహాత్మ!
శబ్ద సంస్పర్శ రూప రసములు గంధ | సంయుతంబుగ భూతపంచక గుణములు.
83
క. ఒనరఁగ నాకస మాదిగ | ననులోమముతోడ నిమ్మహాభూతము లే
నును బుట్టు నొకటి కొక్కటి | యనయముఁ బ్రతిలోమగతి లయంబునఁ బొందున్‌.
84
వ. శ్రోత్రంబును ద్వక్కును జక్షువును జిహ్వయు ఘ్రాణంబును నను నియ్యేనగు నింద్రియంబులు శబ్ద స్పర్శ రూపరసగంధంబు లింద్రియ విషయంబు లై యుండు; నింద్రియపంచకంబునకు షష్ఠం బై మనస్సుప్రకాశిల్లు; సప్తమాష్టమంబు లై బుద్ధియు నహంకారంబును వర్తిల్లు; సత్త్వంబును రజస్సును దమస్సును గుణంబు లై యుండు; నీ చెప్పంబడిన మహాభూతప్రముఖ ప్రపంచంబంతయు నవ్యక్తం బను తత్త్వంబునం దావిర్భావతిరోభావంబులం బొందుచుండు. 85
క. అవ్యక్త తత్త్వ మరయఁగ | నవ్యక్తం బయ్యు నిట్టి దై లక్ష్య మగున్‌
సువ్యక్తేంద్రియ భూతా | ది వ్యవహారార్థ లింగదృష్టాకృతి యై.
86
వ. అని చెప్పి మఱియు ని ట్లనియె. 87
తే. అనఘ! శబ్దాది విషయంబులందుఁ దగిలి | యిచ్చఁ జరియించు నెప్పుడు నింద్రియములు;
బుధుఁడు దత్స్వభావముఁ దనబుద్ధి నెఱిఁగి | యేమఱక వానిఁ దగఁ గుదియింప వలయు.
88
ఉ. ధీరుఁడు నిర్జితేంద్రియుఁడు దెల్లముగాఁ దనుఁ గాంచు భూత వి
స్తారనిగూఢ మైన పరతత్త్వముగాఁ, దనయందు భూత వి
స్తారము నెల్లఁ గాంచు సతతస్ఫుటదర్శనుఁ డై సమగ్ర వి
స్ఫారతఁ బొంది నిర్మలతపంబులయందుఁ జలింప కెన్నఁడున్‌.
89
క. తప మనఁగ సకల విషయ | వ్యపేత మగు నట్టి బుద్ధివైభవము సుమీ!
తపమున సుస్థిరుఁ డగు యో | గపరునకుం గలవె యొండు కర్తవ్యంబుల్‌.
90
క. స్వర్గనరకంబు లింద్రియ | వర్గ సమాచరణమునన వచ్చును వినవే!
స్వర్గ మగుఁ దన్నివారణ | దుర్గతి యగుఁ దన్నిరోధ దుర్బలతమెయిన్‌.
91
చ. అరదము దేహ, మింద్రియము లశ్వము, లాత్ముఁడు సూతుఁ డమ్మహా
తురగచయంబు ధైర్య మను తోరపుఁ బగ్గములన్‌ దృఢంబుగా
నురవడిఁ బోక యుండ వెర వొప్పఁగఁ బట్టినవాఁడు సేమపుం
దెరువున నేఁగు నప్పరమధీరుఁడు సువ్వె యుదారుఁ డెయ్యెడన్‌.
92
తే. ఇంద్రియంబులు దివిచిన యెడక పాఱు | చుండు మన సెప్డుఁ; దద్వేగ ముడుపకున్న
నెడలి చెడిపోవు బుద్ధి యుదీర్ణపవన | హతిఁ బయోనిధిలోఁ గల మవియు నట్లు.
93
క. ఏనింద్రియములు మనసును | బూని తనవశంబ యైన బురుషుండు గదా
ధ్యానసమాధిసమగ్రుఁడు | వానిం గీర్తింతు రమరవరులున్‌ మునులున్‌.’
94
వ. అనిన నవ్విప్రుండు సత్త్వరజస్తమోగుణంబులతెఱం గెఱింగింపు మనిన నెఱు కి ట్లనియె. 95
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )