పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
కుమారస్వామి సప్తమాతృకల బాలగ్రహంబులఁ జేయుట (సం. 3-219-18)
ఆ. అనిన నగుచు నాతఁ ‘డట్లేల వారల | పేర్మి మాన్పఁ దగవె? ప్రీతి నొండు
వరము వేఁడుఁ డిత్తు వదలక’ యనుడు నా | స్కందమాత లనిరి గారవమున.
247
క. ‘అగుఁగాక యట్ల; యే మీ | జగములఁ గల శిశువులకు నజస్రముఁ బీడల్‌
దగ నొనరించుచు నీ కృప | నెగడెద; మివ్వరము మాకు నీ వొసఁగఁ దగున్‌.’
248
వ. అనినం గార్తికేయుం డి ట్లనియె. 249
క. ‘అక్కట! కీడు దలంచితి; | రిక్కార్యము దగవె? యైన నిచ్చితి; మీకున్‌
మ్రొక్కినఁ గొల్చిన వేఁడిన | నక్కటికముతోడఁ గావుఁడమ్మ శిశువులన్‌.
250
క. పాయక పదియాఱేఁడుల | ప్రాయమునందాఁక నరుల బాధింపుఁడు మీ
రాయత మదంశజనితు న | జేయు నొకని మీకు రక్షఁ జేయం బనుతున్‌.
251
వ. అని పలికి యమ్మహాసేనుండు నిజదేహంబునం గాంచనవర్ణుండైన పురుషు నొక్కరు నుత్పాదించిన వాఁడునుం, బుట్టి నప్పుడ యాఁకలి గదిరి తిరిగి నేలంబడి మూర్ఛితుం డైనం, గుమారుండు వానికిఁ జైతన్యం బొసంగె; నతండును స్కందాపస్మారం బను పేరి గ్రహం బై మాతృకాగణరక్షకుం డయ్యె; మఱియు శకుని మాత యైన వినతయు, దైత్యమాత యైన దితియు, గోమాత యైన సురభియు, శునకమాత యైన సరమయు, వృక్షమాత యైన కరంజయు, సర్పమాత యైన కద్రువయుఁ, గుమారుదాది యైన లోహితాస్యయు మాతృగణ సమన్వితలై గర్భపీడనంబును, శిశుపీడనంబునుం జేయుచు, మనుష్యులవలన బలిమంత్రోపహారదాన తర్పణంబులఁదృప్తింబొంది బాలురకు నాయురారోగ్యసుఖంబుల నొసంగుదురు; షోడశ వర్షంబుల మీఁదఁ గొన్నిగ్రహంబులు గలవు చెప్పెద; వినుము. 252
సీ. నిద్రించుతఱి నొండె నెఱయ మేల్కని యున్న | తఱి నొండె సురసముదయముఁ గాంచి
బ్రమసి పల్వలుకులు పలుకు మానవుఁ జోఁకు | నదియ దేవగ్రహ మని యెఱుంగు
నది శయానుం డయ్యు నాసీనుఁ డయ్యుఁ బి | తృశ్రేణిఁ గని యున్మదించె నేని
నది పితృ గ్రహము భ్రాంతాత్ముఁ డై నరుఁడు గం | ధర్వులఁ గనిన గాంధర్వ మనియుఁ
 
తే. బరఁగు గ్రహము చోఁ కది కాలపర్యయమునఁ | గదిరి భ్రమియించె నేని యక్షగ్రహంబు
వాత పైత్యాది వికృతుల వలన బుద్ధి | దప్పుటయు నొక్క గ్రహవైకృతంబ యండ్రు.
253
క. విను డెబ్బది యేఁడుల దాఁ | కను మానవులకు గ్రహోపఘాతంబులు గ
ల్గు; ననంతరంబ గ్రహముల | పని వలవదు; ముదిమి యెల్ల పనులకుఁ జాలున్‌.
254
క. నియతి గలిగి యింద్రియముల | జయించి శుచులైన శాంతిసంపన్నులకున్‌
భయ మొనరింపఁగ లే వ | వ్యయ పుణ్యా! గ్రహము లే యవస్థల యందున్‌.
255
వ. మఱియు నొక్కటి సెప్పెద. 256
ఆ. ఆదిదేవుఁడగు మహాదేవుమీఁద నె | వ్వాని మనసు భక్తివైభవమున
నుల్లసిల్లు నతని నెల్లకార్యముల డ | గ్గఱదు సూవె గ్రహవికారవితతి.’
257
వ. అని చెప్పి మార్కండేయుం డిట్లనియె; ‘నట్లు గుహుండు గ్రహంబుల నియోగించు నెడ నగ్నివల్లభ యల్లన నతనిం జేర నరిగి యి ట్లనియె; 258
తే. ‘పుత్త్ర! విను మేను దక్షునిపుత్త్రి; నన్నుఁ | బావకుని కిచ్చె మా తండ్రి బాల్యమునను;
నన్ను నతఁ డొల్లఁ డెంతయు; నాకుఁ బతికి | నెపుడు నెడ లేని పొందుగా నీ వొనర్పు.’
259
వ. అనిన నగ్నిభవుండు ‘మహాద్విజులు వహ్నియందు హవ్యంబులు స్వాహాకార కలితంబు లైన మంత్రంబుల నొసంగువారు; దానంజేసి నీకుఁ బ్రియునితోడి నిత్యసహవాసంబు సిద్ధించు’ ననియె; నప్పుడు సకల మునిగణ సమేతుండై చనుదెంచి కమలాసనుండు మహాసేను నభినందించి, యంతకు మున్న సన్నిహితుండై యున్న మహాదేవు దెసఁ జూచి, యతని కి ట్లనియె. 260
ఆ. ‘అనఘ! యితఁడె త్రిపురహరుఁడు త్రిలోచనుం; | డిదె త్రిలోక మాత హిమనగేంద్ర
తనయ; వీరు నీకుఁ దల్లియుఁ దండ్రియుఁ | జువ్వె! వీరిఁ గొల్వు సుచిరభక్తి.
261
వ. అగ్నిదేవునియందును దదీయ భార్యయందును దారు నిజయోగబలంబునం జేసి యావేశించి, యా దంపతులు లోకహితార్థంబుగా నిన్నుం గని’ రని చెప్పినఁ, బార్వతీ నందనుండు సానందహృదయుం డయి, సకలలోక గురువు లైన పార్వతీ పరమేశ్వరులం బూజించి, సంస్తుతించె; నంత నింద్రుండు కార్తికేయునకు నైరావణ భూషణం బైన ఘంటాద్వయంబు నొసంగిన, నం దొక్కటి కుమారుండు గైకొని యొక్కటి విశాఖున కిచ్చెం; బదంపడి. 262
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )