| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
అంతఁ బ్రహృష్టాత్ముఁడై లలితాంబరా | భరణాంగరాగవిస్ఫురితమూర్తి నొప్పారి విభుఁడు సహోదరులును గర్ణ | గాంధారులును బ్రియబాంధవులును సముచిత వాహన సైన్య సమేతులై | కొలువంగ వెడలె నుజ్జ్వలవిభూతి నాందోళికాది వాహనములఁ దత్ప్రియ | ప్రమదలు బహుసహస్రములు సనిరి |
|
| ఆ. |
కడఁగి పౌరు లెల్లఁ గైసేసి పడఁతులుఁ | దారు నడచి రతిముదంబుతోడఁ బ్రకట శకట వైశ్య పణ్యాంగనాది సం | కులత నుల్లసిల్లె ఘోషయాత్ర. |
373 |
| వ. | మఱియు నమ్మహీపతి పయనంబున కనురూపంబుగా నెనిమిదివేలు రథంబులు, ముప్పది వే లేనుంగులుఁ, దొంబది వేలు గుఱ్ఱంబులు, శతసహస్రసంఖ్య కాల్వురుం గల మహాసైన్యంబుతోడ నడిచె; మృగయాకుశలు లైన మృగయులును, విట విదూషక వంది వైతాళికాది జను లనేకు లనుగమించి; రిట్లు గవ్యూతిమాత్రం బగు నేల యరిగి, యచ్చట విడిసి యద్దినశేషంబును రాత్రియుం గడపి, మఱునాఁడు వివిధ గిరిగహనంబు లతిక్రమించి ఘోషంబు లున్న వనంబు సొచ్చి, యం దొక్క రమణీయప్రదేశంబున శిబిరంబు గావించి యమ్మనుజేంద్రుండు. | 374 |
| సీ. |
నానా సహస్ర సంఖ్యానంబులై సంత | తానంద విగతభయత్వ లీల నక్కాననమున నే దిక్కు సూచిన నతి | సంకులంబుగఁ గుంద శంఖ చంద్ర హార నీహార డిండీర పటీర ము | క్తాహార హీర సంకాశములును గాదంబ కాలేయ కాదంబినీ నీల | జాల తమాలికా సన్నిభములు |
|
| తే. |
ప్రౌఢబంధూకపల్లవ భాసితములు | వికచ కాంచన చంపక విస్ఫుటములు నైన వర్ణంబు లొప్ప నేత్రాభిరామ | భంగి నలరారు గోకదంబములఁ గనియె. |
375 |
| వ. | కని తదీయసమృద్ధికి సంతసిల్లుచు గోపాలజనంబులు సవినయంబుగాఁ దన్నుం గాంచిన నాదరించి వారు దనకు నగ్గోవులపేళ్ళును లక్షణంబులు నేర్పడి నెఱింగించుచుండఁ బేరువేఱ వత్సంబులు వత్సతరంబులు మహోక్షంబులు ధేనువులు దర్ణకంబులు మొదలైన గోవిశేషంబుల నాలోకించుచు నయ్యైవిధంబులఁ బసికిం దగిన రక్షణంబు గావింప నర్హ జనంబుల సవిశేషంబుగా నియోగించి, మఱియును. | 376 |
| క. |
గోపాలసమన్వితుఁ డై | యా పొలమునఁ దిరిగి గోరసాస్వాదనలీ లా పరితృప్తిఁ దలిర్చె మ | హీపాలుఁడు నెమ్మితోడ నిష్టులుఁ దానున్. |
377 |
| వ. | తదనంతరంబ గాయక నర్తకాదులు వంది మాగధ జనంబులుం గనిన నాదరించి, వారికి నభిమతధనంబు లొసంగి, మృగయావినోదంబునకుం దొడంగి. | 378 |
| మ. |
హరిణవ్రాతములం గలంచుచు నుదగ్రానేకపశ్రేణిఁ జె చ్చెర బంధించుచు నుగ్రసింహనివహచ్ఛేదైక సక్రోధబం ధురతం బేర్చుచుఁ బ్రస్ఫురన్మహిషశార్దూలోద్ధతక్రోడ ని ర్భరపాతంబు లొనర్చుచుం దిరిగె భూపశ్రేష్ఠుఁ డక్కానలోన్. |
379 |
| వ. | మఱియు ననవరతసురభిసరసీరుహప్రకరకీర్ణంబు లగు జలాశయంబు లాలోకించుచు, నతిమనోహర ప్రసూనఫలభరితపాదప వనాభ్యంతరంబుల విహరించుచు, మన్మథ మయూర మధుకర కీర కోకిలాలాప కోలాహలంబు లాకర్ణించుచుఁ; గ్రమంబునం బరిజనసమన్వితుండై ధార్తరాష్ట్రుండు ద్వైతవన సరోవరంబు సేరం జనియె; నంత నట ధర్మతనయుండు తత్సమీపంబున మునిజనసహాయుండై వన్యంబు లగు మూల ఫలవిశేషంబులు సాధనంబులుగా సద్యస్కందం బను యజ్ఞంబు సేయుచుండె; నప్పుడు దుర్యోధనుండు నిజభృత్యజనుల నక్కొలనిదరిం గ్రీడాగృహంబులు నిర్మింప నియోగించిన. | 380 |
| క. |
వారును సంభ్రమమున న | వ్వారిరుహాకరముపొంత వదలక క్రీడా గారములు గట్టఁ దొడఁగుడు | వారించుచు బాఱుతెంచి వడి గంధర్వుల్. |
381 |
| వ. | ‘ఇది చిత్రసేనుం డను గంధర్వపతికిం గ్రీడార్థంబు కల్పితం బైనది గావున మీ రిక్కొలను సేరక తొలంగి పోవునది’ యనిన వారు మగుడం జని, దుర్యోధనునకుఁ జెప్పుటయు, నతండు రణదుర్మదు లైన సైనికులం గొందఱం బంచిన, నరిగి వారలు గంధర్వుల కిట్లనిరి. | 382 |
| మ. |
‘బలియుం డా ధృతరాష్ట్రసూనుఁడు మహాబాహుండు దుర్యోధనుం డలఘుం డీ కమలాకరంబునకుఁ గ్రీడార్థంబు గౌతూహలం బెలయంగాఁ బ్రియకామినీసహితుఁడై యేతెంచుచున్నాఁడు మీ ర్వల దిందుండఁ, దొలంగి పొం’ డనవుడున్ వారుద్ధతక్రోధులై. |
383 |
| వ. | ఒండొరువుల మొగంబులు సూచి పెలుచ నవ్వి వారల కిట్లనిరి. | 384 |
| క. |
‘ఎదిరిం దన్ను నెఱుంగఁడు | మదమునఁ బ్రాణంబుఁ దనదుమానముఁ గోల్పో మదిఁ దలఁచినాఁడు మీనృపుఁ | డిది యేటికిఁ జెనఁటిచెయ్వు లిన్నియు నిచటన్. |
385 |
| వ. | బుద్ధిమంతుల రై యూరక చనుట లెస్స యనుం’ డనినం గ్రమ్మఱి చని వారు కురుపతికిం దద్వచనంబుల తెఱం గంతయుం జెప్పుటయు, నతండు రోషావేశవివశుం డై తమ్ముల దొరలం జూచి, ‘మీ రిందఱు మీ మీ సైన్యంబులతోడం గూడి కడంగి, దుర్వినీతు లైన గంధర్వులగర్వంబు మాన్పి సరోవరం బాక్రమించునది; వారికి సహాయుం డయి సురగణసమేతంబుగ నింద్రుండు సనుదెంచె నేనియు నవలీల జయించునది’ యని నియోగించిన. | 386 |
| క. |
అతులచతురంగసేనా | న్వితు లయి ధృతరాష్ట్రసుతులు నిరతిశయ రయో ద్ధతసింహనాదబధిరీ | కృదిఙ్ముఖు లగుచుఁ జనిరి గినుక యెలర్పన్. |
387 |
| వ. | ఇట్లు సనుదెంచు కురువీరుల కడ్డంబు వచ్చి కొందఱు గంధర్వులు ప్రియపూర్వకంబుగా ‘నిట యేల వచ్చెదరు? మీకు మాతోడి విద్వేషం బేటికి? నిలువుం’ డనినం బెలుచ నార్చి సేనాగ్రచరులు వారలమీఁదం బ్రచురశస్త్రాస్త్ర పాతంబు సేయం దొడంగినం, దొలంగి చని, యా గంధర్వు లాక్షణంబ చిత్రసేనునకు నంతయుఁ జెప్పి పుచ్చినం, బ్రబలరోషరంజితాననుండై యతండు. | 388 |
| క. |
‘చనుఁడు రయంబున నా దు | ర్జనులం గౌరవులఁ బొదివి సమయింపుఁడు మీ’ రని బహుసహస్ర సంఖ్యులఁ | బనిచెను గంధర్వవరులఁ బ్రకటితబలులన్. |
389 |
| వ. | ఇట్లు పనిచిన. | 390 |
| ఉ. |
ఆయత కుంత కార్ముక గదాసి పరశ్వధ శూల పట్టిసా ద్యాయుధ ఘోరహస్తులు గులాచలతుంగతనుల్ ప్రచండతే జోయుతు లా వియచ్చరులు శూరతమై నడతెంచి బల్విడిం గో యని తాఁకి రుగ్రరణకోవిదులై కురురాజసైన్యమున్. |
391 |
| వ. | ఇవ్విధంబున గంధర్వులు బెట్టిదంబుగాఁ గిట్టి నొప్పింపం దొడంగినం గలంగి దుశ్శాసనాది కౌరవులు ససైన్యంబుగాఁ దెరలి దుర్యోధను చేరువకుం బఱచినఁ, గర్ణుం డొక్కరుండ సుస్థిరుం డయి నిలిచి గంధర్వుల నిలువరించి భల్లార్ధచంద్ర ప్రముఖ బహులబాణపాతంబులం దదీయదేహంబులు ఖండించుచు నిమిష మాత్రంబునఁ జిత్రసేను సైనికశతంబుల రూపుమాపుటయు, మఱియుం బైపై గంధర్వులు శతసహస్ర సంఖ్యులు తోఁతెంచినం బృథివి యెల్లను గంధర్వమయం బై నట్లుండె నప్పుడు. | 392 |
| చ. |
శకునియుఁ దమ్ములుం బ్రబలసైన్యముతో నడతేర నాహవో త్సుకమతి యై సుయోధనుఁడు సూతతనూభవుఁ డున్నచోటికిం బ్రకటభుజోగ్రతం గడఁగి బల్విడిఁ దద్రిపుకోటిఁ దాఁకినన్ సకలజగద్భయంకరలసత్సమరోత్సవ మయ్యె నయ్యెడన్. |
393 |
| క. |
కొండొకసేపునకు మహో | ద్దండనృపానేకఘోరతరవిశిఖవ్యా ఖండిత శరీరులై ధృతి | ఖండితముగఁ బల్లటిలిరి గంధర్వు లనిన్. |
394 |