పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము
బ్రహ్మ రావణ కుంభకర్ణ విభీషణులకు వరంబు లిచ్చుట (సం. 3-259-26)
వ. ‘మనుష్యజాతి యొక్కండుదక్క నీ చెప్పిన యందఱవలనను నీకు మరణభయంబు లే’ దని పలికి, పరమేష్ఠి గుంభకర్ణుం జూచి ‘వరం బడుగు’ మనిన వాఁడు దైవోపహతుండై తనకు నాత్యంతికం బయిన నిద్ర యడిగిన నట్ల యగు నని, విభీషణున కభిముఖుం డగుటయు నతండు కృతాంజలియై జలజాసనుఁ బ్రస్తుతించి. 281
క. ‘పరమాపద యైనపుడును | దురితంబులు నా మనంబు దొడరమియును భా
సుర మగు బ్రహ్మాస్త్రమ్మును| గరుణింపవె’ యనిన నిచ్చి కమలజుఁ డనియెన్‌.
282
క. ‘నిరతము రాక్షసభవమును | బొరసియు నీ విట్లు ధర్మబుద్ధి వగుట య
చ్చెరు విది గావున నీకును | దిరముగ నమరత్వ మిచ్చితిం గృప వత్సా!
283
వ. అని పలికి పితామహుం డంతర్హితుం డయ్యెఁ; దదనంతరంబ. 284
మ. వరగర్వోన్నతుఁ డై దశాననుఁడు దుర్వారోద్ధతిన్‌ దాడిమై
నరిగెం గిన్నరనాథుపై; నతఁడు కార్యం బాత్మ నూహించి సం
గరసన్నద్ధుఁడు గాక కింపురుష యక్షశ్రేణితోఁ గూడఁ దా
నరిగెన్‌ లంకఁ బరిత్యజించి రభసోద్యత్పుష్పకారూఢుఁడై.
285
వ. ఇ ట్లతండు గంధమాదనంబునకుం జనునెడ వెన్నడిం దగిలి దానవుండు వాని మానంబుతోన విమానంబు నపహరించినం గనలి యక్షేశ్వరుండు ‘గురుండ నగు నన్ను నవమానించితివి గావున నివ్విమానంబు నీ పగతు పా లయ్యెడు’ మని శపించె నంత. 286
క. రాక్షసలక్ష్మీమహిమకు | రక్షకుఁడుగఁ బంక్తిముఖుని రాక్షసమాయా
దక్షు నభిషిక్తుఁ జేసిరి | రాక్షసబేతాళవరులు రాగం బెసఁగన్‌.
287
వ. వాఁడును బలదర్పమోహితుండై కడంగి యింద్రాదిదేవతల నొడిచి తత్పదంబు లాక్రమించి, యీసు మిగిలి జగద్రావణంబు సేయుటం జేసి, రావణుం డను పేరం బ్రఖ్యాతి వహించి సకలభూత భయంకరుం డయ్యె; నట్టియెడ దేవర్షులును, రాజర్షులునుం గూడి చని తత్ప్రకారం బగ్నిదేవునకుం జెప్పిన, నతండు వారిం దోడ్కొని వారిజాసనుపాలికిం జని యి ట్లనియె. 288
ఉ. ‘భూరిభుజుండు విశ్రవసుపుత్త్రుఁడు పంక్తిముఖుండు దర్పదు
ర్వారుఁడు రాక్షసేంద్రుఁడు భవద్వరశక్తి నవధ్యుఁ డై మహా
ఘోరముగాఁ ద్రిలోకములకుం గడుఁ బీడ యొనర్పఁ జొచ్చె వృ
త్రారి పురోగమత్రిదశు లందఱుఁ గింకరు లైరి వానికిన్‌.
289
ఉ. దానవుచేతఁ గష్టపడి దైన్యము నొందుట కోర్వలేక నీ
దైన పదాంబుజంబు లభయం బని చేరితి; మింక మమ్ము నె
ట్లైనఁ గృపార్ద్రమానసుఁడ వై తగఁ జేకొనవయ్య! మాకు ది
క్కైనను గాకయున్నఁ గమలాసన! నీవ కదయ్య యెయ్యెడన్‌.’
290
వ. అనినంబరమేష్ఠివారల కిట్లను; నిక్కార్యంబునకు నేను మున్న తగిన యుపాయంబు నిశ్చయించి నారాయణుం బ్రార్థించితి; నద్దేవుండు మనుష్యభావంబున నవతరించి, యా రాక్షసు వధియించువాఁ డయ్యె; నింద్రాది సురులునుం దమ తమ యంశంబులంజేసి ఋక్షవానరజాతులయందు జనియింపఁగలవారు; మీకు భయంబు వలవ’ దని యగ్నిప్రముఖు లైన యమ్మహామునుల సమ్ముఖంబున దుందుభి యను గంధర్వ కామినిం బిలిచి ‘నీవు కుబ్జరూపంబున మంథర యను పేర భూలోకంబున నుద్భవించి నీ నేర్చు విధంబున దేవకార్యంబులు నిర్వహింపు’ మని పనిచి వారి వీడ్కొలిపెఁ; బదంపడి దివిజుల యంశావతారంబులం. జేసి. 291
మ. గురుశైలోన్నతగాత్రు లుద్ధత భుజో గ్రుల్‌ వజ్రపాషాణ క
ర్కరు లర్కప్రతిమానతేజులు, గుణాకల్పుల్‌, మహాకల్పభీ
కరకాలాంతకకల్పు లాజినిపుణుల్‌ గర్వోన్నతుల్‌ ఋక్షవా
నర వీరుల్‌ జనియించి రెల్లయెడలన్‌ నాగాయుతప్రాణులై.
292
క. అన విని యుధిష్ఠిరుం డ | మ్మునివరుతో ‘ననఘ! ధర్మమూర్తిని నా రా
ముని నేల యరణ్యంబున | కనిచెను దశరథుఁడు సెపుమ యక్కథ నెల్లన్‌’.
293
వ. అని యడుగుటయు మార్కండేయుం డిట్లనియె: ‘దశరథుండు నిజ సుకృత పాకంబునం జేసి రామ ప్రముఖులయిన కొడుకుల నలువురం గని, త్రైలోక్యరాజ్యంబు సంప్రాప్తం బయినయట్లు సంతసిల్లె; నక్కుమారులు క్రమంబున నుపనీతులు నఖిలవేదవేదాంగవినీతులు, యథాక్రమ పరిణీతులు నై విలసిల్లి రంత. 294
సీ. అభినవపద్మదళాక్షు నక్షీణవి | స్తృతవక్షు నాజానుదీర్ఘబాహు
మధురస్మితానను మదగజగమను నా | రూఢయౌవను నభిరూపతేజు
శ్రీరమణీయుఁ బ్రసిద్ధయశోరమ్యు | నిఖిలవిద్యాగమనిపుణచిత్తు,
నింద్రసమాను జితేంద్రియు ధర్మజ్ఞుఁ | బౌరబాంధవజనప్రార్థనీయు
 
ఆ. దుష్టనిగ్రహైకధుర్యు విశిష్టసం | రక్షణాభిలోలు రామభద్రుఁ
గులపవిత్రుఁ బెద్దకొడుకుఁ గనుంగొని | రాజవరుఁడు గరము రాగ మెసఁగ.
295
వ. యౌవరాజ్యపదంబునకు నతని నభిషేకం బాచరింపం గోరి యాప్తమంత్రిజనసమ్మతంబునఁ బురోహిత నిరూపితం బైన శుభదినంబున నక్కార్యంబునకు సమకట్టునెడ భరతు దాది మంథర యనునది యమంద గతిం గైకేయిపాలికిం జని యిట్లనియె. 296
ఉ. ‘అక్కట నీదెసం బతికి నాఱడి కూరిమి యయ్యె; మాయపుం
జొక్కులు నీవు నిక్కముగఁ జూచి మనంబున మోసపోయి; తా
టక్కరి కోసలాత్మజయెడం బ్రియుఁడై యదె తత్తనూజు నిం
పెక్కఁగ యౌవరాజ్యమున నిప్పుడ పట్టము గట్టఁ బూనెడున్‌.
297
ఆ. పుడమిఱేని మదికి నెడ యైతి నీ వింక; | నేమి సెప్పఁగలను వామనయన!
కడఁగి నిన్నుఁ గొడుకుఁ బెడవడ వైచి యా | సవతికొడుక యేలు నవని యింక’.
298
క. అనిన నుదరిపడి కేకయ | తనూజ గడుసంభ్రమమునఁ దత్‌క్షణమ నరేం
ద్రునిపాలికిఁ జని యేకత | మున నిట్లనుఁ బ్రణయపూర్వముగ నాతనితోన్‌.
299
క. ‘ధరణీశ! తొల్లి నాకుం | గరుణించిన వర మొకండు గల; దది మదిలోఁ
బరికించి యిప్పు డొసఁగుము; | చిరముగ సత్యవ్రతంబు సెల్లింపు తగన్‌.’
300
వ. అనిన నతం డయ్యతివం గనుంగొని ‘యవధ్యుల వధియించుటయును, వధ్యులం గాచుటయును, బ్రాహ్మణ ధనంబులు దక్క నన్యులధనం బపహరించుటయును, నభీష్టధనంబు నిచ్చుటయును మొదలుగా నతి దుష్కరంబులైన వాని నైనను భవత్ప్రియార్థము సేసెద; నెయ్యది సెప్పు’ మనిన ప్రీత యై భరతమాత యి ట్లనియె. 301
తే. ‘యౌవరాజ్యపదంబునయందు భరతు | నధిప! యభిషేక మొనరింపు; మడవిలోన
నొలసి పదునాల్గువర్షంబు లుండ నాన | తిమ్ము రాముని; నురువర మ్మిదియ నాకు’.
302
క. అనవుడు వీనులు గొఱవిం | గొని చూఁడిన యట్టు లైనఁ గువలయపతి పె
ల్చన పిడు గడఁ చిన క్రియఁ జే | తనరహితుం డగుచు ధరణితలమునఁ బడియెన్‌.
303
వ. అంతయు నెఱింగి రాఘవుండు నిజజనకుండు సత్యప్రతిజ్ఞుండు గావుత మని యాక్షణంబ సీతాసమేతుండయి వనంబునకు వెడలె; నతని పిఱుందన లక్ష్మణుండునుం జనియెఁ; దదనంతరంబ. 304
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )