పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ప్రథమాశ్వాసము
దేవస్థానుం డను ముని ధర్మజునకు హితోపదేశంబు సేయుట (సం. 12-20-1)
సీ. ధనము లుత్కృష్టంబు లను ధనంజయు మాట | పాటిగాఁ గొనుము; సోపానభంగి
నున్నది మార్గంబు యోగసమారోహ | ణమునకు; దానన నడచి కాక
వడి నుల్కిపడ నీకు వచ్చునే? ధనసంగ్ర | హంబు భోగార్థ కృతంబు దుష్ట
మగుటయుఁ గలదు; యజ్ఞార్థ కృతంబైన | నదియ నిచ్చెన బ్రహ్మపదము నొంద;
 
తే. యజ్ఞపరిశిష్ట ధనభోగ మాత్మకలఁక | యుడుపు; నమ్మెయి శమదమయుక్తి గలుగు;
శమము దమమును దత్త్వ విజ్ఞానదములు | గాన దక్షిణాధిక యజ్ఞకర్త వగుము.
144
చ. హరుఁడును సర్వమేధ మను యాగమునం బ్రచుర ప్రకాశతం
బొరయఁగ వేడ్కఁ జేసె విధిపూర్వ దిగీశముఖామరుల్‌ మహా
ధ్వరములఁ గాదె పేర్కొనుట ధాత్రి సధర్మత నేలి యజ్ఞ త
త్పరత వెలుంగరే నృపులు, పార్థివముఖ్య! మరుత్త ముఖ్యులున్‌.
145
వ. వినుము దివస్పతి యడుగ బృహస్పతి సన్మార్గ నిర్దేశకుండై చెప్పిన మార్గంబు. 146
ఉ. కామముఁ గ్రోధమున్‌ మనసుఁ గాడఁగఁ బాఱుట మాన్చి యింద్రియ
స్తోమ విమార్గ వర్తనము ద్రుంచుచు నెవ్వగ లేక రక్షణం
బేమర కెవ్వరిం జెనకి యించుక నొంపక లోక మేలఁగా
నా మహితాత్ము సర్వమహిమాతిశయంబును జెందు వాసవా!
147
వ. అనియె మఱియు నాకర్ణింపుము. 148
ఉ. కర్మము మేలు నా విగతకర్మము మేలన రెండు నొప్పునే?
కర్మఫలంబు నర్పితముగాఁ దగ నీశ్వరునందుఁ జేఁత స
ద్ధర్మముగా కనంగ వివిధంబగు ధర్మపథంబులోన మేల్‌
ధార్మికవర్య! యేర్పఱుపఁ దా వశమే వగ బుద్ధి గుందఁగన్‌.
149
ఉ. కావున సిద్ధ్యసిద్ధుల వికారముఁ బొందక ద్రోహ మెయ్యెడన్‌
వావిరిఁ జేయ కేలు భువనంబు భవత్కుల ధర్మరక్షివై!
భూవరు లిట్లు సేసి, తుదిఁ బుత్రుల గద్దియలందు నిల్పి కా
దే వనవాసు లైరి దృఢదీప్త నిరంజన బోధసంపదన్‌.
150
వ. అనిన విని నిర్విణ్ణమానసుండై యున్న యన్నకు నర్జునుం డిట్లనియె. 151
సీ. ‘క్షత్రియ ధర్మ నిష్ఠాపరత్వంబున | సమరంబు సేసితి; శస్త్రనిహతిఁ
బూతాత్ములై రిపుల్‌ వోయిరి సద్గతి; | కమ్మెయి రాచకర్మ మ్మొనర్చు
విప్రునకైనను సుప్రశస్తం; బది | రౌద్రం బగుట బాలురకును దెల్ల
మైనను నిట్లుండు నార్యోక్తి; నృపనీతి | దురితంబు సేయునే? యొరుఁడు వెట్టఁ
 
ఆ. గుడువ నృపతి మాత్రకునకును గాదన్నఁ | గౌరవాన్వయాగ్రగణ్యుఁ డైన
నీకుఁ దగునె? విడువు శోకంబు; వజ్రస | న్నిభము గాదె నృపుల నెమ్మనంబు.
152
వ. అట్లుంగాక. 153
ఉ. వైరివధంబు నీకును నవశ్యముఁ జేయక పోవరానిదై
వైరులకున్‌ భవత్సమరవాంఛన సద్గతి కేఁగఁ బాలి దై
చేరె విధాతృ సంఘటనఁ; జింతకుఁ గారణమేమి? ధర్మ వి
స్తార విదుండ వీ; వకట! ధైర్య సమగ్రుఁడవై వెలుంగవే.
154
వ. రాజధర్మోపాత్తంబై భవదాయత్తంబైన పూజ్యసామ్రాజ్యంబుఁ బరిపాలించుచుఁ బుణ్యక్రియానుష్ఠాన పరుండ వగు’ మని పలికిన మఱుమాట పలుక కున్న యన్నరేంద్రునకు మునీంద్ర వర్యుం డగు పారాశర్యుం డిట్లనియె. 155
సీ. ‘అర్జును పలుకు సత్యంబు సమీచీన; | మార్యజనంబు గృహస్థ ధర్మ
ముత్తమం బని చెప్పు నుర్వీశ! పశుపక్షు | లాదిగ జీవుల కాశ్రయంబు;
నృపులకు నది దక్కఁ దపమును దమమును | బ్రహ్మచర్యమును ధర్మములు గావు;
ధనములఁ దనియుట యని కోహటించుట | ప్రజల రక్షింపమి రాజకోటి
 
ఆ. కరయఁ బాతకంబు లండ్రు; నీ వక్కడ | వేదచోదనా ప్రవీణ మయిన
మనసు నేల యిట్ల మార్గవృత్తికిఁ జొర | నిచ్చె; దోపి ధరణి యేలు మనఘ!
156
క. నీ వార్యబోధితుండవు | గావే! వర్ణాశ్రమ ప్రకారములు వినం
గావలయునె ధర్మంబులు | భూవరునకు దండనీతిఁ బోలంగలవే!
157
వ. సుద్యుమ్నుండను ధరణీశుండు దండనీతిని కాదె యపవర్గంబు వడసె’ ననుటయు, నజాతశత్రుం ‘డాసుద్యుమ్ను వృత్తాంతంబు వినవలతు నానతి’ మ్మనిన నమ్మహీపతి కమ్మునిపతి యిట్లనియె. 158
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )