| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ప్రథమాశ్వాసము |
| తే. |
‘అర్థములు బంధువులుఁ గల్గినపుడు తద్వి | యోగమైనట్టి యెడను మర్త్యునకు నెద్ది తలఁపుమై నున్న మదవిషాదంబు లడర | కుండుఁ జెప్పవె యది కృపాయుక్తి ననఘ!’ |
211 |
| వ. | అని యడిగిన నాతం డిట్లనియె. | 212 |
| సీ. |
‘దుఃఖంబు సుఖమును దోడివ సంసార | మునకుఁ; దద్వశగతిఁ బోవు నరుని యాత్మ నంబుదము గా డ్పపహరించిన విధం | బున నవి సెఱుచు; నేపున సుఖైక భాగియు దుఃఖైకభాగియు లేమి లో | కంబునం దెలియంగఁ గనుట మందు వానికి; విను జర రానీక త్రోవంగఁ | జావక యుండ వశంబె జలధి |
|
| తే. |
వలయ వేష్టిత క్షితి నేలు వానికైన | నధిప! యెద్ది వాటిల్లిన ననుభవించు నపుడు ప్రాప్తవ్య మిది యని యంతరంగ | విభ్రమము లేక యునికి వివేక సరణి. |
213 |
| క. |
నరవర! సరసాన్నంబులుఁ | బరిమళ సద్వస్తువులును బరమశయన వి ష్టరములుఁ గాలాధీనత | నరుఁ బొందుం, బాయు; వాని నమ్మమియ యుఱున్. |
214 |
| చ. |
వల నధికంబుగాఁ గలుగు వైద్యులు శాస్త్రము లభ్యసించి మం దుల నొడఁగూర్ప నేర్చి తనదోషము లారయ బుద్ధి గల్గి యా ర్తులకుఁ జికిత్స సేసెదరు; రోగము వాయమి లేదె? వారు రో గు లగుట గానమెట్లు ప్రతికూలవిధిన్ నరునేర్పు ద్రోచునే? |
215 |
| సీ. |
సద్వంశ జన్మంబు సౌందర్యమును బలం |బును సుభగతయును భోగములును భవితవ్యతానురూపంబులు పేదలై | పెంచుట కలయంగఁ బెల్లు పుట్టు దురు ప్రజ లెంతయు సిరిగలవారు గో | రంగఁ బుట్టరు; దరిద్రపు జనంబు లాఁకటం దిని ఱాలు నఱిగించు కొందరు; | భోజ్య సంపన్నులు భోజనంబుఁ |
|
| తే. |
బూర్ణముగఁ జేయఁజాలరు భూపవర్య! | వెలఁది జూదంబు పానంబు వేఁట యతిని షేవితములు గాఁదగ దని చెప్ప వినుచు | వలను గలవార చెడుదురు వానివలన. |
216 |
| వ. | అట్టివి దైవకృతంబులు గావున నిష్టానిష్ట ప్రాప్తులకుం గారణంబులు గనికొనలేవు; బాంధవలాభంబును దద్వియోగంబును వఱదం గాష్ఠంబులు సంగతంబులై పదంపడి పాసిన చందంబు. | 217 |
| తే. |
మాతృ పితృ దార పుత్రక భ్రాతృ శతస | హస్రకంబులు సంసృతి ననుభవింపఁ బడియె; నిందులో నెవ్వరి కడలువాఁడు | నరుఁ డనిత్యత యూహించు టరయ నుఱవు. |
218 |
| క. |
జనన జరామరణ గ్రా | హనిబిడ కాలాబ్ధి మగ్నమని జగము నెఱిం గినవాఁడు ధర్మవర్తన | మున నుండుం జింత దక్కి భూపవరేణ్యా! |
219 |
| క. |
తన యొడ లెరవనినను మను | జునకును బంధుతతి సతమె? శోకించిన వ చ్చునె చచ్చిన జంతువు? నె | మ్మన మధికము నొచ్చుఁ గాక మహితవివేకా! |
220 |
| ఉ. |
కావున నెవ్వగల్ విడువు; గైకొను మాత్మకలార్హ కర్మ సం సేవన తత్పరత్వము; విశిష్టజనంబుల సంగతిన్ భవ ద్భావము కల్మషంబు దెగఁ బాచి శుచిత్వముఁ బొందు; లోకసం భావిత కీర్తి వయ్యెదు నృపాలక! నా పలు కూఁదు పాటిగాన్.’ |
221 |
| వ. | అనుటయుం దెలిసి జనకుం డమ్ముని నామంత్రితుంజేసి నిజకర్మతంత్ర నిర్వహణంబునకై గృహంబున నిలిచె; నీవు నట్ల యుమ్మలికం బుజ్జగింపు ముత్తమ క్షాత్త్ర సరణి సాధితంబైన భూవలయంబుఁ బాలింపుము; తక్కటి తలంపులు దక్కు’మని పలికిన విని పలుక కున్న యగ్రజుం జూచి సవ్యసాచి జనార్దనుతో నిట్లనియె. | 222 |
| క. |
‘బహుబంధుమరణ శోక | ప్రహత వివేకమయి ధర్మరాజునకు మనో మహిమ వికలమయ్యెం; | బర | మహిత వచోవృత్తిఁ దేర్పు మహితవిచారా! |
223 |
| వ. | అనిన నచ్యుతుండు పాండవాగ్రజుఁ జేరంజని, యభివందనం బాచరించి, యతని కరంబు వట్టికొని, వదనంబు విరిదమ్మి చందంబు నొంద మధురాక్షర విన్యాసంబుగా నిట్లనియె. | 224 |
| మ. |
‘పురుషవ్యాఘ్ర! మనంబు గుంద వగలం బొందంగ నీకేల? సం గరకేలిన్ భవదీయబంధు లతిలోకంబైన తెంపొప్పఁ బో యిరి నాకంబున; కట్లుగాక కలగాదే రాజవృత్తంబు దా నరయన్ రాజుల యేల? యేజనులు నిత్యాయుర్ధనుల్ సెప్పుమా! |
225 |
| వ. | అని పలికి వెండియు. | 226 |
| తే. |
‘తొల్లి సృంజయుఁ డను మహీవల్లభుండు | పుత్రశోకాతురత్వంబుఁ బొందియున్న నుపశమంబుగఁ బ్రాక్తననృపులఁ జెప్పి | తెలిపె నిమ్మౌని యంతకు బలిమి కలిమి.’ |
227 |
| వ. | అని యెఱింగించి నారదుం జూపి ‘యిమ్మహాత్ముం డట్లు మరుత్తసుహోత్రాదులగు రాజుల పరమోత్కృష్ట కర్మంబులును, నట్టివారికిం గాలవశత్వంబునం బొందకుండ రామియుం దెలియ నుపన్యసించిన వాక్యంబు లభిమన్యు మరణశోక వ్యాకులుండ వగు నీకుం దాపోపశమంబుగాఁ గృపాతిశయంబునం బరిపాటి వీరలు సెప్పి’రని పారాశర్యమునీశ్వరు నిర్దేశించి, ‘వీరి వచనంబుల యేనునుం జెప్పెద నాకర్ణింపు’ మని యిట్లనియె. | 228 |