| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | ఇట్లు నితాంతకాంతిప్రకారుండై పాండవాగ్రజుండు పాండురాజాగ్రజు నతని దేవిం బ్రభూతాందోళికారూఢులం జేసి పురస్కరించుకొని శైబ్య సుగ్రీవ మేఘపుష్పవలాహకంబు లను వాహంబులు పూనినరథంబున సాత్యకి సహితుండయి వెలుంగు వెన్నునిం బిఱింది దెసం బెట్టికొని, యతని కెలన మనోజవంబులగు హయంబులం బూన్చిన యవదాత స్యందనంబున యుయుత్సుం డరుగుదేర, నుచిత వాహనారూఢుండై విదురుండు కుంతీప్రముఖ కురుస్త్రీజనంబుల నందలంబుల నిడికొని వెనుకనడవ, నరేంద్రులు నానాముఖంబులం దమతమ సేనల తోడం గూడఁ గొలిచి చనుదెంచుచుండం జనునప్పుడు. | 350 |
| క. |
ద్విరదంబుల నరదంబులఁ | దురగంబులఁ గాల్బలములఁ దూర్యంబుల సీ గిరులన్ గొడుగులఁ బడగలఁ | బరిస్ఫురిత మయ్యె నతని పయనంబు గడున్. |
351 |
| వ. | మఱియును. | 352 |
| క. |
వందిజనులుఁ బాఠకులుం | గ్రందుకొనం బొగడఁ జదువఁగా మాగధు లా నందముగఁ బాడ నుచితపు | మందత్వము గమనమునకు మహిమ యొనర్పన్. |
353 |
| వ. | అన్నరనాథుండు నడచి నాగనగరంబు ప్రవేశించె; నంతకుమున్న యందలి జనంబులు గలువడములును దోరణంబులను గ్రముక కదళీస్తంభపూర్ణకుంభ స్థాపనంబులను కస్తూరి కలయంపులను గర్పూరపు మ్రుగ్గులను బుష్పోపహారంబులను బ్రాలంబమాలికలను నొప్పు మిగుల నప్పురం బలంకరించి, యాబాల వృద్ధంబుగాఁ బరమాంబరానులేపన మాల్య భూషణంబులం బొలిచి, బహుల ప్రమదంబున సమ్మర్దంబులగు సంచారంబులం జారుత్వవిశేషంబు వహించి రక్కురు రాజోత్తముండు రాజమార్గంబు దఱిసి చనుసమయంబున. | 354 |
| తే. |
హర్మ్యములనుండి పణ్యపుణ్యాంగనాని | కరము లక్షతయుత, మౌక్తికముల సేస లొలుకఁ గల్పలతాచయంబులును పుష్ప | వృష్టి పెల్లుగఁ గురిసిన విధము దోఁచె. |
355 |
| వ. | అట్టియెడఁ జూడం బఱతెంచిన పౌరజానపద జనంబులు దమలోన. | 356 |
| సీ. |
‘దిగ్విజయంబునం దేజస్వి యయ్యు న | జాతశత్రుం డనఁ జను నితండె; రాజసూయ మహాధ్వరము సేసి విప్రులఁ | గనక రత్నాదులఁ దనిపె నితఁడె; నిత్యవ్రతంబుగా సత్యంబు పాలించు | నిష్ఠ యస్ఖలితగా నెఱపె నితఁడె; ధర్మైక నిరతుఁ డీతం డొక్కరుఁడ చువ్వె | యని పల్కుటకుఁ బాత్ర మయ్యె నితఁడె; |
|
| తే. |
బలముఁ దగవును ధర్మంబు వెలయఁ బగఱ | ననవశేషంబుగాఁ దెగటార్చె నితఁడె’ యనఁగ మఱియును వివిధ కీర్తనల హర్ష | వచనముల నుల్లసిల్లు రవంబు మిగిలె. |
357 |
| క. |
లావులు వెరవులుఁ దాల్ములుఁ | జేవలు నస్ఖలితములుగఁ జెల్లు పనులు నా నా విధములఁ బేర్కొనుచుం | బావని నరుఁ గవలఁ బొగడు పటురవ మెసఁగెన్. |
358 |
| క. |
‘వ్రతచర్యయు భాగ్యంబును | ధృతియు మతియు నరయ ద్రౌపదికి నెనయగు భూ పతివల్లభాజనము లీ | క్షితిఁ గలరే’ యనురవంబు సెలఁగెం గలయన్. |
359 |
| వ. | ఇట్లు పెల్లయిన మ్రోఁతను దరంగితము లైన నెరవుల పెంపునఁ బురంబు చంద్రోదయ ఘూర్ణమానంబైన మహార్ణవంబు ననుకరించె; నా ధర్మరాజు రాజమందిరద్వారంబు సేరంజనియె; నప్పుడు బహువిధంబులగు శోభనద్రవ్యంబులు గరంబులంగొని భవ్యభూసురులును బుణ్యాంగనలును నెదుర్కొన, వాని నెల్లం గైకొనుచుం బ్రవేశించి యతం డేనుంగు మొగసాల నరదంబు డిగ్గి, ధౌమ్య ధృతరాష్ట్ర పురస్సరంబుగా నభ్యంతర నివాసంబు సొచ్చి, గృహదేవతలం బూజించి, మగుడ బహిరంగణ భూమికి వచ్చి, నగర దేవతా పూజలు సేయింపం దగువారలం బనిచి, బ్రాహ్మణ సంఘంబులం గానిపించుకొని, కనకంబులును గోవులు మొదలైన వివిధ వస్తువులు నొసంగె; నప్పు డాశీర్వాద నాదంబులను శంఖభేరీ ప్రముఖ మంగళ తూర్యరవంబులను రోదసి పిక్కటిల్లెఁ; దదనంతరంబ నిశ్శబ్దంబై యున్న సకల జనంబులును నజ్జనపాలు నాననం బాలోకించు చుండి; రట్టియెడ దుర్యోధన సఖుండైన చార్వాకుం డను నొక్క రక్కసుండు విప్రాకారంబు గైకొని త్రిదండి వేషం బలవడ నయ్యవనీదేవతాకోటిలో నిల్చి యన్నరనాథున కిట్లనియె. | 360 |