| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము |
| ఉ. |
‘నీవు తపో విశేష మహనీయతఁ జేసి జగంబు లన్నియున్ భావమునం గనుంగొని నృపాల మహోత్తర! చాలు; దీతఁ డ త్యావిల చిత్తుఁడయ్యె సుహృదాప్తమృతిన్ దురటిల్లు నెవ్వగం బోవగఁ ద్రోవు నీ దయిన పుణ్యతమస్ఫుట వాక్య పద్ధతిన్. |
109 |
| వ. | నాలుగు వర్ణంబులకును నాలుగాశ్రమంబులకు నిట్టిట్టివి యర్హంబులని నాలుగు వేదంబులం జెప్పిన ధర్మంబులు నీకు విదితంబులు; ప్రవృత్తి నివృత్తులును సాంఖ్యయోగంబులును బురాణేతిహాసంబులు ధర్మశాస్త్రంబులు నవగతంబులు ; సర్వసంశయచ్ఛేదన దక్షుండ; వీ వీక్షితిపతి నాదరింపుము; శోక మోహగ్రస్తం బగు జనంబు నిస్తరింపంజేయుట గదా మిము బోటుల బుద్ధి విస్తారంబునకు ఫలం’ బనిన విని మొగం బించుక యెత్తి కృతాంజలి యై గాంగేయుండు గోవిందున కిట్లనియె. | 110 |
| క. |
‘కర్తయును భర్తయును సం | హర్తయు జగములకు నీవ! యాశ్రిత జన ఘో రార్తి నిరాస నిపుణ సం | కీర్తన! యోగీశ్వరేశ! కృష్ణ వరేణ్యా!’ |
111 |
| వ. | అని మఱియు ననేక ప్రకారములం బ్రశంసించి నాకు మేలెయ్యది దానిని నీ దివ్య చిత్తంబునం దలంపు మనవుడు నద్దేవుం డిట్లనియె. | 112 |
| తే. |
‘అచల భక్తి నిత్యంబు నాయందు నీకుఁ | గలిమిఁ జేసి నీ యంతరంగమున నాదు దివ్యరూపంబు నొలయించితిం బ్రమోద | భాజనం బైతి భీష్మ తపస్స్వరూప! |
113 |
| వ. | మేలు వేఱ తలంప నేల?’ యని వెండియు. | 114 |
| క. |
‘భక్తియు నార్జవమును సం | యుక్తము లై యున్న యట్టి యుల్లంబున నా సక్తి నిలుతు; నిందొకఁడు వి | యుక్తం బైనను వసింప నుర్వీనాథా! |
115 |
| తే. |
అనఘ! యినుఁ డింక నేఁబది యాఱు దివస | ములకుఁ దా నుత్తరాయణమునఁ జరింపఁ దొడఁగు; నీ వప్డు దేహంబు విడిచి యేఁ గు | దపునరావృత్తి పదమున కభినుతముగ. |
116 |
| వ. | వీరె వసువులు విమానంబులతో నంతరిక్షంబున నంతర్హితులై నీ రాక ప్రతీక్షించి యున్న వా; రది యట్లుండె; నీవు సన్న నీ లోకంబున నెఱుక పొనుంగుపడుం గావున వీ రెల్ల సకల ధర్మవివేక లబ్ధికినయి యరుగుదెంచి పరివేష్టించి యున్న వా’ రని తత్కాల సమాగత యోగ్యజనంబులం జూపి, ధర్మపుత్రు నుపలక్షించి, ‘శోకోపహత బహుశ్రుతుం డగు నితండు దెలివొందునట్లుగా ధర్మార్థ సమాధి యుక్తంబులగు నుక్తి విశేషంబుల ననుగ్రహింప వలయు’ ననుటయు నద్దేవకీనందనునకు దేవవ్రతుం డి ట్లనియె. | 117 |
| క. |
‘శివ! నారాయణ! యచ్యుత! | భవదీయము లైన మధుర భాషణములు నా చెవు లానిన నమృత రస | ప్లవనంబునఁ బోలెఁ బ్రమద భరితుఁడ నైతిన్. |
118 |
| తే. |
వాగ్విభుఁడ వైన నీ వచో వైభవంబు | లో సమస్తంబు నుండుట లోకనాథ! నీదు సన్నిధిఁ బలుకంగ నేర రాదు | పద్మభవునకు; నే నెట్లు పలుకువాఁడ? |
119 |
| వ. | విషానల సదృశంబు లగు శరంబులు సేయు వేదనం జేసి యంగంబులు నంతరంగంబు నవశంబులై యున్న యవి; ప్రతి సంభాషణ క్షమ లేదు; దౌర్బల్యంబున నెలుంగును నాలుకయుం బ్రస్ఫుట వర్తనంబులు గా;వే నెవ్విధంబున భాషింప నుత్సహింతుఁ? బ్రతిభాషా శక్తిలేమి సహించి నా దెసం బ్రసన్నుండ వగుము; ధర్మపుత్రున కెయ్యది హితం బది నీవ చెప్పుము; నీ వుండ నేను జెప్పుట గురుం డుండ శిష్యుండు సెప్పిన విధంబు గాదె’ యనిన విని భక్తార్తిహరుం డైన హరి యతనితో నిట్లనియె. | 120 |
| క. |
‘కురువంశ ధురంధరుఁ డగు | పరమార్థజ్ఞునకు వినయఫణితిం దగు ని ర్భర శరవేదన సెప్పితి; | వరములు మూఁడిత్తు గొనుము వసుధాధీశా! |
121 |
| క. |
శరముల వలనను మూర్ఛం | బొరయక యొక్కింత డప్పిబొరయక నొప్పిం బొరయక యవిద్ధ గాత్రుని | కరణి సుఖాత్ముఁడవు గమ్ము కౌరవనాథా! |
122 |
| ఆ. |
అనఘ! నీరువట్టు నాఁకలియును నెప్డుఁ | బొరయకుండునట్టి భూరి శక్తి నీకుఁ గలుగ నేను నెమ్మనంబునఁ దలం | చితిఁ; దదీయ పీడఁ జెందకుండు. |
123 |
| క. |
విను! సకల భూతముల వ | ర్తనములు గను నపుడు బుద్ధి దవులఁ బడక యెం దును బరఁగి దివ్యబోధం | బున నలవడునట్టి పెంపుఁ బొందు మనింద్యా! |
124 |
| వ. | మత్ప్రసాదంబున నీదృశప్రభావ నిరూఢుండ వయి నెగడు’ మని పల్కుటయుం, బారాశర్యాది పరమార్యు లప్పద్మనాభుం బ్రశంసించిరి; దివంబున దేవదుందుభులు మొరసె; మురారి భీష్మ ధర్మజుల మీఁదం గుసుమ వర్షంబు గురిసె; నప్సరోగణ గానంబు వీతెంచె; నచ్చటి యందఱు నాశ్చర్య ప్రమోదభరిత హృదయు లైరి. తదనంతరంబ యంబుజాప్తుం డపరగిరి శిఖరం బలంకరించె; నప్పు డమ్మును లచ్యుత గాంగేయ కౌంతేయాగ్రజుల నామంత్రితులం జేసి గమనోన్ముఖు లగుటయు, న మ్మాధవ యుధిష్ఠిరులును, సాత్యకియును భీమార్జున యమళులును, గృప యుయుత్సు సంజయులును వారలకుం బ్రణమిల్లిరి; వారలును రేపు వచ్చెద మని నిజస్థానంబులకుం జనిరి; కృష్ణాదులును దేవవ్రతున కభిముఖు లగుచు నట్ల పలికి, వలగొని యరిగి యరదంబు లెక్కిరి; వారి పిఱుంద మున్ను వచ్చిన వారణ రథ తురగ పదాతులు బలసి కొల్చి పోవం బురంబునకు వారు వోవు సమయంబున. | 125 |
| చ. |
దినమున నెల్ల నుష్ణకరదీప్తులు పర్వి రసంబుఁ బీల్వ వం దిన సకలౌషధి ప్రవితతిం దెలివొందఁగఁజేయు నేర్పు గ ల్గిన తన రశ్మిజాలమున లీలఁ జకోరములన్ మదింపఁ జే య నుదయమై వెలింగె నమృతాంశుఁడు సేనకుఁ దన్పు సేయుచున్. |
126 |
| వ. | ఇ ట్లుదయించి సుధామరీచి లోచన ప్రీతి యాచరింపం బెంపు సుభగంబుగా శౌరి ప్రముఖులు పుర ప్రవేశంబు సేసి నిజ నివాసంబుల నుచిత వర్తనంబుల నా రాత్రి గడపి ప్రభాతం బగుటయు. | 127 |
| తే. |
మంజుపాఠక రవమును మధురమాగ | ధస్వనంబును వినుచు మాధవుఁడు మేలు కాంచి తత్కాల సముచిత కర్మ జాత | మాచరించి భూసురులకు నర్చ లిచ్చి. |
128 |
| వ. | మంగళ ప్రకారంబున నలంకరించి నిజాకృతి యాదర్శంబునందు దర్శించి యప్పుడు సన్నిహితుండైన సాత్యకి వదనం బవలోకించి భీష్ము పాలికిం బోవుటకుం బాండవాగ్రజుం డాయితంబగుట యెఱింగి ‘మన వెలువడు చునికి యెఱింగింపు’ మని పనిచె; నంతకు మున్న యక్కురుపుంగవుండు బుణ్య సంకీర్తనాశీర్వాదంబులను భద్రగాన నాదంబులను వీనులు వికసిల్ల మేలుకాంచి సమయ కృత్యంబు లనుష్ఠించి యుండ నా కృష్ణానుజుం డతనిం గని గాంగేయు కడ కరుగుటకై రథంబు సన్నద్ధంబు సేయించి ‘నీరజనాభుఁడు నీ రాక వార్చి యున్న వాఁ’డని చెప్పుటయు, నమ్మనుజపతి పార్శ్వగతుం డగు పార్థుం గనుంగొని ‘మనయరదంబు సంఘటింపుము; నేఁడు మొదలుగా నయ్యెడకు సైనికుల రానీకు; మంతః పరివారంబు వచ్చు టుడుపుము; శాంతనవుండు సందడింబడ నర్హుండు గాఁడు విశేషించి పరమ గుహ్యార్థంబు లగు వాక్యంబులు మనకు ననుగ్రహింపం గలవాఁడు గావున నిస్సమ్మర్దంబుగా నుపాసింప వలయు’నని పలికి యొక్కింత విచారించి తగు రాజులం గొందఱం బేరుకొని ధృతరాష్ట్ర విభుండును వారును వచ్చువారు; వారిం బిలువం బంపు’ మనవుడుఁ బిలిపించి యతండు. | 129 |