పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము
వాయుదేవుఁడు పురూరవునకుఁ జెప్పిన రాజధర్మప్రకారము (సం. 12-73-2)
వ. విశేషించి పురోహితుం బాటింపవలయు వినుము. తొల్లి యైలుం డగు పురూరవుండు ‘వసుధ విప్రక్షత్త్రియులం దెవ్వాని ధనంబై యుండునని వాయుదేవు నడిగిన నమ్మహాత్ముండు చతుర్ముఖుని ముఖ బాహూరు పాదంబులు బ్రాహ్మణ క్షత్త్రియ వైశ్యశూద్రులకుఁ బ్రభవస్థానంబు లగుట చెప్పి యి ట్లుత్కృష్ట ప్రభవుండై సర్వ వర్ణంబులకు నీశ్వరుం డగు బ్రాహ్మణుం డీ పృథివీ ధన ధాన్యాది సమస్త వస్తువులునుం దా ననుభవింపను నొడ్లకు నొసంగను యుక్తుండు; దండనీతి ధారణంబునకు క్షత్త్రియుం జొనిపి బ్రాహ్మణ శాంతి పరత్వంబున క్షత్త్రియాధిపత్యప్రాప్తి పతిలేమి నంగన దేవరునిం బ్రతిగ్రహించిన ట్లున్నది; యిది భూమి తెఱం; గి ట్లగుటం జేసి నిజధర్మవ్రతుండును, విద్వాంసుండును శాంతుండును నగు పురోహితునకు సర్వసంపదలును సమర్పించి జనపతి శుశ్రూషా పరుండును, నహంకార రహితుండును నై దండనీతి నయించి యుభయ లోకంబులనుం బెంపు వహించు. 302
క. రస గంధాద్యనుభవములు | పొసఁగవు భీతమగు చిత్తమున భయముం బా
ప సమర్థుఁడు కావున నృపుఁ | డసమానప్రభుతఁ బొందు నవనీనాథా!
303
క. అని వాయుదేవుఁ డి ట్ల | జ్జనపతి బోధించె ననుడు శాంతనవున క
మ్మనుజపతి యిట్టు లను ‘నే | పనులఁ బురోహితుఁడు మాన్యభావము నొందున్‌?’
304
వ. అనిన నా ధర్మతనయుతో నద్దేవవ్రతుండు ‘పురోహిత విషయంబులుగా శుక్రుండు చెప్పిన వాక్యంబులు గల వుపన్యసించెద నాకర్ణింపు’మని యిట్లనియె. 305
తే. ‘అమర గరుడ గంధర్వ విద్యాధరాది | దివ్యులకు నధ్వరంబులఁ దృప్తి సేసి
పరమ శుభములఁ బొందు భూవరుఁడు; దాని | కెల్ల మూలంబు దగు పురోహితుని బుద్ధి.
306
క. రక్షః పిశాచ గుహ్యక | యక్షాదులు బాధవెట్టు నవనీనాథున్‌
దక్ష పురోహిత మంత్ర సు | రక్షా సంస్కారవిధి విరహితుం డైనన్‌.
307
క. వివిధోత్పాతంబులకున్‌ | నవళులలోఁ దోఁచు కీడునకుఁ దోడ్తో శాం
తి విధానంబున నిరసన | మవును బురోహితునిచేత ననవద్యముగన్‌.
308
వ. ఈ వాక్యంబులం దాత్పర్యంబు గలుగుము. బృహస్పతియును శాంతికంబును బౌష్టికంబును శత్రునాశంబును మంత్రాఢ్య పురోహిత సాధ్యంబు లనియెం గావున నీవును సంభావితపురోహితుండ వగుము. 309
క. పరిశుద్ధి లేని కుత్సిత | పురోహితులు నీచదశలఁ బొందుదురు మహీ
వర! యల్పమె శుద్ధుండై | పురోహితత్వంబు సేఁత భూపతినగరన్‌.
310
క. ఆరోగ్యము గల యుత్తముఁ | బౌరోహిత్యంబు నడపఁ బనుచునది ధరి
త్రీ రమణుఁ డతఁడు దాను స | మారంభము లెల్ల నేకమతి గను టొప్పున్‌.
311
క. బ్రహ్మ క్షత్త్రము లొంది, య | జిహ్మములై కృత్యములు విశిష్టత నడపన్‌
బ్రహ్మాదులు హర్షింతురు; | బ్రాహ్మణ ముఖ వర్ణసమితి ప్రమదముఁ బొందున్‌.
312
వ. ఈ యర్థంబునం దైల కశ్యప సంవాదంబను నితిహాసంబు కలదు; విను మైలుండు గశ్యపుని బ్రహ్మ క్షత్త్ర ప్రకారం బడిగిన నమ్మనుజపతికి నమ్మునీంద్రుం డిట్లనియె. 313
ఆ. ‘క్షత్రమునకుఁ బుట్టఁగాఁ బట్టు బ్రహ్మంబు | బ్రాహ్మణునకు యోని రాజు గాన
యుభయ వర్థనంబు నొండొంటి విడువమి | వెలుఁగు రెండు మాయు విడిచెనేని.
314
క. తమలోనఁ బొందుగల వి | ప్రమహీశులఁ బ్రజయుఁ బొదువుఁ బ్రజచే మాన్య
త్వము వడయఁగ నేరరు భే | దము గలిగిన నలఁతు రొలసి దస్యులు ప్రజలన్‌.
315
తే. అట్టి దశఁ బుట్టు రుద్రుని యలుక దాన | సకలమునకు వినాశంబు సంభవిల్లుఁ
గాన యెల్ల విధంబులఁ గలసి యుండ | వలయు నృపుఁడుఁ బురోధయు వసుమతీశ!
316
క. వినుము విశేషించి జనన | జనితోన్నతి విప్రుఁ డతని జనపతి వినయం
బున నడపవలయు దానను | మనుగడ యిరువురకుఁ బ్రజకు మహనీయ మగున్‌.’
317
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )