| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
పరమ నియతిమైఁ గేకయ | నరపతి యధ్యయన విధి యొనర్పఁగ నటవీ పరిసరమున కేఁగినయెడ | ధరణీశ్వర! పట్టె నొక్క దానవుఁ డతనిన్. |
339 |
| వ. | పట్టినఁ బ్రబలుం డగు నద్దనుజునిం ద్రోచిపోవంజాలక యమ్మహీపాలుండు వాని కిట్లనియె. | 340 |
| సీ. |
‘మ్రుచ్చిమియును ఱంకు నెచ్చోట నైన నా | భూమిలోపల లేదు భూమిసురులు వేదాధ్యయన యజ్ఞవిధి దానతత్పరుల్ | రాజులు బ్రాహ్మణారాధనంబు జన్నముల్ సేఁతయు సమరానివర్తన | వ్రతమును గలరు గోరక్షణాది వార్తావినీతులై వైశ్యులు నడపుదు | రమ్మూఁడు జాతుల కధికభక్తి |
|
| తే. |
తోడ శుశ్రూషసేసి శూద్రులు చరింతు; | రేమి రంధ్రంబు గాంచి నీ విట్లు వెరవు మాలి పట్టి తత్యుద్ధతలీల నన్నుఁ? | దలఁప నిది నీకుఁ బథ్యమే దానవేంద్ర! |
341 |
| చ. |
అనుటయు నమ్మహాదనుజుఁ డాతని కిట్లను ‘నట్టి వానిఁగా నినుఁ గని వర్ణరక్షణము నిర్మలచిత్తతఁ జేయు రాజు కీ డునఁబడకున్కి దెల్పఁగఁ గడుం బ్రియమై చనుదెంచితిన్; మహీ జనపరిరక్ష యస్ఖలిత సౌమ్యత నిట్ల యొనర్పు భూవరా!’ |
342 |
| వ. | అని పలికి సఖ్యంబు సేసి చనియె నని చెప్పినం గౌంతేయాగ్రజుండు సంతోషించి ‘జీవనాభావం బైనచో క్షత్త్రియ కర్మానుష్ఠానంబునకు నశక్తుం డగు విప్రుం డెట్లు బ్రదుకు వాఁ?’ డని యడిగిన భీష్ముం డిట్లనియె. | 343 |
| చ. |
మనఁ జను నుప్పు నువ్వులును మాంసము గోవు వృషంబుఁ గూడుఁ గ ల్లును ఘృత తైల మాక్షికములున్ ధృతకేసరమైన జంతువున్ ధన మధికంబుగాఁ బడయు దానికి నేనియు విక్రయింపఁ గా దనుమతి యూఁది వైశ్యకృతినైనను విప్రున కాపదాగతిన్.’ |
344 |
| వ. | అనిన విని ధర్మతనయుండు ‘యజ్ఞంబు లెట్లయిన సమీచీనంబు లగు?’నని యడిగిన ననిమిష నదీనందనుం డతని కిట్లనియె. | 345 |
| ఆ. |
‘శ్రద్ధ వలయు, మిథ్య చనదు, వేదంబులఁ | బరిభవింపఁ దగదు భవ్యయజ్ఞ కర్త కెపుడు; నదియుఁ గాక దక్షిణలు మం | త్రార్థ పోషకంబులందు రధిప! |
346 |
| క. |
ఈగతి యెఱింగి చేసిన | యాగము సోమాప్తుఁ జేయు నప్పురుషునిఁ ద ద్యోగ మొనర్చు మహాసుఖ | యోగము సోమాధిరాజ్య యుక్తము శ్రుతులన్. |
347 |
| ఆ. |
అధ్వరంబుకంటె నధికంబు దపము, ద | పం బనంగ మేని ప్రన్నఁదనము నివురఁ జేఁతగా దహింసయు సత్యవా | క్యంబు దమము దయయుఁ గాని యరయ |
348 |
| వ. | అనిన. | 349 |
| చ. |
ప్రియమున ధర్మనందనుడు భీష్మునితో ‘నృపు డెట్టిభంగి వా నియెడఁ గరంబు నమ్మఁదగు; నిక్కపు మిత్రుఁడు లేని భర్తకున్ నయగతి సెల్లనేర’ దనినన్ విని యిట్లను నాతఁ ‘డేక బు ద్ధియుతుఁడవై వినన్ వలయుఁ దెల్లముగా నెఱిఁగింతు భూవరా!’ |
350 |
| క. |
‘నమ్మమి మృత్యువు, పెద్దయు | నమ్ముట యపమృత్యు వగుట నరపతి నమ్మీ నమ్మక పనిగొనునది, ని | త్యమ్మును సూక్ష్మమతిఁ దాను నరయఁగ వలయున్. |
351 |
| తే. |
తనకు మే లొనరించు నాతండు మిత్రుఁ; | డతఁడు నడపంగ నెల్ల కార్యములు శుభము నొందు; నేమిట నేమఱకునికి తోడ | నృపుఁడు మిత్రుపైఁ గార్యముల్ నిలుప వలయు. |
352 |
| ఉ. |
మన్ననకున్ మదింప కవమానము వచ్చిన స్రుక్క కొక్కభం గిన్నెఱిఁ గార్యముల్ విగత కిల్బిషుఁడై తగఁ జేయునట్టి మి త్త్రు న్నరనాయకుండు దనరూపుగ నగ్గలమైన శ్రీయు న త్యున్నతియున్ ఘటించు మహిమోజ్జ్వలుఁ జేఁత సుఖావహం బగున్. |
353 |
| క. |
వినుమట్టి మంత్రి గామం | బునఁ గ్రోధంబునను లోభమున భయమునఁ గా ర్య నిరూపణంబు వదలక | వినీతుఁడై నడచు టధిక విభవముఁ జేయున్.’ |
354 |
| వ. | అని చెప్పి వెండియు. | 355 |
| క. |
‘అన్నలుఁ దమ్ములుఁ గలుగుట | యున్నతుఁ జేయు నృపు నెంత యొఱపి ళ్ళయినన్ మన్ననయు నీగియును సం | పన్నంబులు గాఁగ వారిఁ బాటించు టురున్. |
356 |
| వ. | అది యెట్లంటేని. | 357 |
| క. |
బలఁగము గల భూపాలుఁడు | గెలని మహీశ్వరుల బుద్ధికిని వ్రేఁగగుచున్ బలియుఁ డగు; లేని వానిం | జులుకంగాఁ జూతు రెట్టి శూరుం డైనన్. |
358 |
| క. |
ఎక్కువ తక్కువ మాటలు | నుక్కివములు బంది గీడు లొందించుటలుం బెక్కు దన యన్నదమ్ముల | దిక్కున నన్నియును సైఁపఁ దేజము సేయున్. |
359 |
| క. |
లోపల రాఁజుచుఁ బొగయుచు | బాపంబులు దలఁతు రోపి బలిమియు వెఱపుం జూపక తక్కరు కెలనికి | నేపాటను వారి నడపు టెంతయు నొప్పున్. |
360 |
| తే. |
చాలుదురు వారు నృపతికి మేలు సేయఁ | గీడొనర్పంగఁ; గావునఁ గిల్బిషములఁ బొరయ కుండంగ వారల నరసికొనుచుఁ | బొదివి నడపుట కార్యంబు భూవిభునకు.’ |
361 |
| వ. | అనుటయు ధర్మజుండు ‘ధనార్జనం బేమిటం బ్రస్ఫుటంబై నడచు?’నని యడిగిన యతనికి భీష్ముం డిట్లనియె. | 362 |