పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము
బండారంబు వృద్ధి సేయుతెఱంగు భీష్ముఁడు ధర్మజునకుం జెప్పుట (సం. 12-89-1)
వ. అనిన విని పాండవాగ్రజుండు ‘బండారంబు గలిగించు వెరవెట్టిది తెలుపు’మని యడిగిన నాపగాతనయుం డతని కిట్లనియె. 390
క. ‘విను కర్షకులును వణిజులు | ననఘా! గోరక్షకులు ధరాధీశునకున్‌
ధన మొడఁ గూడెడు చోటుల | ననేక విధములకు నెల్ల నాద్యస్థలముల్‌.
391
తే. ధనములకు ధాన్యములకు నుత్పత్తి తలము | లయినవాని కించుకయును హాని గాక
యుండఁ దనకును బండార మొదవఁ దగు ను | పార్జనము సేయవలయు భూపాలకుండు.
392
క. పులి గూనల దినుచందము | గలిగిన నంతటన నిలుచుఁ గాక ధనంబుల్‌
గలుగునె మీఁదం గావున | జలగ దిగిచినట్లు గొనఁగఁ జను నిల సొమ్ముల్‌.
393
క. అరయుటఁ బ్రజ వర్ధింపఁగ | నరి యేఁటఁ గ్రమ ప్రవృద్ధ మౌనట్టులుగా
నరపతికిఁ గొనఁగ వచ్చు | న్వెరవులఁ బెంపంగఁ జాల నెఱయు ధనంబుల్‌.
394
క. దమియింపఁ దగిన వారల | సమయమున దమించి, వారి సంపదలు మహీ
రమణుండు దనదు బండా | రముగా సమకూర్చు జనము రాగిల్లంగన్‌.
395
క. ఆ పనికిఁ గీడు రోయుచు | భూపాలుఁడు ధనము గలుగు పురుషుల సిరిఁ దా
జూ పోపక కొనఁ దగదు, ద | యాపరుఁడై పెంపవలయు నఖిలజనములన్‌.
396
క. ప్రభువుల నుపచారంబుల | విభుఁ డనురాగిల్లఁ జేసి వెదగొనుఁ గాఁపుల్‌
సభయులు గాకుండ ధనం | బుభయ జగత్సిద్ధి పొంటె నుర్వీనాథా!
397
క. ఆయతి కిమ్మెయిఁ గలుగు ను | పాయంబులు ధర్మమార్గ ఫలితంబులుగాఁ
జేయుటయును మేలు నృపతికి | మాయాకృతి నిపుణు డగుట మతిగాదు సుమీ!
398
క. ధనము సవరించినఁ బ్రయో | జన మేమి యపాత్రములకుఁ జల్లి చెఱుచు నే
ని నరేంద్రముఖ్య! వ్యయములు | విను రక్షయ సిరికిఁ బాత్ర విషయము లైనన్‌.
399
వ. ఈ భంగి యైనం గోశ మిత్త్ర రాష్ట్ర బలంబులు వృద్ధిఁ బొందు; నీ విట్టి తెఱంగువాఁడవై ప్రజల రక్షింపుము. రణంబుల కలయక విరోధుల వధియింపుము మఖంబు లొనరింపుము ; దరిద్రులైన ధరణీసురాది సాధుల నరసి కుటుంబ రక్షణంబు సేయుము; మాంధాతృనకు నాంగిరసుం డగు నుతథ్యుండు సెప్పిన హిత వాక్యంబు లుపన్యసించెద; నాకర్ణింపుము. 400
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )