| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
అంబరీషుండు నానాధ్వరంబులు సేసి | కడచని వాసవు కడకు నేఁగి, యచట నుజ్జ్వల విమానారూఢుఁ డును మనో | హారి సంక్రీడనోదారచరితుఁ డును నై వెలింగెడు తనదు బంటు సుదేవుఁ | డను వానిఁ జూచి యయ్యనిమిషేంద్రు తోడ మదీయభృత్యుఁడు వీఁడు క్రతుముఖ్య | కర్మముల్ సేయఁ డెక్కారణమున |
|
| తే. |
ననఘ! నాకంటెఁ గడుఁ బేర్చి యునికి గలిగె | ననుడు నా జిష్ణుఁ డిమ్మహాత్ముని తెఱంగు సెప్పఁ జిట్టలు వినఁగ వాంఛించితేని | వినుము చెప్పెద’ నని యిట్టు లనియెఁ బ్రీతి. |
429 |
| వ. | శతశృంగుం డనియెడి దానవుని తనూజులు సదముండును విదముండును దముండును ననియెడు వారలు. | 430 |
| శా. |
బాహాగర్వము సూపఁగోరి పటుదర్పం బొప్ప నుగ్రాహవో త్సాహం బూర్జితభంగిగా భయద ఘోషస్ఫీత నానావిధ వ్యూహంబుల్ ధరణీప్రకంపనము లై యుద్దామ సర్వాంగ స న్నాహత్వంబునఁ బేర్చి తోడ నడవ న్సంరంభ శుంభద్గతిన్. |
431 |
| ఉ. |
‘మంచి మగండ వైన నిను మార్కొను వారయి దాడివెట్టి యొ క్కించుక శంక లేక ప్రజయెల్లను బెగ్గిలముట్టి యర్థముల్ గొంచు ధరిత్రి గైకొనుటకుం గన లగ్గల మొంది యీతనిం బంచితి సైన్యయుక్తముగఁ బార్థివ! యిట్లని పల్కి తత్తఱిన్. |
432 |
| మ. |
పసగన్ వే చని దోర్బలంబున రణప్రావీణ్యముం జూపి నీ వసురానీకముఁ ద్రుంచి భూప్రజలకున్ హర్షంబు గావించి రా క సుమీ రాక; జయంబు లేక ప్రజ దుఃఖంబొందఁగా రాక నీ యసువర్గంబుల పోకగా నెఱుఁగు పె క్కాడంగ నిం కేటికిన్? |
433 |
| మహాస్రగ్ధర |
అనినన్ సంగ్రామ కేళీవ్యవసన రసికుఁడై యట్లకాకంచు నిన్ వీ డ్కొని యీతం డేఁగి తా నప్డు దనుజతతి యాటోపమున్ గూఢచారుం డను దృష్టిం జూచి తా నిట్లను మనమున ‘సైన్యంబు చే టేల? శత్రుం గొననీ నేలా? పురారిం గొలుతు నతనికిం గోసియిత్తున్ శిరంబున్.’ |
434 |
| మ. |
అని నిశ్చాయకుఁడై రణం బుడిగి సైన్యంబంతయుం గ్రమ్మఱం జనగాఁజేసి పరేత భూమికి దృఢోత్సాహంబునం బోయి శం భునిఁ జిత్తంబున నిల్పి వాలును గళంబుం గూర్చినన్ సత్కృపా ఘనుఁ డద్దేవుఁడు ముందటన్ నిలిచి ఖడ్గంబుం దొలంగించుచున్. |
435 |
| మ. |
“చనునే సాహస మిట్లు సేయ? నిది కర్జంబే? కతం బేమి? యి ప్పని? కన్నం గని చక్కఁజాఁగి ధరయున్ ఫాలంబునుం బొంద వం దనముం జేసి, యితండు నీ పలుకులున్ దైతేయులం దాఁక నొ ల్లనివాఁడైన తెఱంగుఁ జెప్పెశివు నుల్లం బార్ద్రతం బొందఁగన్. |
436 |
| ఉ. |
ఆ పరమేశ్వరుం డితని కప్పుడు దివ్య రథోత్తమంబునుం జాపము నస్త్రకోటియుఁ బ్రసన్నత నిచ్చి రణంబునందు నీ యేపున కోర్వ దేవతల కేనియు దైత్యులకేని రాదు పొ మ్మే పగఱేని గెల్వుము; మహిం జరణం బిడకుండు మాజిలోన్. |
437 |
| మ. |
అని వీడ్కొల్పిన నీతఁ డుబ్బు మదిఁ బొంగారంగఁ దే రెక్కి వే చని దైత్యధ్వజినీ ప్రతాప మహిమోత్సాహంబులం జీరికిం గొన కుగ్రోద్ధతిఁ దాఁకి పీనుఁగుల పెంగుప్పల్ గొనం జేసె న య్యనిఁ బైఁ ద్రోచిన నిద్దఱం దునిమె దైత్యాధీశులన్ వ్రేల్మిడిన్. |
438 |
| వ. | ఇ వ్విధంబున సదముండును దముండునుం బడినం గని కోపోద్దీపితుండై. | 439 |
| స్రగ్ధర |
వీరోదారోగ్రలీలన్ విదముఁడు సమరోర్విన్ బలోల్లాస మొప్పం జేరెన్ బాహాసముల్లాసిత ఘనరుచిరాసి ప్రభాభాసురుం డై యా రక్షోనాథుపైఁ బేరలుక మఱపుఁ జేయంగ నీతండు డిగ్గెం దే రుద్యత్ఖడ్గదీప్తుల్ దెసల నిగుడ దైతేయవీరుల్ చలింపన్. |
440 |
| వ. | ఇట్లు విధాతృ వశంబునఁ బాదచారియై. | 441 |
| మ. |
దనుజుం దాఁకి కృపాణ ఖేలనము చిత్రంబై వెలుంగొందఁ ద త్తను సంఛేదన కేలిసల్ప నతఁడుం దన్నుం బటుప్రస్ఫుర ద్ఘన కౌక్షేయక ధారఁ జీరఁ బడియెం దా నాతనిం గూల్చెఁ ద క్కిన దైత్యావలి విచ్చె నల్గడఁ బరిక్షీణోద్యమత్వంబునన్. |
442 |
| వ. | ఇట్లు నిశ్శేషంబుగాఁ బరవీరులం బరిమార్చిన నీ రాజ్యంబు పూజ్యంబై వెలసె, భూ ప్రజయుం బ్రమోదంబు నొందె; నిత్తెఱంగున నీ సుదేవుండు సకృతవంతుండై యింతటి పదంబున కర్హుం డయ్యె; నేయజ్ఞంబులును సంగ్రామ యజ్ఞంబునకు సదృశంబులు గావు; వినుము! వీర మస్తకరాశి వేదికగా గృపాణ బాణాది సాధనంబులు సమిత్స్రుక్స్రువంబులుగా శోణితం బాజ్యంబుగా మాంసంబు పురోడాశంబుగా వీరవ్రత దీక్షితుండు సమరాధ్వరంబు సలిపి, రుధిరజల పూరయు మస్తిష్క కర్దమయుఁ గేశ శైవాలయు నాంత్ర ఫేనయు భేరీ మండూకయు హేతి మీనయు గజకళేబర పులినయు నగు నమర పుణ్యనది నవభృథస్నానంబు సేసి మదీయ లోకంబున సుశ్లోకుండై నిత్యస్థితి నత్యుదాత్తపదవిం బ్రవర్తిల్లుఁ బుణ్యతముం డగుటకుం దనువు దొఱంగ వలయు నని లేదు; తెగువతోడి యనివర్తన గతియ చాలు; నిట్టిది రణాచరణ ప్రభావం; బేనును బ్రబల దైతేయవ్రాత శాతన సుకృతంబునంగాదె యీ దేవేంద్రత్వంబు నొందితి’ నని పలికిన నంబరీషుండు సమర శూరుల సమధిక పుణ్యత్వంబు దెలిసి సంభావించె’నని చెప్పి దేవవ్రతుండు వెండియు. | 443 |