| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అనిన శంతనుపుత్రుతో నజాతశత్రుండు ‘నిజపరివారదోషంబున నైనను, బరులచేత నేనియు, సంపద సెడుట నాపదం బొరసిన ధరణీశుండు నెవ్వగ నెవ్విధంబునం బాపికొను? నెఱింగింపు’మనుటయుఁ ‘దొల్లి కోసల పతియైన క్షేమదర్శి విదేహపతిచేత భూమిఁ గోల్పోయి వగంబొంది, మున్ను దనకు మంత్రియై యుండి తాను రాజ్యంబు సేయుచుండు బరమశాంతి నొంది వనంబునకుం జనిన కాలకవృక్షీయు నాశ్రయించి, యిట్ల యడిగిన నమ్మనుజపతికి నమ్మునిపతి సెప్పిన వాక్యంబులు సెప్పెద విను మని యక్కురుపితామహుం డిట్లనియె. | 26 |
| తే. |
అర్థవంతుఁడై భోగంబు లనుభవించు | చున్నయప్పుడ యిది యిట్టులుండనేర; దస్థిరమ; తాను లోనుగానని యెఱుంగు | నతఁడు వగఁబొందఁ డేది యెట్లైన నధిప! |
27 |
| క. |
కానియటు లుండి నెఱిఁ బడు; | నైన తెఱఁగు దోఁచి మాయమగు; నిబ్భంగిన్ మానసమున కుబ్బు వగయుఁ | దే నోపుం బనులు; బుధుఁడు దేలఁడు రెంటన్. |
28 |
| క. |
జననీజనకులును సుహృ | జ్జనులును దెగునపుడు గావఁ జనమి దెలియదే ధనములు వారల కంటెనె | మనుజేశ్వర! వగపు వాని మగిడించునొకో! |
29 |
| క. |
గతమునకును వగవ కనా | గతమునకును నోరుదెఱచి కడుఁ గోరక దీ నతఁ బొందక దైవం బే | గతిఁ బుచ్చిన దానఁ బోదుఁ గా కనవలయున్. |
30 |
| క. |
వెరవును లావును గలిగిన | పురుషులు లే రెట్లు లోకమున; నెవ్వరికిన్ సిరి శాశ్వతంబె? యని వగఁ | బొరయఁడు ధీరుండు కలిమి పోకకు నధిపా! |
31 |
| క. |
సారపుసిరి చేటు నరుఁడు | గోరకయే వచ్చునట్లు కోరక యుండన్ శ్రీరాక గలుగు దైవము | కారుణ్యము గలిగెనేని గాఢవివేకా! |
32 |
| క. |
సిరివిడుచును బురుషుని విను | పురుషుఁడు సిరిఁ దొరఁగు నిది యపూర్వమె ఫల మూ లరతుండై వాఙఙ్నియతిం | బొరసియునికి యట్టి చోటఁ బురుషున కమరున్. |
33 |
| క. |
కలఁగిన పెద్దమడువు విను | తెలివిఁ బొరయునట్లు దానధీరుం డ ట్ల గ్గలము లయిన దురితంబులఁ | గలఁగియుఁ దనయంతఁ దేఱు గౌరవ మొప్పన్.’ |
34 |
| వ. | అని చెప్పి ‘యిది యుపశమన ప్రకారంబు; నీతి యెఱింగించెద; నాకర్ణింపు’ మనుటయు నమ్మునివరుతో నమ్మనుజవరుండు ‘మహాత్మా! నిన్నుఁ జేరి యేను దురితంబులం దొలంగవలదె? యానతి’ మ్మనిన నతం డతని కిట్లనియె. | 35 |
| సీ. |
‘తద్దయు శాంతుఁడై తక్కువ కోర్చి శ | త్రునిఁ గని యొడఁగూడి మనఁగవలయు; మన్నెరాజుల భూమి మర్దించి సైన్య మ | ల్లన కూర్చి వైరి పైఁ జనఁగవలయుఁ; బ్రబలునిఁ జేరి యారాధించి యాతని | సేనతోడుగ నరిఁ జెఱుపవలయు; విషమున మాంత్రిక విధిఁ బంపుపోటున | నలయక రిపుఁ దెగటార్పవలయుఁ; |
|
| తే. |
బొంచి భేదంబొనర్చి కలంచియేని | నంగనలఁ గొని వారి మాయలఁ దగిల్చి యైన మఱియును బహువిధోపాయములను | దెగువ డింపక పగతు సాధింప వలయు.’ |
36 |
| వ. | అని చెప్పె నని చెప్పి, గాంగేయుండు వెండియుఁ జెప్పు ‘నా కౌసల్యుం డధర్మోపాయ విధాయకంబు లగు నుపాయంబులకుం జొరంజాల ననిన నమ్ముని తద్విరోధి యగు విదేహవిభు రావించి యేకాంతంబున నా క్షేమదర్శిం బేర్కొని నీ వతని రాజ్యంబుగొని యున్నవాఁడ వన్నరపతి యొండుమైఁ గార్యంబు సూచుట యొప్పదు సంధిసేయుమని వెరవు కలిమి నొడంబఱిచి యిరువురకును సంధి యొనర్చి నెయ్యంబు చాటించి వీడుకొల్పినఁ గౌసల్యుం దోడ్కొని చని, యతనికిఁ దనకూఁతు నిచ్చి కరితురగాది వివిధ పదార్థంబు లొసంగి విదేహ జనవల్లభుం డవ్వసుమతీవల్లభుని నిజపురంబున కనిచిపుచ్చె; రాజులకు జయాపజయంబు లనుభావ్యంబులు; మదవిషాదంబు లనాదరణీయంబు’ లనవుడు ధర్మనందనుండు ‘పరిజనంబులయందు గణంబులైయున్న వారిం బరిపాలించు సమ్యక్ప్రకారంబు సెప్పు’మనుటయు నమ్మహీకాంతునకు శాంతనవుం డిట్లనియె. | 37 |