| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - తృతీయాశ్వాసము |
| సీ. |
అవనీశ! పారియాత్రాచలంబున నుండు | నొక బోయ ధర్మసంయుక్తబుద్ధి వింట నేర్పరి మృగవితతిప్రకారజ్ఞుఁ | డారణ్య దేశ సంచారశాలి తల్లికిఁ దండ్రికిఁ దద్దయు భక్తుఁడై | ఫలమూలమధుమాంసములును మేలి కూడుగూరలు దొరకొల్పి వారికిఁ దృప్తి | యావహించుచు శయనాసనాదు |
|
| తే. |
లగు పదార్థముల్ హృద్యంబులుగ నొనర్చు; | వలయు నాహారములు మునివరుల కిచ్చుఁ; బగఱఁ దోఁచినఁ బరిమార్చు భండనమున | నొకఁడ వేవురనైన మహోగ్రగతుల. |
177 |
| క. |
కాపవ్యుం డను పేరను | దీపించిన యతని భూరితేజముఁ గని ర క్షాపరుఁడు వలయు మనకని | యా పొలమునఁ గల్గు దస్యులందఱుఁ దమలోన్. |
178 |
| ఆ. |
అతనిఁ దమకు నెల్ల నాధిపత్యము సేయు | వానిఁగా వరించువారు గాఁగ నిశ్చయించి కూడి నెమ్మిమైఁ జనుదెంచి | కాంచి యిట్టు లనిరి గారవమున. |
179 |
| క. |
బలవిక్రమసంపన్నుఁడ వ | లఘుచరిత్రుఁడవు మమ్ము నందఱఁ బ్రభువై తలకొని రక్షింపుము; నీ | వలచిన పనిగొనుము పుత్రవర్గముఁ బోలెన్.’ |
180 |
| వ. | అనిన విని యతఁడు వారల కిట్లనియె. | 181 |
| సీ. |
శిశుజన మునిజనస్త్రీజనంబులఁ | జంపఁగా; దెట్టివాఁడైనఁ గడఁగి మీఁదఁ గవియక పొడుచుట కల్మషం; బంగనఁ | జెఱపట్టఁ దగదు; విశేష మొకఁడు వినుఁ; డెల్ల సత్త్వంబులను బెంటిఁ జంపుట | పాపంబు; గోవుల బ్రాహ్మణులను సంకటపెట్టంగఁ జనదు; తదీయ హి | తము గోరి పూని యుద్ధంబు సేఁత |
|
| తే. |
యధిక పుణ్యంబు సస్యక్రియావిఘాత | మాచరించుట గడుదోష; మవని ప్రజకు బాధ గావించి కుడిచి శవంబు దొలుచు | ప్రువ్వుగతి నది వొలియంగఁ బొలియు నతఁడు. |
182 |
| వ. | అని చెప్పి ‘మీర లీధర్మాధర్మంబు లెఱింగి నాపంచిన తెఱంగున బ్రదికెదరేని మీకు ముఖ్యుండ నయి సఖ్యంబు సౌఖ్యంబుఁ బెనుప మీ యోగక్షేమంబు లరసెద’ ననియె. దానికి వారలందఱు బ్రీతింబొంది, యాతని వశంబున వర్తించి వర్ధిల్లి; రిట్లు కాపవ్యుండు సాధులకు హితం బగునట్లుగా దస్యులం బాపంబులకుం బాపి తానును వారును నిహపర సిద్ధులం బ్రశస్తి వహించె. | 183 |
| క. |
కాపవ్యోపాఖ్యానము | పాపహరము దీని శ్రవణపఠనము లటవీ వ్యాపార క్షేమంకర | రూపములగు దస్యుమృగవిరోధము లడఁచున్. |
184 |