పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - తృతీయాశ్వాసము
పలితరోమశు లను మూషిక మార్జాలంబుల సంవాద ప్రకారము (సం. 12-136-18)
వ. అనిన విని ధర్మనందనుండు ‘పెక్కండ్రు పగఱకు నగ్గమై హీనబలుం డైన నరపతి యెప్పరుసున నాపద నిస్తరించువాఁ?’ డని యడిగిన నప్పుడమిఱేనితో భీష్ముండు ‘మార్జాల మూషిక సంవాదం బను నితిహాసంబు గల; దది నీదగు ప్రశ్నంబునకు సదుత్తరం బగు విను’ మని యిట్లనియె. 202
సీ. ‘అడవిలో నొక మఱ్ఱియడుగున లాఁగలఁ | బలితుండు నా నొక్క యెలుక యుండు;
నమ్మహీజముమీఁద ననిశంబు రోమశుం | డను పిల్లి వసియించు; నా సమీప
మున సంజకడ నిత్యమును మృగంబుల | కురులొడ్డి వేకువ వచ్చి యొక్క మాలఁ
డగపడ్డ వానిఁ గొం చరుగు; నొకప్పు డా | హారంబునకుఁ బిల్లి యచటఁ దిరుగఁ
 
తే. బోయి యురిఁ బడియుండఁగఁ బొంచిచూచి | భయము దక్కి యచ్చోటన పలితుఁ డెరకుఁ
గ్రుమ్మరఁగఁ జంద్రకుం డను గూబపులుఁగు | హలికుఁ డను ముంగిసయు నింత నంతఁ దోఁచె.
203
వ. ఎరలకై వచ్చి యిట్లు దోఁచిన నయ్యెలుక యా రెంటి బారికిం దప్పిపోవరామి దలంచి బెగ్గలించియు ధైర్యంబు కలిమిం గార్యం బూహించి యప్పిల్లిం గొండొక సేరం జనుచు దానితో నిట్లనియె. 204
క. ‘ఉరి ద్రెవ్వఁ గొఱికి యిప్పుడ | వెరవారఁగ నీకు నేను విడుగర సేయం
దొరకొనుట నీదు భాగ్యం | బరిత్వము దొఱంగి మైత్రి యలవఱుపు మదిన్‌.
205
క. ముంగికి గూబకు నగపడి | యంగంబులు వడఁకుచున్నయవి నా కిమ్మై
సంగతి గలిగిన నీ యు | త్సంగంబున నుండి భయము దక్కుదు నేనున్‌.’
206
చ. అనవుడుఁ బిల్లి యిట్టులను ‘నార్తశరణ్యుఁడ వయ్యె; దిట్టి నీ
కనఘ! హితంబు సేయ వలదయ్య? జగత్పతిసాక్షిగాఁగ ని
ప్పని దగఁ బూనితిన్‌; వెఱపుఁ బాచి ననుం గదియంగ రమ్ము; వ
చ్చిన నకులంబు గూబయును జేరఁగ నేరవు నాకు నోడుటన్‌.’
207
ఆ. అనిన నట్ల యగుట నాత్మ నెఱింగియ | కాదె సంధియైన నాదు బ్రదుకు
నీదు విడుగరయును నిజమగు టూహించి | నిన్నుఁ జెందె బుద్ధి నిశ్చయంబు.
208
క. అని పలికి పిల్లి పొదిగిట | ననయము నిశ్శంకవృత్తి నయ్యెలుక వసిం
చినఁ జూచి యయ్యూలూకం | బును నకులము నచటు వాసి పోయె నిజేచ్ఛన్‌.
209
క. నకులము నులూకమును బో | కకు సంతస మందియుండి గ్రక్కున నమ్మూ
షిక మయ్యురి చేరులు గొఱు | కక యలసత నల్లనల్లఁ గఱచుచు నుండెన్‌.
210
వ. అమ్మెయిఁ బలితుండు గొనకొని యయ్యురిం గొఱుకకుండుట యెఱింగి రోమశుం డిట్లనియె. 211
క. ‘తగునే యిట్లు? కృతార్థుఁడ | వగు నీ కురి గొఱుక కిట్టు లాలస్యము సేఁ
త గటా! కృతఘ్నతకు నెల | వగు టొప్పునె కొఱుకు కడఁక నద్రోహుఁడవై.’
212
చ. అనుటయు నెల్క యిట్టు లను ‘నాశ్రితరక్షణశీలు నిన్నుఁ గీ
డునఁ బొరయింతునే? యిది కడుం జెడుగుందన; మేను భీతి నూ
నిన మదితోడ నమ్మమిన నెట్టన యియ్యురిఁద్రెంప నియ్యెడన్‌
మనమున నెగ్గుగాఁ గొనకు మాలనిఁ గాంచిన యప్డ త్రెంచెదన్‌.
213
క. ఉరిఁ బాసి యేమి దలఁతో | యరిత్వమున వినుము ప్రబలుఁడైన యతనితో
వెరవున సంధి యొనర్చియుఁ | గరంబు నమ్మమియ నీతిగాఁ గొండ్రు బుధుల్‌.
214
ఉ. మాలనిరాక చూచి భయమర్దిత మైన మనంబుతోడ న
క్కాలమునందు నీకుఁ జనఁగావలయున్‌ వెస మ్రానిపైకి నా
యాలయముం జొరన్‌ సమయ; మప్పుడ నాకును గాన యత్తఱి
న్మేలొనరింతు; నమ్ము మిది నిక్కము గర్జము నీ వెఱుంగవే?’
215
క. అనవుడు నట్లేల తలఁప వినుము భవత్ప్రాణరక్ష వెసఁ జేసితి నే
ననఘా! నీవును నమ్మెయి నను నాపదఁ బాపవలదె నమ్మి రయమునన్‌.
216
ఆ. అనినఁ బిల్లి కిట్టులను నెల్క ‘వేగిర | పడకు; ముచితకాలభావ్య మైన
యత్నవిధి గదా సమగ్ర ఫలత్వంబు | నొందు; నొండు దలఁప కూరకుండు.’
217
వ. అని యి ట్లప్పలితుండును రోమశుండును నొండొరులతో మాటలాడుచుండ వేకువ యయ్యె; నట్టి యెడ. 218
క. తనతోఁ గొందఱు గుక్కలఁ | గొని యేతేరంగఁ గేలఁ గ్రూర కృపాణం
బును భీకరభంగిగ వెసఁ | జనుదెంచెన్‌ మాలఁ డధికసంరంభమునన్‌.
219
ఆ. పరిఘనాముఁ డైన పాపాత్ముఁ | గని భయ మడరఁ బిల్లి యిట్టు లనియె
‘నేమి సేయువాఁడ? నిదె వచ్చె జముదూత | వోలె సత్వరముగ మాలవాఁడు.
220
క. అనిన విని ‘యోడ కోడకు’ | మనుచుం దెగఁ గొఱికె వేగ మయ్యురిఁ బలితుం
డనయముఁ జకితాత్ముండై | చనియెన్‌ రోమశుఁడు నవనిజముపైకి వెసన్‌.
221
చ. ఎలుకయు బొక్కలోపలికి నేఁగి ముదంబునఁ బొంచి చూడ సం
కులముగ నేఁగుదెంచి పరిఘుం డురి నుగ్గగు టెల్లఁ జూచి ని
ష్ఫలతకుఁ జిత్తమెంతయు విషాదము వొందఁగఁ బోయెఁ; బిల్లి య
య్యెలుకకు నిట్లనుం జెవికి నింపగు రీతి నుదాత్త భంగిగన్‌.
222
ఆ. ‘మేలుసేసి తగిన మిత్త్రునిఁ బడసి త | త్సుచరితముల వచ్చు సుఖము లనుభ
వింపఁ జూచుటుడిగి వేర్పడి యుండుట | యరయ నీతివిదుల తెరువుగాదు.
223
చ. అనఘ! భయంబు నొందు టిది యారయ బేలఁదనంబు; నెమ్మిమై
మును నను నమ్మి చెంది భయమోక్షణముం గని నాకుఁ జాల మే
లొనరఁగ జేసి తీవు; దుది నుల్లమునం దగ విశ్వసింప కి
ట్లునికి సుఖంబె? నాదుసిరి కుక్తుఁడ వయ్యెదు రమ్ము ప్రీతితోన్‌.
224
క. బలవంతు లైన చుట్టం | బులు నేనును నీకు మేలు వొనరింపఁగ ని
మ్ముల మనుట యొప్పదే? ననుఁ | గలిసి మెలఁగు; విడువు శంకఁ; గను మభిమతముల్‌.’
225
వ. అనిన విని యప్పలితుండు రోమశునితో ‘నీ పలుకు లుచితంబులు; నా మాటలు విను’ మని యిట్లనియె. 226
చ. అరులను మిత్త్రులం దెలియ నారయు టెంతయు సూక్ష్మ కృత్య మ
వ్వెర వతి దుర్లభం; బరులు వీ రన నుండియు మిత్త్రభావముం
బొరయుటయున్‌ సుహృజ్జనుల పోలికి గల్గియు శత్రుతాగుణ
స్ఫురణ యొకప్డు సూపుటయుఁ జూతుము గాదె ధరిత్రి నెల్లెడన్‌.
227
వ. కావున నిన్నుఁ బెద్ద గదియుట గర్జంబు గాదు; నీవును మద్వశగతిం బొందుటఁ జూచితేనియు నేమఱంజన; దెట్లంటేని. 228
క. బలవద్రిపులు ప్రయోజన | ములకై లోఁబడుట గల్గుఁ బొలముల నేనుం
గులు దీమంబుల పజ్జఁ ద | గిలి నెట్టన పట్టువడిన క్రియఁ జతురమతీ!
229
చ. అరియెడ మిత్రభావ మొక యప్పుడు కార్యము పొంటెఁ గల్గిన
న్వెరవునఁ బాముఁ బట్టునెడ నిక్కము నమ్మక దానివాతికిం
గరము దొలంగఁ జేయునరు కర్జము వట్టి చరించుటొప్పదే!
పొరుగున నుండి నీకు హితముం దగఁ జేసెద నెప్డు పంచినన్‌.
230
మ. విను! నీ కామిష మేను; నీ యెడఁ గడున్‌ విశ్వాసముం బూని చే
రిన నీ చిత్త మొకప్పు డుద్గతవికారీభూతమై దుర్వినో
దనహింసారుచి నొందు; నీ సుతసుహృద్బంధువ్రజంబేని మున్‌
ననుఁ గన్నన్‌ వహియింప దాత్మఁ గరుణ; న్మన్నింపు మి ట్లుండెదన్‌.
231
వ. అని యంత నిలువక. 232
క. ‘బలుపుటురిఁ జిక్కి పేరా | కలితో రేయెల్ల నున్నకతమున నీకుం
జలిది వలసి పిలిచెద; విటు | వలయునె? నీ పలుకు నమ్మి వత్తునె చేరన్‌?’
233
ఆ. అనుడు ‘నిట్టు దలఁప నగునె మత్ప్రాణ ర | క్షకుఁడ వైన నిన్ను శత్రుఁ గాఁగఁ
దలఁతునే? కృతజ్ఞతయుఁ బౌరుషంబును | గలుగ నేను వెఱవ వలవ దనఘ!’
234
వ. అనిన రోమశునకుఁ బలితుం డిట్లనియె. 235
క. నీ వలన నేను బ్రదికితి; | నీవును నాకతన మాలనికి నగపడవై;
తీ విధమునఁ గల్గు సుహృ | ద్భావము చాలు; నినుఁ జేరఁ దగ దిట మీఁదన్‌.
236
వ. ఇవ్విధంబునకు శుక్రవాక్యంబులుం గల; వాకర్ణింపుము. 237
క. బలవంతుఁ డైన శత్రుని | వలనఁ బ్రయోజనము గలిగి వలను కలిమిఁ దాఁ
గలిసియు నది గడచనఁగాఁ | దొలఁగ వలయు; నమ్మెనేనిఁ దుదిఁ గీడొలయున్‌.
238
ఆ. నమ్మఁ దగనివారి నమ్మక యున్నది, | తగిన వారి నైనఁ దద్ద నమ్మి
యుండఁ దగదు; తన్ను నొరులు నమ్మెడు నట్ల | యుండి యొరుల నమ్మకునికి నీతి.
239
వ. ఇట్టిద బ్రదుకుఁదెరు వగుటం జేసి. 240
క. నినుబోంట్లను నమ్మక యే | నును బ్రదికెద; ననఘ! నీవునుం గని చండా
లుని యట్టివారి మాయలు | నినుఁ బొందక యుండ బ్రదుకు; నెఱిఁ బొ మ్మింకన్‌.
241
క. అనిన విని సిగ్గుపడి తన | చనుచోటికిఁ జనియెఁ బిల్లి; సమ్మతిఁ బలితుం
డును వేఱొక తగులాఁగకుఁ | జని సముచిత వర్తనమున సౌఖ్యముఁ బొందెన్‌.
242
క. బలు పగఱ వలని యాపద | దలఁగుటకును రిపుని హీనతరు నైనఁ దనుం
గలిపికొని బ్రదుకుటకు ని | య్యెలుకయుఁ బిల్లియును వెరవు లెఱిఁగించెఁ దగన్‌.’
243
వ. అనిన విని కౌంతేయాగ్రజుండు శాంతనవునితో ‘నెవ్వనియెడ విశ్వసింపకున్నం జిత్తంబునకు విశ్రామంబు గల్గదు; విశ్వసించిన దురితంబులు దొడరు నట్లగుటంజేసి విశ్వసించుటయు విశ్వసింపకయుండుటయు నను రెంటిలోననుం బరమకర్తవ్యం బెయ్యదియో నిశ్చయింప నేర’ ననుటయు నమ్మహీపతి కమ్మహాత్ముం డిట్లనియె ‘నీ యర్థంబు’ దేటపఱుచునట్టి యితిహాసంబు సెప్పెద నాకర్ణింపుము. 244
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )