పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - తృతీయాశ్వాసము
విశ్వామిత్ర చండాల సంవాదము (సం. 12-139-12)
క. ఏపారి తొల్లి త్రేతా | ద్వాపరముల సంధి నొక్క వఱపు ధరిత్రీ
తాపంబుఁ జేసె జనముల | పాపంబున వత్సరములు పండ్రెం డధిపా!
279
సీ. ఏఱులుఁ జెఱువులు నివురఁ గర్సనము లెం | దును జెడఁ, దరులతాదులును గమర,
భూమియుఁ బసమాల, గోమహిషాది జీ | వధనంబు వొలియ, భూవరులు మేర
దప్పి లోకములోని ధాన్యముల్‌ గొన, నధ | ర్మం బంతకంతకుఁ బ్రబ్బ నధికు
లనదలఁ జెఱుపంగ, యాగముల్‌ దేవతా | పూజలు నెడలంగ, భూసుర ప్ర
 
ఆ. ముఖములైన వర్ణముల చొప్పు దప్ప, నా | హార రహితజనము లచట నచటఁ
బడఁగఁ జూడ ఘోర భంగిగాఁ దఱచయ్యె | డొక్కలున్న వారి కెక్క భయము.
280
వ. అట్టి సమయమున. 281
క. మునిపతి విశ్వామిత్రుఁడు | దన యాఁకలి కెందు మెలఁగి ధైర్య మెడలి యో
దన మాంస మూల ఫలములు | జనుల నడిగి యెందుఁ బడయఁ జాలక డప్పిన్‌.
282
వ. తూఁగాడుచుం జనువాఁడు. 283
చ. పసరపు టెంప ప్రోవులును, బందుల డొక్కలుఁ, గుక్కపుఱ్ఱెలున్‌
ముసుఁగువడంగ భూమితలముం దఱచారఁగఁ గప్పుచున్‌ మదిం
బస యొక యింత లేక పెఱప్రాణులనుం బొరిగొంచు నెప్డు దు
ర్వ్య సనతఁ గూరియున్న వెలివాండ్రుర పల్లియఁ జేరి యయ్యెడన్‌.
284
వ. ఆర్తినొంది యిటయట వోవం జాలక నేలం బడియుండి ప్రాణంబులు వోవుట యుపేక్షింపం దగదు ప్రాణరక్షణంబ పరమధర్మం బని వితర్కించి తగునుపాయంబు చింతించువాఁ డప్పుడ చంపి తిత్తొలిచి గాలిగొన వైచిన కుక్కకడిమంబుఁ గనుంగొని. 285
క. ‘ఇది దప్ప నిప్పు డియ్యెడ | నొదవదు ప్రాణంబు గావ నొం డొకఁ; డిదియున్‌
మది నూహింపఁగ మ్రుచ్చిమి | నొదవించి కొనంగవలసియున్నది నాకున్‌.
286
తే. ప్రాణములు వోవకుండంగఁ బరిహరింప | నొం డుపాయ మెయ్యదియు లేకుండెనేని
మ్రుచ్చిమియు ధర్మ మగు; నధముని ధనంబు | గొనుట యెందును ముఖ్యమై చనుట గలదు.
287
వ. కావున చండాలధనంబగు సారమేయ మాంసం బపహరించి ప్రాణహాని పరిహరించి కొందు’ నని నిశ్చయించియుండ నర్ధరాత్రం బగుటయుఁ జండాలురెల్ల నిద్రింపనల్లన లేచిచని యమ్మాంసంబు వట్టి తిగిచిన నచ్చేరువ నిద్రించు చండాలుండు విధివశంబున మేలుకని ‘నీ వెవ్వండవు? మాంసంబు మ్రుచ్చిలించెదవు? నిద్రవోవంజుమ్ము నిన్ను ఁ బొరిగొనియెద’ ననుటయు భయపడి గ్రక్కున నమ్మునిపతి ‘యేను విశ్వామిత్త్రుండ’నని పలికిన, వాఁడు వినయంబున శయ్య డిగ్గి కరుణం గన్నీ రొలుకం బ్రణమిల్లి కేలు మొగిడ్చి ‘మహాత్మా! నీతలం పేమి యని యడిగిన నతండు సాంత్వనవచనంబుల నిట్లనియె. 288
చ. ‘దరికొను నాఁకలిం దనువిదాహము పుట్టినఁ బ్రాణహానికిం
బరిహరణంబు సేఁత కిది పాపమ యైనను గుక్కనంజుఁడే
భరపడి మ్రుచ్చిలించెద; విభావసుఁ డెంత శుచిత్వ సంపదం
బొరసియు సర్వభక్షకతఁ బొందును; నన్నును జూడు మట్లుగన్‌.’
289
వ. అనిన విని చండాలుండు. 290
తే. ‘కుక్క మృగములలో నెల్లఁ గుత్సితంబు; | దీనిఁ దిని ధర్మమున కేల హాని సేయ?
నొం డుపాయంబు వెదకి కొ మ్ముజ్జ్వలాత్మ!’ | యనుడు వానికి ముని యిట్టు లనియె నధిప!
291
క. ‘విను బ్రహ్మవహ్ని నాకుం | బెను ప్రాపై యుండ నేను వెఱతునె యెట్లై
ననుఁ బోవనీక ప్రాణము | దనువున నిల్పుటయ చూవె ధర్మం బరయన్‌.
292
ఆ. బ్రదికియున్న నేఁ దపంబున విద్యను | బాచికొనఁగ నేర్తుఁ బాతకంబు;
నట్టు లగుట జీవితాధార మైన యీ | నంజుఁ డిప్పు డెట్లు నమల కుడుగ.
293
చ. అనుటయు నంత్యజుండు నగి ‘యట్టి విధం బధమంబు గాక నె
ట్టన యది ధర్మమే? కటకటా! మిము బోంట్లకు నిట్లు సేయఁగాఁ
జనునొకొ?’ యన్న నమ్ముని ‘ప్రశస్తుఁ డగస్త్యు ఁడు దైత్యు మాంసముం
దినఁడె? నశించెనే యతని తేజముఁ బెంపును నంతనుండియున్‌?’
294
వ. అనవుడు వాఁ డి ట్లనియె. 295
క. ‘పరహితము సేయఁ బూనిన | పురుషుఁడు పాపంబు సేసి పొందఁడు కీడుం;
బరమముని యగు నగస్త్యు ఁడు | పరోపకారార్థ కృతి నభవ్యుం డగునే?’
296
క. నావుడు మదాత్మ బ్రాహ్మణ | తా విద్వత్తాస్పదంబు; దానికిఁగా నే
నీ విధి యొనరించుట పా | పావేశము లేదు; దీని కడ్డుపడకువే!
297
క. అని ముని పల్కిన నంత్యజుఁ | డను ‘మాంసము విడువ నోప కనుటగఁ దలఁపం
జనునె? భవదీయ తేజో | ధన హానికిఁ గరుణ పుట్టదా యెవ్వరికిన్‌?’
298
వ. అనవుడు గాధినందనుండు. 299
తే. ‘కరుణ గలవేని బ్రాణంబు గాచికొనఁగఁ | దలఁచు నాకు నిమ్మాంస మి మ్మలఘుచరిత
యట్టు లైన మ్రుచ్చిమియు లే దనృతమెడలి | పడయు వస్తువు సేయదు పాతకంబు.’
300
వ. అనిన విని చండాలుం డి ట్లనియె. 301
క. ‘అతిశయిత పుణ్య దీప్తులు | ప్రతిగ్రహము నీచనరుని పాలం జేయన్‌
మతిఁ దలఁపఁ గూడునే? వి | శ్రుతగుణ! యే వెఱతు నింకఁ జుఱచుఱఁ బల్కన్‌.
302
వ. నీ వలచిన యట్లు సేయు’ మని సారమేయమాంసం బిచ్చినఁ బుచ్చికొని బ్రాణంబులు రక్షించుకొని విశ్వామిత్రుండు సనియె; నింద్రుండు తదనంతరంబ లోకంబుల వడదేఱ వర్షించె; నంత హర్షించి యత్తపస్వివర్యుండు దపోవిశేషంబున దోషంబు నీఁగికొని మనీషిజనస్తుత్యంబగు నిత్య వ్రతంబున విలసిల్లె; నాపత్సమయసమాచారం బిట్టిద’ యని చెప్పిన భీష్మునితో భూవల్లభుండు ‘ధర్మసూక్ష్మ ప్రకారం బింత దురవగాహం బగునే? యీ యితిహాసం బాకర్ణించుట నాడెందంబు విషాదంబునొందె’ ననవుడు నతండు ధర్మంబు బహుశాఖాసమన్వితంబై యుండు; రాజులకు నెల్లతెఱంగులు నెఱంగవలయు; విషాదం బేల?’ యనవుడు నజ్జనవిభుండు. 303
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )