పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - తృతీయాశ్వాసము
భీష్ముఁడు ధర్మజునకు గృధ్రజంబుకోపాఖ్యానము సెప్పుట (సం. 12-149-1)
సీ. గాంగేయుఁ డిట్లనుఁ గౌంతేయపూర్వజు | నకు ‘విదిశాపట్టణమున నొక్క
బాలుండు మృతుఁ డైన బంధులు ప్రేతభూ | మికిఁ గొనిపోయి యమేయశోక
వివశాత్ములై పలవింపఁగా గ్రద్ద యొ | క్కటి వచ్చి మీర లిక్కడ భయంబు
దక్కి యేడ్చుచునుండఁ దగ; దిదె క్రుంకెడుఁ | బ్రొద్దు రాక్షసులును భూతములుఁ బి
 
తే. శాచములు వ్రచ్చి తిన నిపు డేచి వచ్చు; | జనన మరణముల్‌? వింతలె చన్న శిశువు
తోన యందఱుఁ జనుటకుఁ బూనియుండు | వారలే? పొండు పీనుంగు వైచి వేగ.
366
క. తెగిపోయినవా రేడ్చిన | మగుడుదురే? వెఱ్ఱులార! మానుఁడు మీరుం
దెగుదురు తడసిన’ నావుడు | నగు నట్టిద కర్జ’ మనుచు నందఱు భీతిన్‌.
367
వ. శవంబు విడిచి పోవంజూచిన, నొక నక్క బొక్కలోనుండి వెడలి వారలతోడ నిట్లనియె. 368
సీ. ‘గ్రద్ద మాటల కేల కడు భీతిఁ బొందితి | రక్కటా! బాలుని నబ్జవదను
నిటు వైచి పోవఁ గా ళ్ళెట్లాడె నేడ్వుఁడు | శోకంబు వోవ నిచ్చోటఁ గొంత
ప్రొ ద్దంతలో విధి క్రూరుండు గాకున్నఁ | బ్రాణంబు గ్రమ్మఱ రాక గల్గు
నో యెఱుంగుదురే; యినుండును నస్తాద్రిఁ | జేరఁడు; వెఱవక మీరు నిలువుఁ’
 
తే. డనిన వారును మనమున నాసపుట్టి | మగిడి వచ్చిన గ్రద్ద ‘యిమ్మందబుద్ధి
యైన నక్కమాటలు విననగునె? వికృత | మయ్యెఁ బీనుంగు; వచ్చునే యసువు లింక?
369
క. కడు బెట్టిదుండు కాలుఁడు; | మిడుక మిడుక నపహరించు; మీరీ యాసల్‌
విడువుఁడు; బాలునికి సుగతిఁ | బడయుఁడు దానాదు లైన బహుధర్మములన్‌.
370
వ. అని పలికిన నా గృధ్రంబు వచనంబు లాక్షేపించి యజ్జంబుకంబు వారల నుద్దేశించి. 371
క. ‘క్రూరంబు గృధ్ర మిట్టి కు | మారకునిం జూచి చూచి మసలకపోవన్‌
మీ రె ట్లోర్చెదరో క | న్నీ రిటు ననుబోటులకును నిలువ కొలికెడున్‌.
372
క. దయమాలి పోవ నేటికిఁ? | బ్రయత్నమునఁ బొదువ దైవబలమున మీకుం
బ్రియ మెసఁగ బ్రదుకు బ్రదుకం | డయినను మఱి పోవరాదె?’ యని చెప్పుటయున్‌.
373
వ. గ్రద్ద యిట్లనియె. 374
ఆ. ఏను బుట్టివేయు నిన్నూఱు మున్నూఱు | గలవు వత్సరములు గాన నెందు
బాలు యౌవనస్థుఁ బ్రౌఢుని వృద్ధునిఁ | జచ్చిపోయి మగిడి వచ్చువాని.
375
క. ఒకటి గలదు; వత్తురు వే | ఱొక గర్భంబునకు మృతులు నుక్కివమౌ న
క్కకు నేటి బుద్ధి పీనుఁగు | నకు బ్రదుకటె! కలుగు నిట్టి నవ్వులు గలవే?
376
సీ. అనవుడు నెగవెక్కి యా బిడ్డవైచి పో | యెడు వారలకు నడ్డపడుచు నక్క
‘వినుఁడు రాఘవుఁడు నేర్పున బ్రదికింపఁడే | మృతుఁడైన భూసుర సుతుని మగుడ?
సృంజయు కొడుకు సచ్చిన నారదుఁడు ప్రభా | వంబునఁ గ్రమ్మఱ వానిఁ దేఁడె?
యట్టుల యొక సిద్ధుఁ డమరుండు మీ యేడ్పు | లాలించి దయ బాలు నసువు లొసఁగె
 
ఆ. నేని మేల కాదె! యిది యేల పోయెద?’ | రనిన వారు మగిడి యరుగుదెంచి
శిశువు శవము చుట్టుఁ జేరి పెల్లేడ్చిరి | పనవిపనవి యంత నినుడుఁ గ్రుంకె.
377
వ. ఆ గృధ్రంబును జంబుకంబును నాఁకలిచేత వందురుచుండి తాన తాన బాలశవంబు నాహారంబు గొనుటకై యివ్విధంబునం దమ తమ పల్కు నేర్పున నజ్జనంబుఁ గ్రమ్మఱించెఁ; బ్రొద్దు గ్రుంకినం దా నచ్చోట నిలువనేరదు గావున గ్రద్ద యటమున్న వారు వోవునట్టి తెఱంగు మాటలాడె; రాత్రియైనం దనకు మేలుగావున నక్క వారలు దడయుటకుం దగిన చందంబుఁ జెప్పె; నది వాని తెఱంగు ప్రేతవనవిహారనిరతుం డగు శంకరుండు కరుణాకింకరుండు నగుట నప్పుడు. 378
ఆ. అట్లు పనవియేడ్చు నజ్జనంబులకుఁ బ్ర | త్యక్షమై ‘వరంబు లడుగుఁ’ డనిన
సంప్రమోద భక్తి సంభ్రమ భరితులై | చక్క నవనిఁ జాఁగి మ్రొక్కి వారు.
379
క. బాల మరణ శోకంబునఁ | దేలకయుండంగఁ గావు దేవోత్తమ! నీ
వాలించిన బ్రదికితిమి ద | యాళుహృదయ! పార్వతీప్రియా! చంద్రధరా!
380
వ. అనుచు లేచి నిలుచుటయు శివుం డా శిశుప్రాణంబు లొసంగి ‘వీఁడు శతాయుస్సంపన్నుం డగువాఁ’డని యానతిచ్చి, యాగృధ్ర జంబుకంబులకు నాఁకలి యెన్నండును లేకయుండం బ్రసాదించి యంతర్హితుండయ్యె; సంతోషంబున నంతరంగంబులు నంగంబులుం బొదల నజ్జనంబులు బాలునెత్తికొని పలుమఱుం జూచుచు, గౌఁగిలించుచుం జనిరి. గృధ్రంబును జంబుకంబును ముదంబునం బొంగుచుం బోయి తమ తమ కులంబులలోఁ బ్రభూతంబులై ప్రవర్తిల్లె; నార్త జనబాష్ప ప్రమార్జనంబు ప్రభువులకుం గర్తవ్యం బగుటకును నిజకార్యార్థులగు కపటుల నేర్పు మాటల తెరువు లెఱింగికొనుటకును నుదాహరణం బైన యీ గృధ్ర జంబుకోపాఖ్యానంబు. 381
క. వినినఁ బఠించిన వ్రాసినఁ | గొనియాడిన దురితపీడకుం దొలఁగి నరుం
డనుపమధర్మములకు భా | జన మగు; నాయుః ప్రవృద్ధి సంపద నొందున్‌.’
382
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )