పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - చతుర్థాశ్వాసము
మను బృహస్పతి సంవాదము (సం. 12-194-2)
సీ. ‘జ్ఞానయోగము కృపాసంపన్న బుద్ధి నా | కెఱిఁగింపవే!’ యన్న నెలమి నాతఁ
డతని కిట్లను ‘ననఘ! సత్కర్మ యో | గ శ్రద్ధ దానికిఁ గారణం బ
నిష్టంబు ద్రోవను నిష్టంబు దేరను | నరుఁడు కర్మాచరణం బొనర్చు
నెయ్యవి సుఖము లొక్కింత కాలమునకు | నవియు దుఃఖంబులై యావహిల్లు;
 
ఆ. నింత యెఱిఁగి ఫలమునెడ నిరపేక్షుఁడౌ | నతఁడు సౌఖ్యదుఃఖయమముఁ ద్రోచి
కామముఖ్య విపదకంపిత జ్ఞాన వి | శేషబుద్ధిఁ బరమసిద్ధిఁ బొందు.’
172
వ. అని వెండియు. 173
క. ‘అసమాలంబ మశబ్దము | రసగంధ స్పర్శరూప రహితం బగుటం
బ్రసరించు నింద్రియములకు | వసంబుగా దొందఁ బరమవస్తువు పుత్రా!
174
క. స్త్రీపుం నపుంసకత్వము | లా పరతత్త్వమున లేమి నది విను తత్త
ద్వ్యా పారాపేతంబయి | దీపించుచునుండు బోధదేహత్వమునన్‌.
175
తే. వెలు గుచుండెడి దీపంబు వేఱ వస్తు | వులఁ బ్రకాశింపఁజేయున ట్లలఘునిత్య
బోధన జ్యోతి యింద్రియంబులను మాన | సమును దన ప్రభ విగతజాడ్యములఁ జేయు.
176
క. విను పురుషున కింద్రియములు | మనంబు గలిగించుఁ గ్రియల మనుజేశునకుం
దన తన తెఱఁగునఁ గార్యము | లనేకములు సూపు సచివు లట్టుల వత్సా!’
177
వ. అని మఱియును. 178
చ. ‘అనలము దోఁచునే తరువునందుఁ గుఠారముఖంబు లైన సా
ధనములఁ ద్రెవ్వ? సజ్జనహితా! తగఁ ద్రచ్చినఁ గాక; యట్ల యి
త్తనువు నలంగఁ జేసి పరతత్త్వముఁ గాంతు మనంగ రాదు; వి
న్ననువున నాగమోక్తమథనం బొనరించినఁ గాని యారయన్‌.
179
క. డెందమున కింద్రియములకు | నొందఁ గ రాకున్న లేకయున్నే తత్త్వం
బెందు? నపరభాగంబునఁ | బొందవు చూడ్కు లది లేకపోవునె? సుమతీ!
180
క. వల యురి యోదము గాలము | గలిగి గదా మృగము పక్షి గజము ఝషము ద
క్షులు వట్టుదు! రట్టుల తద్‌| జ్ఞులు విజ్ఞానంబుకలిమిఁ జూతురు పురుషున్‌.
181
క. పా మెఱుఁగుఁ బాము కాళులు; | ధీమంతుం డెఱుఁగ నేర్చు ధీసాక్షిత్వ
శ్రీమంతుఁ బరమపురుషుని | ధీ మల నిర్మోచనంబు తెఱఁగు నెఱిఁగినన్‌.
182
క. కలుగుం దోఁపమి యమవసఁ | గలుగునె యంతటన? యమృతకరునకు నాశం
బలఘుతర వస్తువునకుం | గలదె యభావంబు మనసు గానని కలుచన్‌?
183
క. రవిబింబము రాహువు పయిఁ | గవిసినఁ బాసినను దోఁపకయుఁ దోఁచియు నుం
డు విధమ యజ్ఞానంబున | యవిరతి విరతుల యధీనుఁ డగు టాత్మునకున్‌.
184
క. విను మానస ప్రసన్నతఁ | దనుఁ గను పురుషుండు గలుషతం గానఁడు దే
ఱిన నీట రూపు సూడఁగ | ననువై కలఁక నది లేని యట్టుల పోలెన్‌.
185
తే. ఇంద్రియంబులు దమ యిచ్చ నిట్టునట్టుఁ | దిరిగె నేనియు దుఃఖముల్‌ దెచ్చు నవియ
కట్టువడి సుఖ మొనరించుఁ గాన యాత్మఁ | గావ వలయు నింద్రియచోరగణము వలన.
186
క. పాప క్షయమున బోధం | బాపాదింపఁబడి మెఱుఁగుటద్దము కరణిం
జూపునకు వచ్చుఁ దనుఁ దా | నా పురుషుఁడు గాంచు పనికినై తన్మయతన్‌.
187
తే. ధ్యానయోగ నిశ్చల మగు నంతరంగ | మెడలవిడుచు గుణంబుల నిద్ధశాంత
మైన నిర్గుణవస్తువునందుఁ గలయుఁ | బరమపద మది; దానికిఁ బరము లేదు.’
188
వ. అని పలికి సమ్యగానంబునకు మాయ మాటు గావున దాని మొఱంగు తెఱంగు దేటపఱుపం దలంచి యిట్లనియె. 189
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )