పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - చతుర్థాశ్వాసము
ఇంద్ర బలి సంవాద ప్రకారము (సం. 12-220-6)
వ. ఏ తద్విషయం బైన యది యొక్కటి యింద్ర బలి సంవాదం బను నితిహాసంబు గల; దాకర్ణింపుము. దేవాసురులకు సమరంబు సెల్లిన నందు విష్ణుని మహానుభావంబున దేవతలకు గెలుపై రుద్రాదిత్య మరుద్వసు గంధర్వ సిద్ధాదులు పరివేష్టింప నింద్రుం డైరావతారూఢుండై లీలం ద్రైలోక్యంబును జరించుచుండి యొకప్పుడు సముద్రోపాంతంబున నొక్క గిరిగహ్వరంబున యంగణంబున వైరోచనుం డగు బలిం గని చేరం జని యద్దనుజపతి దన్నుం జూచి నిస్సంభ్రముండును వైమనస్య రహితుండును నై యునికి నిరూపించి, యతనితో నిట్లనియె. 422
క. ‘హీనస్థానమున విభవ | హీనత నిట్లుండి రిపుల యెలమిఁ గనియు నీ
మానసమున శోకింపమి | దానవకులనాథ! యెవ్విధంబునఁ గలిగెన్‌?
423
ఆ. శౌర్యముననొ వృద్ధసంసేవ వలననొ | తపముననొ యుదాత్తతా నిరూఢి
గలిగి మమ్ము సరకుగాఁ గొన కున్నాఁడ | వేమి కతము? దీని నెఱుఁగఁ జెపుమ!’
424
వ. అనిన విని బలి యతని కిట్లనియె. 425
ఆ. ‘సరకు సేయ వను చసడ్డమాటలు గొన్ని | యాడినంత నేమియయ్యె నింద్ర!
నీదుశక్తి వింతయే దైవవశమున | నెట్టిపాటివారు నెట్లుఁ గారె?
426
క. నీవు మును హీనుఁ డగుటయు | నా వలనం గాదు; నీకు నను హీనదశా
భావితునిఁ జేయరా దివి | దైవకృతము; లట్లుగాన ధైర్యము వలయున్‌.
427
క. విను పర్యాయంబున సుఖ | మును దుఃఖముఁ జెందు జనులఁ బురుషుఁడు ధైర్యం
బున గర్వంబు విషాదం | బు నడంగింపఁ దగునండ్రు బుధు లది వినమే?
428
క. చెలులుం జుట్టలును సహా | యులు విభవము పెం పకాలయుక్తి నవస్థం
దొలఁగించుట గలదె? మదిం | దెలిసి మనుము మనికి యిట్టిదియ కా దెపుడున్‌.
429
క. నిను నే గెలుచుట కాలము | నన నీవును గాలయుక్తి నను గెలిచితి; గా
వున నశుభమునకు శుభమున | నకు గాలము సూవె కర్త కుశికతనూజా!
430
ఆ. నాకు నీకు నేల నాకేశ! శత్రుత్వ | మేరి కైనఁ గలదె యెందుఁ? బాక
మునకుఁ దెచ్చుచుండు జనులఁ గాలము వృక్ష | ఫల విధముగ రజ్జు పలుకు లుడుగు.’
431
వ. అని చెప్పి యంత నిలువక. 432
క. ‘కా దిది విక్రమకాలము | లే దిప్పుడు నాకు నలుక లీలాత్మక రో
షాదరము గలిగినను నిను | నీ దగు పరిజనముఁ గూల్పనే పెడసేతన్‌?’
433
వ. అని పలికి వెండియు. 434
క. ‘సరి పెంపునఁ గడునొప్పెదు | సురనాయక! యిపుడు మీఁదఁ జూచెదు నీకుం
బరిభవము దెచ్చుటకునై | కరము వెసన్‌ వచ్చు చేటుకాలము తెఱఁగున్‌.
435
తే. ఇంద్రు లెందఱు వో? రింద్రు లేల? బ్రహ్మ | లుండుదురె? తఱితోఁ దెగుచున్న వారు
గాక దానవసంఘంబు గాలవశతఁ | బొందు టేటికి నెగ్గింపఁ? బొమ్ము నీవు.
436
క. క్రతువులు సేఁతయు, దేవ | వ్రతములు సల్పుటయు, వృత్తవంతుఁ డగుటయుం
గతమే కాలము ద్రోచుట? | కతర్క్యవర్తనము గాల మది గొనదు సుమీ!’
437
క. అని యిట్లాడిన మాటలు | విని దనుజునిఁ జూచి యమరవిభుఁ డుల్లములో
నన సంరంభంబు నుడిపి | కొనుచు నతని కిట్టు లనియెఁ గురువంశవరా!
438
క. ‘అకట! భవచ్చిత్తము ని | ర్వికారమై భరితధృతి వివేకవినయశాం
తిక మగుచు వెలింగెడు దీ | నికిఁ గారణమైన నిష్ఠ నెఱి యెట్టిదియో!’
439
క. అనిన నతఁ డతని కిట్లను | ‘విను మనిషనాథ! యేను వేఱొకచోటం
గొని వచ్చితినే చిత్తం | బున కవికృతి ధృతి వివేక ముఖ్య గుణంబుల్‌?
440
వ. కాలప్రకారం బెఱుంగుదుం గావునఁ గలంగ కుండుదు. 441
తే. చెప్పుచున్నాఁడఁ గాలంబుచేత నెల్ల | విధముఁ జొప్పడు జనులకు వినుము కాల
మప్రమాదవర్తన మధిక ప్రమాద | సంగమత్తులు వా రెట్లు భంగపడరు?
442
క. కళలుం గాష్ఠలు లోనుగఁ | గల చిదురులఁ గూర్చుకొనుచుఁ గాలంబు జనం
బుల వడ్డికిచ్చు నాతని | వల నలవడఁ బొదివి తనకు వశ్యులఁ జేయున్‌.
443
క. కాల మడఁగించుఁ జనుఁ గ | ల్లోలిని గిరిఁ ద్రెంచుకరణి లోభక్రోధా
శీలత్వ కామ భయములఁ | దేలు జనుఁడు కాలవృత్తి తెఱఁగు నెఱుఁగునే?
444
క. ఇంతకు మును సూచితి నతఁ | డెంతయు నొప్పుగొని యుండె; నిది గడుఁ జిత్రం;
బింత వెసఁ జచ్చె ననుఁ దనుఁ | జింతింపఁడు జనుఁడు మూఢచిత్తత్వమునన్‌.
445
క. విను భావాభావంబులు | గని యత్యుత్తమ తపంబు గైకొను విద్వ
జ్జనుఁడు గనుఁ గాలగతి యె | ల్లను గరతలశోభితామలకముం బోలెన్‌.
446
క. కాలగతి గనుట శాంతికి | మూలంబై యంతరంగమున కాత్మమయ
త్వాలంబనంబు నిచ్చుఁ ద | దాలీనుండైన పురుషుఁ డక్షోభ్యుఁ డగున్‌.’
447
వ. అనిన విని పాకశాసనుం డతని వివేకపాకంబున కచ్చెరువొంది యభినందించి యతని కిట్లనియె. 448
ఆ. ‘దనుజనాథ! యివ్విధంబునఁ గాల చా | రిత్రవేదివై పవిత్రశీల
యుతుఁడ వైతి; నీవు కృతకృత్యుఁడవు; నీదు | వృత్తి గోరవలయు నుత్తములకు.
449
తే. లోక మెల్లను నఱచేతిలోన నున్న | యట్లు గనుగొని సత్త్వాదులైన మూఁడు
గుణములను బాయఁ బెట్టి నిర్గుణత వెలుఁగు | నాత్మఁ గనుచున్నవాఁడ; వే మందు నిన్ను!
450
క. కెలనికిఁ జూడఁగ దైన్యా | కలనం బగుచున్న యిపుడు గదిరిన దశయుం
దొలఁగుం గావుతఁ! గడుమే | లెలసి పరమసుఖముఁ బొందు మిచ్ఛావృత్తిన్‌.’
451
క. అని పలికి యుచితముగ వీ | డ్కొని విభవం బెసఁగ నభ్రకుంజరము పయిన్‌
వినువీథిఁ జనియె సురలును | మునులును వేష్టింప భూతములు వినుతింపన్‌.
452
తే. అమృతపానంబుఁ జేసిన యంతకంటె | నద్దనుజపతి మధురవాక్యామృతమున
సంభృతానందుఁడై సురేశ్వరుఁడు దనదు | పురమునకు నేఁగి సుఖముండెఁ గురువరేణ్య!’
453
వ. అని యిట్లు ధర్మతనయునకు భీష్ముండు పునర్భూతంబైన యింద్రబలి సంవాదంబు సెప్పె నని చెప్పిన విని మఱి యేమి సత్కథలు సెల్లెఁ? జెప్పుమని యడుగుటయు. 454
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )