పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - పంచమాశ్వాసము
దానగుణంబు సర్వవర్ణ సామాన్యంబుగా నిరూపించుట (సం. 12-226-14,15)
వ. దానానుష్ఠానంబు సర్వజాతి సామాన్యం బయిన యుత్తమధర్మంబు; పుణ్యపరులకు దాతవ్యంబుగాని వస్తువు లేదు; కాశ్యుండను రాజు దన ప్రాణంబు లిచ్చి బ్రాహ్మణుప్రాణంబులు గాచె, నౌశీనరుండగు శిబి యాత్మాంగంబుల నౌరస పుత్రునిని బ్రాహ్మణార్థంబుగా నొసంగెఁ; గాశీపతి యగు ప్రతర్దనుండు బ్రాహ్మణునికై నిజనయనంబులిచ్చె; విదేహుండును, జామదగ్న్యు ండును, గయుండును నొక్కొక్కతఱి సకల వసుంధరయును బ్రాహ్మణుల కిచ్చిరి; పాంచాల్యుండగు బ్రహ్మదత్తుండు శంఖనిధి విప్రోత్తములకు దానంబుసేసె; మఱియును బ్రాహ్మణులకుఁ బ్రాణ శరీర మణి హిరణ్య కన్యాగవాది ప్రశస్త వస్తువు లనేకు లర్హుల కొసంగిరి; వారలకెల్లను సమకూరిన సద్గతుల విశేషంబులం జెప్పం బెద్దయని వెండియు. 82
క. ‘దానాధ్యయన యజనముల | నానావిధపాపములు వినాశముఁ బొందుం
గాన యవి మేలు హింసా | హీనత ధర్మవిధిలేని యెడఁ గడు వలయున్‌.
83
ఆ. ధూతపాపుఁ డైన పూతాత్మకుండు ల | ఘ్వాశి యగుచు, నింద్రియముల గెల్చి
మనసులోనఁ గామమును గ్రోధమును జొర | నీక బ్రహ్మపదము నిచ్చఁ గోరు.
84
ఆ. ఇట్టివాఁడు వెడల నీఁదు నింద్రియజల | మన్యుపంక లోభమయ తటాది
ఘోరరూప యగు నసార సంసార వి | శాలనదిఁ బ్రశాంతశాలి హృదయ!
85
తే. ఘనతరప్రజ్ఞ యను తెప్ప గలుగువాఁడు | సంసరణనది గడవంగఁ జాలుఁ గాక!
కామమును గ్రోధమును మదిఁ గలిగి ప్రజ్ఞ | చించునేని నక్కడచుట చిక్కువడదె?
86
క. గతహర్షభయక్రోధుఁడు | ధృతిమంతుఁడు నప్రమత్తధీమహితుఁడు సం
శ్రితధర్ముఁడు దాంతుఁడు నగు | నతఁ డవసాదంబు నొందఁ డతులవివేకా!
87
క. ధర్మ మధర్మము వోలె న | ధర్మము దా ధర్మవిధి విధంబున దోఁచుం
గర్మసమితి నొక్కొక యెడ | ధర్మగతి యెఱుంగవలయుఁ దచ్ఛాస్త్రస్త్రములన్‌.’
88
వ. అని యుపదేశించి మఱియును. 89
క. ‘జ్ఞానంబు వడయుటకు వా | ఙ్మనసములు సునియతములు గావింతురు, స
మ్మానిత శాంతికొఱకు వి | జ్ఞానంబున నాత్మనియతి సల్పుదురు బుధుల్‌.
90
క. ఈ తెరువున వేదవిదుఁడు | వీతామ్నాయుండు ధర్మవేదియుఁ బాప
స్ఫీతుఁడు సరియై కడతు ర | నాతురత జరామరణమహాంభోరాశిన్‌.
91
వ. ఆచారనేమియుఁ, బ్రాణయుగంబును, నపానాక్షంబును, హ్రీవరూథంబును, నుపాయాపాయకూబరంబును, ఘ్రాణశ్రవణ వాహనంబును, జ్ఞానసారథికంబును, సర్వతంత్ర ప్రతోదంబును, ద్యాగరశ్మియు నగు యోగరథంబు నెక్కి వెరవుగలవాఁ డక్షరపదంబు సొరం జనఁజాలు; నా రథికుం డా తంత్రంబు ప్రభావంబునంజేసి. 92
క. వరుసన ధరణీపవనాం | బరజలతేజముల గెలుచు, బల మెక్కి యహం
కరణంబు ద్రోచు; బుద్ధిం | బరువడి నడఁగించుఁ బ్రకృతి పనిఁ బెడఁబాపున్‌.
93
ఆ. భూమిజయము దొడఁగి పురుషుఁ డంతంతకు | వృద్ధిఁ బొంది యోగసిద్ధిఁ బొందుఁ
బొగయు మిడుఁగుఱులును బొనుఁగు లేని శిఖియు | బహులశిఖలు నైన పగిది ననఘ!
94
తే. విను మహంకారజయము పృథ్వీ ముఖంబు | లైనవానిని బుద్ధి ప్రధానమును జ
యించునట్టి సంస్కారంబు నిచ్చు; దాన | నగు మహానుభావంబు సంయమివరులకు.
95
వ. ఇది యోగప్రకారంబు. 96
తే. అనఘ! యింద్రియముల విషయముల మీఁద | నిగుడనీక, మనంబుతో మగుడఁ దిగిచి
యాత్మఁగూర్చుట సాంఖ్యుల యనువు; సాంఖ్య | యోగములు రెండు నారయ నొక్క తెరువ.
97
క. ఈ రెండు ప్రకారంబుల | వారలకును మమత విడువవలయుట సరి; ని
స్సారపు సంసారమునకుఁ | గారణము మమత్వ మగుటఁ గవిజనముఖ్యా!
98
వ. భూతతారతమ్యంబులు సెప్పెద నాకర్ణింపుము: జంగమస్థావరంబులయందు జంగమంబులు లెస్స; యవి జరాయువు, నండంబును, నుద్భిదంబును, స్వేదంబును నను జనక విశేషంబుల జనియించి బహుపాదంబులును, ద్విపాదంబులు నైయుండు; నందు మనుష్యులు మేలు; మనుష్యుల యందు జాతిధర్మోపధారకు లెక్కుడు; జాతి ధర్మోపధారకుల యందు విప్రు లుత్తములు; విప్రులయందు వేదజ్ఞు లుదాత్తులు; వేదజ్ఞులయందుం బ్రవచనశీలు రుత్కృష్టులు; ప్రవచన శీలురయం దాత్మజ్ఞులధికులు; వారలు స్వధర్మవిదులు, సత్యసంకల్పులు, నధిభూతాధిదైవ వేదులు నగుదురు. వారలం జూవె దేవతలు బ్రాహ్మణు లండ్రు; వా రెల్ల వారికి నమస్కారాద్యుపచారాదరణీయులు; వారికి సరిలేరు; వా రాధారంబుగా సమస్త జగంబులుఁ బ్రవర్తిల్లుచున్నవి’ యని చెప్పి య మ్మహాత్ముండు వెండియు. 99
తే. ‘బ్రాహ్మణునకుఁ బ్రధానవర్తనము వినుము! | నిర్మలజ్ఞానయుక్తుఁడై కర్మసమితి
నలఘునిష్ఠమైఁ జలుపంగ వలయు; దాన | సంశయము లెల్లఁ బాయుఁ, బ్రసాద మొందు.
100
క. ఇయ్యఖిలము సృజియింపఁగ | నెయ్యది ప్రభు వమ్మహామహిత భూతము పొం
దయ్యెడి శుభంబు దపమునఁ | జయ్యన సిద్ధించు; నది విసంశయ మనఘా!
101
క. మైత్రిం బోలెడు ధర్మము | ధాత్రీ దివిజులకు లేదు; దాని నడపినం
బుత్రా! యేకర్మంబు ప | విత్రతయును వలవ దది వివేకముఁ జేర్చున్‌.’
102
వ. అనిన విని శుకుం డా సంయమివరున కిట్లనియె. 103
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )