| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| తే. |
హృదయవేదికయందు సమిద్ధమూర్తి | వెలుఁగుచుండు తేజమునందు వేల్చుఁ బ్రాణ ములను యాజి య ట్లంతరమున నొనర్చు | యాగమున వీతకల్మషుఁడై వెలుంగు. |
149 |
| క. |
విను! మాత్మతీర్థ సంసే | వనము తెఱం గెఱుఁగునట్టి వానికిఁ దిరుగం జనవలయునె పెఱచోటుల | కని చెప్పుదు రాశ్రితులకు నధ్యాత్మవిదుల్. |
150 |
| తే. |
అవనిఁ బొందదు దివమున నప్రమేయ | మండజంబు హిరణ్మయ మండమధ్య మున వెలుంగు నుజ్జ్వలపక్ష ఘనత; దాని | నెఱుఁగు సంతత యోగసమేతుఁ డనఘ! |
151 |
| క. |
విను మాఱంచులుఁ బండ్రెం | డనుపమధారలును నై నిజాస్యము విశ్వం బును బొదువఁ దిరుగు కాలం | బను చక్రము దురవబోధ మది యడఁగు గుహన్. |
152 |
| ఆ. |
మనసు నింద్రియములఁ బనిగొని పురుషుండు | ప్రచురశిక్షలేని రథ్యసమితి నడపు రథికు మాడ్కి నడవడి నవి యీడ్చి | నట్టులైన నశుభ మావహిల్లు. |
153 |
| క. |
తనకు మహిత ప్రసాదం | బొనరక యున్నేనిఁ గీళ్లు లొలయు; నది దృఢ త్వనిరూఢమైనఁ జేకుఱు | ననంత పదసిద్ధి; దాని కనువెఱిఁగింతున్. |
154 |
| తే. |
సర్వసంకల్పరహితుఁడై సత్త్వమున వి | నిశ్చలంబుగఁ జిత్తంబు నిలుపవలయు సత్త్వసక్త చిత్తంబు ప్రసాద మొసఁగు | దానఁ గాలంబు నడపు టుత్తమవిధంబు. |
155 |
| క. |
వినుము నివాతస్థానం | బునఁ గం పనరహిత దీపము వెలింగెడు చా డ్పున నంతరాత్మ వెలుఁగుచు | నునికి ప్రసాదంబు భంగి యుత్తమధిషణా! || |
156 |
| క. |
విను తత్ప్రసాదవంతుఁడు | దనయందు నిరంజనముగఁ ద న్ననిశంబుం గనుఁగొనుచు నియతి నియతా | శనుఁడై యుండుట యొనర్చు శాశ్వతపదమున్. |
157 |
| తే. |
అతులవేదాంతశాస్త్ర మహాంబురాశిఁ | ద్రచ్చి పుచ్చిన నవనీత మిచ్చితిని స మాదరంబునఁ గైకొను మనుసరించు | నిర్మలాత్మ తపస్వికి నీవు నొసఁగు. |
158 |
| ఆ. |
సకల రత్నపూర్ణ సర్వవసుంధరా | చక్రదాన విధియు సరి యనంగ రాదు విశ్వవేదరాశి సారాధ్యాత్మ | విద్య యిచ్చుటకు వివేకధుర్య!’ |
159 |
| వ. | అని యుపదేశించి ‘యింక నేమి వినవల?’ తనిన శుకుండు ‘దీనికంటె వినవలయునది గలదె? దీనిన సుదృఢంబుగా ననుగ్రహింపవే!’ యనుటయు ననుకంపావిధేయుం డగు సాత్యవతేయుం డతని కిట్లనియె. | 160 |
| క. |
భూతంబులఁ బచరించుచు | భూతాత్ముఁడు వానిఁ దన విభూతి నడంచున్. భూతాహరణంబు నిజ | ద్యోతనము దదీయవృత్తి దుర్దశ పుత్రా! |
161 |
| క. |
అవయవము లెట్లు కూర్మము | నివిడించును లోని కడఁచు నెఱి నట్టుల భూ తవితతి భూతాత్ముండును | బ్రవర్తన నివర్తనముల పాల్పడఁజేయున్. |
162 |
| క. |
మాయాశబలుం డై యటు | సేయకపోరామి భూతసృష్టి యొనర్చున్ మాయఁ బెడఁబాప భూత ని | కాయాభావ మగు నదియ కవిజనముఖ్యా! |
163 |
| తే. |
గగన పవనతేజో జలక్ష్మా గుణములు | సూవె శబ్దాదికంబును శ్రోత్రముఖ్య కంబునై చెల్లు విషయచయంబు నింద్రి | యవ్రజంబును సర్వంబు నడఁచు శమము. |
164 |
| క. |
విను మై దింద్రియములకును | మనంబు షష్ఠంబు; సప్తమత్వము బుద్ధిం బనుగొను; భవ్యక్షేత్ర | జ్ఞునియం దష్టమత గల్గు సుగుణాభరణా! |
165 |
| తే. |
తలఁచు మనమందు నిశ్చయదశ యొనర్చు | బుద్ధి సర్వైక సాక్షిత్వమున వెలుంగు నంతరాత్ముండు క్షేత్రజ్ఞుఁ డనఁగ వాని | మెఱపు సత్త్వాదిగుణములై మెఱయు వత్స! |
166 |
| తే. |
స్వస్థతయు దుఃస్థతయు జడత్వమును గ్రమవి | గణన సత్త్వరజస్తమోగుణము లవి స మీరితములగు టడఁగుట యింద్రియంబు | లడరు టొదుఁగుట బుద్ధి కృత్యములు పుత్ర! |
167 |
| తే. |
అనఘ! యింద్రియములు విషయములు మనసు | బుద్ధియును నాత్మయును గ్రమంబునన యెక్కు; డాత్మ బుద్ధి యనంగ నల్పాంతరంపు | వస్తువులు బుద్ధి యిన్నింట విస్తరిలుట. |
168 |
| క. |
కనుఁ గన్నై వినుఁ జెవియై | కొనుఁ జవి జిహ్వ యయి మూరుకొను నాసికయై, తనువై స్పర్శము గైకొను | ననవద్యా! బుద్ధి యాత్మయంద నిలుచుచున్. |
169 |
| క. |
ప్రీతిం గడుఁ బొదలు విషా | దాతురతన్ స్రుక్కుఁ దద్ద్వయము లేక సమ త్వాతిశయంబున నిలుచును | నేతృత్వంబునను బుద్ధి నెఱపు గుణములన్. |
170 |
| ఆ. |
తత్స్వభావ మెఱిఁగి తా నింద్రియాది స | ప్తకము వెంటఁ బోక తన్నుఁ గనుచు, నున్న వానిఁ బొందనోపునె దుఃఖదై | న్యంబు సుఖమదంబు నప్రమత్త! |
171 |
| ఆ. |
జలములందు నిలిచి జలపక్షి మునుఁగదు; | మేడిపండు మశకపీడఁ బొరయ; దట్ల విషయసమితియందుఁ దానది దన | యందు నుండి వికృతి నొంద దాత్మ.’ |
172 |
| వ. | అని చెప్పి మఱియును. | 173 |
| క. |
‘విను మూర్ణనాభి తంతువు | జనియింపఁగఁ జేసినట్లు సత్త్వగుణము సం జనకం బగు నది పురుషుఁడు | గనుట యుదాసీనతన వికారము గలదే? |
174 |
| ఆ. |
ఆదినిధనరహితుఁ డగు నిరంజనుఁ జెంది | గుణము లెడల విడిచి, క్రోధలోభ ములకుఁ జొరవ యీని ముని హృదయగ్రంథి | విరియ నడఁచి మోక్ష విభవ మొందు. |
175 |
| క. |
శమసంపద బాహ్మణ జ | న్మమునకు సామగ్ర్య మవ్వినయసారము చి త్తమున కలవడ్డ మునికి భ | యము శోకము మదము హర్ష మనునివి గలవే? |
176 |
| క. |
శమనిరతియు నాత్మ జ్ఞా | నముఁ జువ్వే బుధ లక్షణంబులు పర్యా ప్తము లివి రెండు నరయ మో | క్షము సాధించుటకు వేఱ కల్పన లేలా?’ |
177 |
| వ. | అనిన విని శుకుండు ‘ధర్మంబుల కెల్లఁ బరమంబయిన ధర్మం బెఱింగింపవే!’ యనుటయు వాత్సల్యపరాయణుం డగు నబ్బాదరాయణుండు ‘సనాతనంబును, మునిసత్తమ సంస్తుత్యంబును నగునుత్తమ ధర్మంబు సెప్పెద; నేకాగ్రచిత్తుండ వయి యాకర్ణింపు’మని పలికి యిట్లనియె. | 178 |