పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - పంచమాశ్వాసము
భీష్ముఁడు ధర్మరాజునకు మృత్యుదేవత తెఱం గెఱింగించుట (సం. 12-248-7)
సీ. విను మకంపనుఁ డను మనుజేంద్రుఁ డాత్మజుఁ | డాహవంబున మృతుఁ డైన, వగపు
గదురంగనుండి నారదు నలవోక వ | చ్చిన వానిఁ గని సవిశేషభక్తి
యుతముగా నాతిథ్య మొనరించి తన వగ | పెఱిఁగించుటయు, నమ్మునీశ్వరుండు
గరుణ శోకనిరాసకారణం బైన యా | ఖ్యాన మొక్కటి సెప్పె; దాని తెఱఁగు
 
తే. దేటపడునట్లుగాఁ బరిపాటి తోడ | నఖిలమును నెఱింగించెద నవహితుండ
వై వినంగ నీ వడిగిన యర్థమునకు | బోధకం బగు నది కురుభూపవర్య!
202
వ. అజుండు జగంబులు సృజియింప జంతుసంతానంబు వెరిఁగి సమ్మర్దం బధికంబై యూర్పు వోవని యట్లయిన నద్దేవుండు సంకటపడి సంహారప్రకారంబు విచారింపం దదీయ చిత్తంబు కార్యదాహంబున మహాదహనుండు జనియించి జగంబులు దహింపం జొచ్చిన. 203
తే. త్రినయనుఁడు వచ్చి యాతనిఁ దేర్చె; నాతఁ | డాతెఱం గెఱిఁగించి యయ్యగ్ని నుడిపె;
నపుడు పుట్టెఁ దదీయేంద్రియవ్రజమున | నొక్క యంగన రక్తాక్షి యుజ్జ్వలాంగి.
204
వ. పుట్టి దక్షిణాభిముఖియై పోవం గని కమలసంభవుండు పిలిచి ‘మృత్యువ! ప్రజలఁ బ్రబల దుర్బలభేదంబు లేక సంహరింపు’ మనుటయు నవ్వనిత వనటం గన్నీరొలుక ‘నీ కుద్భవించి క్రూరకర్మంబు సేయుదునే? ధర్మకార్యంబునకుం బనుపు’మని పలికిన నయ్యశ్రుబిందువులు దోయిటంబట్టి యద్దేవుం డమ్ముద్దియతో ‘నిదియపనిగా నుదయించినదానవు; నీవు ప్రజాసంహారంబు సేయవలయు’ ననవుడు నాబాల గాలిం దూలు తీవయుంబోలెఁ గంపంబు నొందుచు. 205
క. ‘మనుజుల హరించి బాంధవ | జనమున శోకంబుఁ జూడఁ జాలుదునె? తపం
బున కేఁగెద సదయంబుగ | ననుజ్ఞ సేయంగవలయు’ నని ప్రణమిల్లెన్‌.
206
వ. దానికి నరవిందసంభవుండు మందస్మితంబుతో ‘ని ట్లే లగు? జంతుసంహారంబు నీ కవశ్యకర్తవ్యంబు; దానిం జేయమి సువ్వె యధర్మం’ బని నిర్బంధించిన నూరకుండి యన్నాతి పదంపడి యల్లన సురిఁగి ధేనుకాశ్రమంబున కరిగి యత్యంత దీర్ఘకాలంబు ఘోరతపంబు సేసి, కౌశికి గంగ నందయను నదులకుం బోయి వాయు వాహారంబుగా నతిదుష్కరవ్రతంబు లనేక వర్షంబు లాచరించి హిమశిఖరి శిఖరంబునకుం జని చతురానన ప్రీతికరం బగు నిష్ఠాతిశయంబున సంయమంబు దాల్చియుండ నద్దేవుండు. 207
క. సన్నిధిసేసి తపముమెయి | నున్నఁ బ్రయోజనము గలదె? యుడుగుము పుత్రీ!’
యన్న ‘శరణంబు వేఁడెద | నన్ను దయం గావు’ మనియె నాతి యతనితోన్‌.
208
వ. అనిన విని యమ్మహాత్ముండు. 209
తే. ‘ప్రజల హరియించు టిది నీకు పరమధర్మ; | మేను బొంకెదనే? దీని నెల్ల భంగి
నాచరింపన వలయు; మత్ప్రార్థనంబు | భగ్న మొనరించు టొప్పదు పద్మనయన!
210
వ. మఱియు నొక్క విశేషంబు సెప్పెద; నీయశ్రుజలంబు లే నంజలిపుటంబునం బట్టు టెఱుంగుదు గాదె? యవి నానావ్యాధిరూపంబుల మానవుల బాధించుఁ; గామ క్రోధంబులు వానికిం దోడుపడు; వారు దానన తెగుదురు; నీవు నిమిత్తమాత్రం; బింతియ; నీకు వరం బిచ్చెద. 211
తే. పురుషుఁడును నంగనయును నపుంసకుండు | నగుము పుత్రిక! పురుషుని నంగనను న
పుంసకుని జంపువేళలఁ బొందకుండు | పాపమును నిది ధర్మమై పరఁగు నీకు.’
212
వ. అని పలుకుటయు నప్పొలంతి శాపంబునకు వెఱచియు, నది యట్టిద కాక యను తలంపు దోఁచియుఁ, బ్రజాసంహారంబు సేయు నధికారంబు పూనె; మృత్యుదేవత ప్రాణాపహారిణి యగుఁ బ్రాణిజాలంబు దేహంబులం బాసి దేవాదిభావంబులం బొందుచు మగుడ మనుష్యత్వంబు నొందుచుండు. 213
తే. భీమనాదుండు భీముఁ డుద్దాముఁ డప్ర | తర్క్య తేజోమయుఁడు జగత్ప్రాణుఁ డొడలు
మనుపఁ జెఱుపంగ నొడయండు సనుట మగుడ | నరుగుదెంచుట వింతగా దతని కెందు.’
214
వ. అనినం ‘దొల్లియు నిది వింటి; నాఁ డత్యంత శోకాక్రాంతుండ నగుట న వ్వినికి రిత్తవోయె; నేఁ డీ యుపాఖ్యానంబున యర్థంబు పరిజ్ఞాతం బయ్యె.’ 215
క. అని పలికి యధిప! కుంతీ | తన యాగ్రజుఁ డిట్టు లనుఁ బితామహుతో ‘స
జ్జనకోటి ధర్మమునకును | మనమున వెఱచు; నది యింత మాన్యం బగునే?
216
వ. ధర్మంబు తెఱం గిట్టిదని నిరూపించి యనుగ్రహింపుము.’ 217
సీ. అనుటయు నతఁ డిట్టు లనియె ‘వేదంబుల | మీఁది భక్తియు దృఢస్మృతియు సమ్య
గాచారమును రుచిరాకారములు ధర్మ | మునకుఁ గొందఱు బుధజనము లర్థ
మగుఁ జతుర్థాకార మం; డ్రయినను బాడి | దప్పియు బొంకియు ధనము గూర్చు
టెల్ల పాపములకు నెక్కుడు; బొంకమి | పరుల సొమ్ముల కాసపడమి సర్వ
 
ఆ. ధర్మములకు నధికతరములు విధివిహి | తంబు గాని యట్టి ధర్మ మనఘ!
చవుట నిడిన విత్తు చాడ్పున రూపించి | చేయ నిహపరములఁ జెందు సుఖము.
218
వ. ధర్మంబు తెఱంగు సూక్ష్మ ంబు; ధర్మంబులు బహువిధంబు; లట్లు గావున ధర్మసర్వస్వ నైజస్వరూప నిరూపణంబు సేసి కరతలామలకంబుగాఁ బలికెద నాకర్ణింపుము. 219
క. ఒరు లేమేమి యొనర్చిన | నరవర! యప్రియము తన మనంబున కగుఁ దా
నొరులకు నవి సేయకునికి | పరాయణము పరమధర్మపథముల కెల్లన్‌.’
220
వ. అని చెప్పినం బ్రీతుండై తాతకుం బ్రణమిల్లి పాండవాగ్రజుండు ‘ధర్మస్వరూప నిరూపణం బింత యొప్పునే!’ యని యభివర్ణించి ‘యాగ్రహంబున నేమేనియు నడుగుచున్నవానింగా నన్నుం దలంప వలదు; వలవని యట్టిది యడుగం దెలిసికొనుటకై వలయునది యడుగుదు; నట్లుంగాక యడిగిన దానిన యడుగుటయుం గలుగుఁ; గృప నాదరింపుము. సమ్యగాచారంబు ధర్మప్రకారంబని నిర్దేశించితి; వుత్తమాచార ప్రకారం బెఱింగింపవే’ యనుటయు నమ్మనుజపతికి నమ్మహితాత్ముం డిట్లనియె. 221
తే. ‘వేద మాచారములఁ జెప్పు వివిధగతుల; | సకలహిత మగునట్టి యాచార మరయ
ననఘ! వేఱొండు గలదె? మహాత్ము లెద్ది | యాచరించిరి దానిఁ జేయంగవలయు.’
222
వ. అని పలికి ‘తొల్లి జాజలి యను మునికిఁ దులాధారుండను వణిగ్వరునితో సంవాదంబు గలిగె; నది యితిహాసరూపంబునఁ జెల్లు; నేతద్విషయంబయి యుండు దానిం జెప్పెద; నాకర్ణింపుము. 223
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )