| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| వ. | అని మఱియు నిట్లను ‘బ్రహ్మగీత లను వాక్యంబు లాకర్ణింపుము. | 246 |
| క. |
యాగంబునందు శ్రద్ధా | యోగముగల యశుచి శ్రద్ధ యొనరని శుచి పు ణ్యాగమసంపదఁ దుల్యులు | గా గణుతించిరి నిరూపకత నమరవరుల్. |
247 |
| క. |
విను! మజుఁడు శ్రద్ధ యతిపా | వని, యది గలవాఁడు గౌరవశ్రేష్ఠుం; డా తని యన్నము భోజ్యతరం | బని నిర్దేశించె నెల్ల యమరులు వినఁగన్. |
248 |
| ఉ. |
వారక వడ్డి కిచ్చి కుడువన్ వెరవారిన దానశీలు నె వ్వారికిఁ జేయుఁ జూపక ధ్రువంబుగ లోభగుణంబ పట్టి ని స్సారత నుండు వేదవిదు సామ్యముఁ జేర్చి రమర్త్యులందు న వ్వారిజసూతి దాని యగువాఁ డధికుం డనియెన్ హవిర్విధిన్. |
249 |
| ఆ. |
దానగుణము శ్రద్ధ లేనివానికి లేదు | గాన యివ్విధమునఁ గమలభవుఁడు నిశ్చయించె; నీవు నిర్మలశ్రద్ధాభి | పూతమతివి గమ్ము పుణ్యచరిత! |
250 |
| ఆ. |
వినుము శ్రద్ధ గలుగు మనుజుండు పాపంబుఁ | దొలఁగఁ ద్రోవనేర్చుఁ; దోలు డిగ్గ నూడ్వ వెరవు గలుగు నురగంబు చాడ్పునఁ | గాన మేలు శ్రద్దధానుఁ డగుట.’ |
251 |
| వ. | అని వెండియు. | 252 |
| ఆ. |
‘మత్సరాది చిత్తమాలిన్యములు శ్రద్ధ | గల మనంబునందు నిలువనేర’ వనినఁ దేఱి యిట్టులనియె జాజలి తులా | ధారుతోడ నిభృతిఁ గౌరవేంద్ర! |
253 |
| క. |
మునులవలనఁ దత్త్వం బే | వినకుండుటఁ జేసి యిట్టివిధము గలిగె నా కనఘా! నీ వాక్యంబుల | మనంబు దెలివొందె శాంతి మరగెద నింకన్.’ |
254 |
| వ. | అనిన నభినందించి తులాధారుండు. | 255 |
| క. |
తన తన తెరువునఁ గర్మం | బనుష్ఠితం బైన మేల యనఘ! నివృత్తిం గని శ్రద్ధ గూర్పఁగా నే | ర్పెనయంగా వలయు దాని యెడయం దతఁడున్. |
256 |
| ఆ. |
అట్లకాక యని ప్రియంబుమై వీడ్కొని | జాజలియును జనియె రాజవర్య! యిహపరముల నెసకమెసఁగ సౌఖ్యము తులా | ధారుఁడును సమున్నతత్వ మొందె. |
257 |
| క. |
ఆ వణిజుఁడు ధర్మస్థితి | దేవతలును మెచ్చునట్లు దెలియఁగఁ బలికెన్ నీ వీ వాక్యము లన్నిట | భావం బలవఱిచి కసటు వాపుము వత్సా!’ |
258 |
| వ. | అని చెప్పినం బ్రమదంబు నొంది. | 259 |
| క. |
సురసరిదాత్మజుతోఁ గురు | నరపాలోత్తముఁడు వినయనమ్రుం డగుచున్ ‘జిరమో కార్యసమీక్ష య | చిరమో వలయునది కరుణఁ జెప్పు’ మనవుడున్. |
260 |
| వ. | అతం డతని కిట్లనియె: | 261 |
| క. |
‘త్వరితము సేయక కార్యము | చిరంతన విమర్శనముగఁ జేసి యొనర్పన్ ధరణీశ్వర! యోటువడఁడు | పురుషుఁడు; సిద్ధియును వానిఁ బొందు దృఢముగన్. |
262 |
| క. |
తాలిమి లేని జనంబులు | మేలెఱుఁగక యట్టివాని మీఁదను జాడ్యం బాలస్యం బిది యని దో | షాలోచన మాచరింతు; రది మతి యగునే? |
263 |
| వ. | అని చెప్పి వెండియు నిట్లను ‘నీవడిగిన యర్థంబు మేధాతిథి యను మునిసుతుండు చిరకారి యనువాని వృత్తాంతంబు వినినం దెలియు; దానిం జెప్పెద. | 264 |