| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| ఆ. |
‘శమము దమము లేమి జనులకు హింస నొ | నర్చుఁ గాన ధరణినాథ! విను మ హింస శమదమములు హృదయంబునకు నెప్డు | నలవడంగఁ జేఁత యండ్రు బుధులు.’ |
511 |
| వ. | అని చెప్పి వెండియుం బరాశరమునీశ్వరుం డిట్లనియె. | 512 |
| క. |
‘దురమున జయము గొనుటకై | నరపతులకు వలయు హింసనం బెట్లును; ద త్పరిహరణ స్థానములును | ధరణీశ్వర! కలవు సెప్పెదను విను వానిన్. |
513 |
| క. |
పడినం బాఱినఁ గైదువు | వడినను వాహనము వడినఁ బార్థివముఖ్యా! పొడువఁదగదు శత్రుని నె | య్యెడల నహింసనముఁ బోల వే సుకృతములున్. |
514 |
| క. |
న్యాయమున సంగరంబుం | జేయఁగ శస్త్రాగ్ని దన్నుఁ జెందిన దానం గాయంబు విడుచు పురుషుఁడు | వేయేటికి మోక్షలక్ష్మి విభుఁ డగు నధిపా! |
515 |
| క. |
తనతోఁ దుల్యుం డైనను | మనుజాధిప! యధికబల సమగ్రత్వము గ ల్గిన నని శత్రుని వధియిం | చిన నరపతి పుణ్యలోక సిద్ధిం బొందున్.’ |
516 |
| వ. | అని మఱియును. | 517 |
| క. |
‘భూతంబులు నింద్రియ సం | ఘాతము సత్త్వాదిగుణనికాయముఁ గాయం బైతోఁచు టెఱిఁగినను ధ | ర్మేతరకృత్యములు సేయునే నరుఁ డనఘా! |
518 |
| క. |
జాతుఁడు మృతుఁ డగుట ధ్రువము; | భూతోల్లాసము లనిత్యములు; విను సద్యః పాతి యగు శరీరంబున | కై తొఱఁగునె ధర్మపథము నార్యుం డనఘా! |
519 |
| తే. |
ఉత్తరాయణమును సంగరోత్సవాది | కారణంబులుఁ గలుగు సత్కర్మపరుని మరణమునకు దుష్కాలంబు గరళరజ్జు | జలముఖములుఁ బాటిలు దుష్టచరితుమృతికి. |
520 |
| క. |
మానవులకుఁ దలఁపఁగ న | జ్ఞానమునట్టి పగ లే; దసంగతకృత్యా ధీనుండై రూపు సెడును | దానం గావున నుదాత్త ధర్మవిధిజ్ఞా! |
521 |
| క. |
మానుషజన్మము మే; లతి | హీనపు జాతిని జనించె నేనియు నన్యం బైన జననంబు కంటెను | దాన సుగతివడయ నగుట దత్త్వప్రవణా! |
522 |
| క. |
దానములఁ బుణ్యతీర్థ | స్నానంబుల నతిథిపూజనంబులను ఫలా దాన నిరతుండు గా కీ | మానుష్యము గారవించు మతి నిత్యుఁడగున్.’ |
523 |
| వ. | అనిన విని జనక జనేశ్వరుండు పరాశరమునీశ్వరునితో ‘మే లెయ్యది? పరమగతి యెయ్యది? కృతంబైన నెద్దానికి నాశంబు లేకుండు? నెఱింగింపవే’ యనవుడు నమ్మహీపతి కమ్మహాత్ముం డిట్లనియె. | 524 |
| ఆ. |
‘అరయ మే లసంగ; మంచితజ్ఞానంబు | పరమగతి, మహాతపంబు చేటు లేని కృత్య; మిట్లుగా నెఱుంగుట సర్వ | వేదవాక్య తత్త్వవిత్త్వ మనఘ! |
525 |
| వ. | అని చెప్పి వెండియు. | 526 |
| క. |
విను సుమతి విషయములయం | దునికి గలిగె నేనిఁ బొందఁ డుదకంబులఁ బొం దని బిసరుహపత్త్రము చా | డ్పున నది విజ్ఞానఫలము భూపవరేణ్యా! |
527 |
| తే. |
అనఘ! మూఢాత్ము చిత్తంబునందు విషయ | జాల మత్యంత గాఢసంసక్తి నొందు లక్కరసము దండాదుల జిక్కఁబట్టు | చందమున దీనిఁ గనుట ప్రశాంతికరము. |
528 |
| క. |
ఇనరుచిఁ బాషాణము ర |శ్మి నిరూఢం బైనయట్ల చిత్తము సద్భా వనమున సదాత్మకం బగు | ననామయ స్థితికి మూల మది మనుజేంద్రా! |
529 |
| క. |
ఆరయఁ గదళీగర్భా | సారము సంసార; మిట్టిచంద మెఱిఁగినం జేరవు జనన మరణములు; | గారించును దీని భంగిఁ గానక యున్నన్. |
530 |
| క. |
ఒరుల పనికిఁగా నిజహిత | విరహితుఁ డగునట్లు గాదె వివిధేంద్రియకా ర్యరతుండై యాత్మసము | ద్ధరణంబును జేయకునికి ధరణీనాథా! |
531 |
| క. |
తన గృహమున నభ్యాసం | బున మెలఁగెడు నంధు చందమున సంసారం బునఁ దిరుగు మూఢుఁ డెఱుఁగఁడు | వినుతం బగుమోక్షపదము విమలవివేకా! |
532 |
| క. |
వినుము! మృణాళంబున నం | టిన రొంపి జలంబులం గడిగినను బెడఁబా సిన క్రియ విమల జ్ఞానం | బున సంసారంబు వాయుఁ బురుషు నరేంద్రా! |
533 |
| క. |
నరనాయక! శిశ్నోదర | పరాయణుం డగుచు నొండు పరికింపని దు ర్నరుఁ డెలుకఁ బిల్లి వొదివిన | పరుసున జర వొదువ ముక్తిఁ బడయక పొలియున్. |
534 |
| తే. |
వ్రేఁగు పెద్దైన నోడ వారిధిఁ దరింప | లేని భంగి మనోభవాలీఢవృత్తి యగుచునుండు జీవుండు భవాబ్ధియుత్త | రింపలేఁ డిది నిజము గరిష్ఠచరిత! |
535 |
| క. |
పడియెడు దుఃఖము లరయం | గడుఁబెక్కల్పములు గను సుఖంబులు వీనం బడయఁగ నగుమే లెయ్యది? | విడుప యురవు శుభము పొందు విద్యాప్రవణా! |
536 |
| క. |
మిత్రులు భార్యలు భ్రాతలుఁ | బుత్రులు నిజకార్యపరులు బోధము సు మ్మా త్మత్రాణమునకు మూలము | ధాత్రీపతివర్య! యెవ్విధంబునఁ జూడన్. |
537 |
| ఆ. |
ధీరుఁడై యభేదదృష్టియ పాటించు | చుండునట్టి పురుషు నొక్కమాటు విడువ దర్కునంశు విభవంబు చాడ్పున | బోధలక్ష్మి పెంపు భూపవర్య! |
538 |
| క. |
అని యిట్లు పెక్కుభంగుల | మునివరుఁడు పరాశరుం డమోఘ ప్రజ్ఞా ఘనత యొలయంగఁ జెప్పిన | జనకుఁడు ముదమందె భరత సంతతివర్యా! |
539 |