పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - షష్ఠాశ్వాసము
యాజ్ఞవల్క్యుఁడు జనకునితో మరణసూచకంబులఁ జెప్పుట (సం. 12-305-7)
వ. అని చెప్పి మఱియు నిట్లను ‘నరిష్టంబుల తెఱం గెఱుంగవలయుం గావున నెఱింగించెద నాకర్ణింపుము.’ 125
సీ. ‘ధ్రువమండలమున నరుంధతిఁ గనుశక్తి | గంటికిఁ గలుగంగఁ గానకున్న
ముక్కున వలపటఁ జెక్కవాసినయట్లు | దోఁచినఁ బూర్ణచంద్రుండు మలినుఁ
డై కానవచ్చిన నాయువు సంవత్స | రంబునఁ గడచను రాజముఖ్య!
కాంతి దొల్లిటియట్లుగాక యంతకు నెక్కు | డైనను గడుఁజెడ్డ నట్లు ప్రజ్ఞ
 
తే. క్రొత్తగాఁ బెద్దయైనను గొంచెమైన | నాఱునెలల మరణదశ యగుట గలుగు
నిందుమండలమున రవి యందు నడుమఁ | దెఱపి గాంచినఁ దెగు నేడు దివసములకు.
126
క. విను గుడిలోనున్న సమయ | మున సురభిద్రవ్యములను బొల వల్చుట గ
ల్గిన నాఱు దివసములఁ గ | ల్గును మృత్యుసమాగమంబు గుణరత్ననిధీ!
127
తే. ముక్కువ్రాలుట కర్ణముల్‌ మ్రొగ్గఁబడుట | రదనవైవర్ణ్యమక్షి విరాగభావ
మంగ మతికృష్ణ మగు టుల్ల మడరఁ జెడుట | సూచకములు సద్యోమృత్యు గోచరతకు.
128
తే. కారణము లేక దాపలి కను ద్రవించు | నెత్తి చక్కటి ధూమంబు నెగయు నపుడ
మరణదశ యావహిల్లెడు మానవునకు | జనకనృప! యివి బ్రహ్మ సెప్పిన విధములు.
129
క. విను యోగివరుఁ డరిష్టము | కనుఁగొని యనిశమును యోగగతియుతసాంఖ్యం
బనపాయత నడుపుచు నా | త్మునిఁ బరముం జేర్చి కాలముం గబళించున్‌.
130
వ. ఇవ్విధమున నతండు. 131
ఆ. కాల కబళనైక శీలుఁడై మృత్యువు | గెలిచి శాశ్వతము నచలము శివము
నచ్యుతము ననామయము నమృతము నవ్య | యంబు నగు పదంబునందు నిలుచు.’
132
వ. అని పలికి యాజ్ఞవల్క్య మునీశ్వరుండు జనకజనేశ్వరుతోఁ ‘బరంబు దేటపఱుపు మని నీ వడిగి; తా ప్రశ్నంబు సూక్ష్మ ం; బుత్తరం బవహితుండ వయి విను’మని యిట్లనియె. 133
సీ. ‘మహనీయతపమున మార్తాండు నాకుఁ బ్ర | సన్నుఁగాఁ జేసితి సదయదృష్టి
ననుఁజూచి యద్దేవుఁ డనఘ! వరంబు నీ | కిచ్చెద నీ కోర్కి యెద్ది? సెప్పు
మనవుడుఁ బ్రణతుండనై యజుస్సంప్రాప్తి | గోరెద ననిన నవ్వారిజాప్తుఁ
డట్లేని వాగ్దేవి నావహించెద వివృ | తంబుగాఁ జేయు మాస్యంబు విప్ర!
 
తే. యనియె నవ్వచనము విని యాననమ్ము | సంతసమున విచ్చితి సరస్వతియు నాదు
తనువుఁ జొచ్చెఁ బదంపడి దాహమొంది | తన్ను నెఱుఁగక వెగడొందు నన్ను నినుఁడు.
134
క. కనుఁగొని యించుకసేపునఁ | దనువడు నని పలికెఁ బిదపఁ దనువడుటయునుం
బనుపడియె నప్పు డద్దే | వుని వదనాబ్జమున నా చెవుల కింపారన్‌.
135
క. భూసురవర! వేదము ప్రతి | భాసిల్లుచు సంతతప్రపత్తి గలుగు ను
ల్లాసంబు బుద్ధినొందు స | మాసన్నంబు లగు సాంఖ్యమతయోగంబుల్‌.
136
ఆ. యోగసాంఖ్య సిద్ధినొందు నిష్టావాప్తి | సనుము సమ్మదమున’ నను మృదూక్తు
లుద్భవించె మోద ముత్కట మయ్యె నా | కమృతవృష్టిఁ దోఁగినట్టు లైతి.
137
వ. తదనంతరంబ యద్దేవుం డస్తాచలంబువలని కరిగె; నేనుం బరమానందకందళిత మనస్కుండ నగుచు మందిరంబున కేతెంచి సరస్వతిం దలంచుచున్నంత - 138
క. వినుము వినుతస్వరవ్యం | జనభూషిత యగ్రభాగ సంస్ఫురదోంకా
రనితాంత హృద్యమధుగ | ర్భనిజాకృతి విశదముగ సరస్వతి దోఁచెన్‌.
139
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )