| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - షష్ఠాశ్వాసము |
| క. |
అని బోధించిన జనకు వ | చనములు విని శుకుఁడు విగతసంశయుఁడై శాం తినిరూఢిఁ బరమసౌఖ్యం | బు నొంది తనుఁ దాన కనుచుఁ బోవుచునుండెన్. |
292 |
| తే. |
మారుతముతో సమానధర్మత్వమొంది | యతఁ డుదఙ్ముఖుడై నిఖిలామరులును మునులు గరుడగంధర్వాదులును గుతూహ | లమున వసియించు శిశిరశైలమున కరిగె. |
293 |
| సీ. |
కురువంశముఖ్య! యగ్గిరి పుణ్యవిభవస | మేతంబు విను మమ్మహీధరమునఁ బరమేశ్వరుండు దపం బేకపాదస్థుఁ | డై బహువర్షంబు లాచరించెఁ, బుత్రలాభార్థిత్వమునఁ గృష్ణుఁ డుత్కృష్ట | నియమాచరణములు నిష్ఠ సలిపె, షణ్ముఖుం డాత్మీయశక్తి ప్రభావంబుఁ | దెలిపి దేవాధికతేజుఁ డయ్యె, |
|
| తే. |
మఱియుఁ బెక్కండ్రు మునులు నమర్త్యులును సు | చరితములఁ బెంపునొంది, రా శైల మా వృ షాంకునకుఁ గూఁతునిచ్చె, యాగాంగయోని | యగుట నజుఁడు దదాత్మత్వమర్థిఁబొందె. |
294 |
| వ. | అట్టి మహామహిమ గలుగు నా హిమవంతంబునకు మున్న వచ్చి సుమంతు వైశంపాయన జైమిని పైలనామధేయు లగు శిష్యులం గరుణావిధేయుండగు సాత్యవతేయుం డధ్యయనంబు సేయించుచుండం బుణ్యతమంబగు తదాశ్రమంబు భానుప్రభానిభంబగు నిజకాంతి విసరంబున వెలుంగ నయ్యారణేయుం డమ్ముని పాలికింజని తాను యోగబలంబున ననేకంబులైన గిరిసరిదరణ్యంబులు గడచి యెందునుం దగులువడక కార్ముకజ్యానిర్ముక్త శరంబుచందంబున నేతెంచుటకుం బ్రీతుండగు నప్పరాశరనందను పాదంబుల కభివందనంబు సేసిన నతం డభినందింప నాసన్నక్షమాసీనుండై జనకజననాథసంవాదవిధంబు విన్నవించి విశేషసమ్మదం బావహించె నిట్లరణిసుతు సమాగంబు నొంది. | 295 |
| క. |
అమ్మునియును శిష్యులతో | నమ్మహితాత్ము నునుచికొని యధ్యాపనశీ లమ్మగు చిత్తముతోడ సు | ఖమ్ముండఁగ నొక్కనాఁడు గౌరవమొప్పన్. |
296 |
| వ. | కొలిచియుండు సుమంతుప్రభృతులు నలువు రతనితో ‘దేవా! శుకుండు మొదలుగాఁ గల యేమేవురము వేదవిషయప్రఖ్యాతి నెల్లవారికంటె నెక్కుడు గావలయు, మమ్ముంబోలె నొడ్ల నాదరాధిక్యంబున భరంపడి సవిశేషంబుగా నధ్యయనంబు సేయింపకుండుట మాకు వరం’ బని విన్నవించిన వీత పక్షపాత చిత్తుండగు నత్తాపసోత్తముండు. | 297 |
| తే. |
భక్తుఁడగు బ్రాహ్మణునకు వా గ్బ్రహ్మ మఖిల | మును బ్రియంబున నిచ్చు సజ్జనుని చేతి లోనియది బ్రహ్మలోకంబు దీని మీర | లేర్పడఁగ నెన్నఁడును విని యెఱుఁగ రెట్లు! |
298 |
| క. |
వినుఁ డెల్లవారు దుర్గం | బును గడచి శుభంబునొంది పురుషార్థములం గనువార కాక యనియెడు | ననుగ్రహము వలదె? యిట్టులనఁ దగ వగునే? |
299 |
| చ. |
అనుటయు వార లొండొరుల యాననముల్ గనుఁగొంచు నవ్వి యి ట్లని రటులేనిఁ బోదుమె దయాపర! శైలము డిగ్గి భూమి నెం దును జరియించి యధ్యయన దోహలులం జదివించి యాజనం బు నడపి నీ కృపారసము పొంగు నిగుడ్తుమె యెల్ల చోటులన్? |
300 |
| చ. |
అనవుడు ‘మున్న యిట్టు లన రైతిరి వోవఁగనీను మిమ్ము నెం దును గడు వెడ్డువెట్టితిరి దోహల మిమ్మెయినుండ జాణలై నను నిటు వేఱొకం డడిగి నా వచనంబులు మీ మనోరథం బున కిటు సాధనంబులుగఁ బోకలఁ బోయితి’ రంచు నవ్వుచున్. |
301 |
| తే. |
తమ్ము సంప్రీతిఁ గనుఁగొను నమ్మునీంద్రు | చరణకమలంబులకుఁ జక్కఁ జాఁగి మ్రొక్కి రన్నలువురును వారల నతఁడు దివిచి | కరుణ సిగురొత్త బిగియారఁ గౌఁగిలించి. |
302 |
| వ. | దీవించి ‘యెయ్యది సేసిన నప్రమాదాయత్త చిత్తులరై చేయుండు త్రిలోకంబు లందును మీకుం బ్రియంబైన చోటుల వర్తిల్లుం’డని వీడుకొలిపినఁ జని వార లధ్యాపనయాజన విశేషంబుల నశేషదేశంబులు నలంకరించుచుండి; రట్టియెడ. | 303 |
| క. |
నారదుఁడు వచ్చి ప్రీతిం | బారాశర్యమునిఁ గాంచి ‘బ్రహ్మనినాదం బీ రున్నచోట లేమికిఁ | గారణమేమియొకొ?’ యనుడు గారవమెసఁగన్. |
304 |
| క. |
అతఁ డతనితోడ ‘శిష్య | ప్రతతి యిచట లేమి’ యనుడు ‘బ్రహ్మర్షివరా! సుతుఁడును నీవైనను ద | ద్వ్రతంబు సెల్లించుచుండవలదే?’ యనినన్. |
305 |
| క. |
నారదుని వచనములుఁ బెం | పారం గొనియాడి భువనమంతయు నాదా పూరితముఁ జేసె నమ్ముని | సారాధ్యయనమునఁ బుత్రసంయుక్తుండై. |
306 |
| వ. | ఇట్లయ్యిరువురు నధ్యయనంబు సేయ మహావాయువు బెట్టు వీచిన నవిశ్వేషజ్ఞుండు పుత్రుతో ననధ్యయన సమయం బగుట సెప్పి తదధ్యయనంబు వారించి తానును నూరకున్న నయ్యారణీయుండు ‘నియ్యత్యధికమారుతం బెక్కడిది?’ యని యడిగిన నఖిల భూతవేదియగు వేదవ్యాసుండు దేవయానంబున విష్ణుండును పితృయానంబున భానుండును నూర్ధ్వాధోగమన పర్యాయరూపంబునం బ్రవర్తిల్లుదు రది పవనాలంబనకలితంబై చెల్లుఁ బవనుల వినుము సెప్పెద సమానుండు దైవతసంఘసంభవుం డతనికి నుదానుండును నుదానునికి వ్యానుండును వ్యానునికి నపానుండును నపానునికిఁ బ్రాణుండును జనియించిరి. జగంబులు వీరిచేత సంవ్యాప్తంబులైయుండుం బ్రవహుం డావహుం డుద్వహుండు సంవహుండు వివహుండు పవహుండు పరాహుం డనం బవనులు సప్తసంఖ్యు లదితిపుత్రు లఖిల భువనవ్యాప్తులై చరియింతురు. వారు సమానాదిపవనపంచక మహితాత్ములు. వారలవలన వర్షంబులకుం బ్రవర్తన నివర్తనంబులు గలుగుచుండు. వివిధదైవత విమానంబులకును మహితయానం బావహిల్లు నొక్కొక్కనాఁడు విష్ణుని నిశ్శ్వా సవేగంబు. | 307 |
| క. |
అప్పవనములను గలఁచిన | నిప్పరుసగు వికృతవాయు విది దీని రయం బిప్పుడు మహనీయంబగు | నిప్పర్వతమునుఁ జలింప నెసకం బెసఁగెన్. |
308 |
| తే. |
ఇట్టియప్పుడు సదివిన నెల్లభంగి | నెడరువుట్టుఁ గావునఁ జదు వుడుగవలసె’ ననియెఁ బదపడి ప్రకృతిస్థమయ్యెఁ బవన | మఖిల భూతంబులకు సౌఖ్య మావహిల్లె. |
309 |
| వ. | స్నానకాలం బయ్యెనని పలికి పుత్రునకు ‘నీవు చదువుచుండు’ మని చెప్పి యప్పారాశర్యుం డాకాశగంగా ప్రపాతప్రదేశంబునకుం జనియె నయ్యారణీయుండును నారదుం డాకర్ణింపఁ గొంతసే పధ్యయనంబుసేసిన నద్దేవముని మెచ్చి యతనితో ‘నీకు మేలొనర్చెద నిష్టంబు సెప్పు’ మనిన నతం ‘డీలోకంబునం బుట్టినవానికి హితం బెయ్యది దానిం జెప్పవే?’ యనుటయు నమ్మహాత్ముండు దొల్లి సంయములకు సనత్కుమారుండు సెప్పిన వాక్యంబు లేతత్ప్రయోజనంబు లయియుండు వానిం జెప్పెద వినుమని యిట్లనియె. | 310 |