పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ప్రథమాశ్వాసము
శల్యుచుట్టంబు లొక్కపెట్ట ధర్మరాజుం జుట్టుముట్టుట (సం. 9-17-3)
ఉ. అమ్మనుజేంద్రు ముందటికి నార్పులతోఁ జనుదెంచి శల్యుచు
ట్టమ్ములు సత్వరమ్ముగఁ గడంగి యనేకులు వీరయోధు లు
గ్రమ్ముగ వీఁకఁ దేరులు పొగడ్తకు నెక్కఁగ దీప్తమైన కో
పమ్మున నేచి పాండవులపై నడరం గని పేరెలుంగునన్‌.
293
వ. అన్నరనాథుండు. 294
తే. మీర లేర్పడ వడిఁ దలమిగిలి చనఁగ | వలదు నామ్రోల బలుపారి నిలువుఁడనియె
వారు నిలువక పాండవబలము చేవ | దఱుగఁ జొచ్చి యుధిష్ఠిరుఁ దాఁకి రధిప!
295
వ. ఇట్లు చలంబున నవ్విభుం దలపడి వివిధాస్త్రంబులు గుప్పించి నొప్పించినఁ గవ్వడియును వడముడియుఁ గవలును ద్రౌపదికొడుకు లేవురును గోవిందుతమ్ముండును ధృష్టద్యుమ్నుండును శిఖండియును జండరయంబున నుద్దండచతురంగ సమేతులై యా రథికులఁ బొదువుటయును వారలు వీరోద్రేకంబున సైన్యసాగరంబున నున్మదమకరప్రకరంబులవిధంబున విహరించి రట్లు పాండవసేనాసంక్షోభసంపాదులగు నాజోదుల యాటోపం బాలోకించి గాంధారపతి గాంధారేయు నాలోకించి. 296
తే. ‘మద్రవిభువారి నిమ్మెయి మార్తు రాఁగి | కొనఁగ మనకు నుపేక్షింపఁ జనునె?’ యనుడు
నతఁడు ‘నామాట వినక వా రరిగి రేమి | సేయువారము? చెప్పు మౌచిత్య మనియె’
297
వ. అని నన్ను నాపరివారంబును రక్షింపను దగవెఱింగింపను నర్హుండ వీవకాదె?’ యనుమాట లాడిన నతండు ప్రీతుండై బలపరిపాలనంబును గర్జంబు సెప్పుటయును దనపనిగా మనంబునంబూని యవి దోఁచునట్టి యుచితవచనంబుల నవ్వసుమతీపతికిఁ బ్రియం బాపాదించి. 298
చ. ‘వినుము నరేంద్ర! సైనికులు విక్రమలీల నరాతిసేన సొ
చ్చినఁ బతి గావకున్న నుపజీవులు మెత్తురె? యన్నఁ ‘గాతుఁ గా’
కని బహుతూర్యనాదములు నార్పులునుం జెలఁగంగఁ ద్రోచి య
జ్జనపతి వీఁకమై నడరె సైన్యయుతంబుగ సత్వరంబుగన్‌.
299
క. అంత ధనంజయ కిమ్మీ | రాంతకముఖ యోధవర మహాస్త్రప్రకరం
బంతకుకడ కనిచెఁ బరి | శ్రాంతంబగు మద్రనాథు రథిక చయంబున్‌.
300
వ. ఇవ్విధంబున. 301
మ. అరులం గీటడఁగించి పాండుసుతు సైన్యం బుబ్బి పైఁ గ్రమ్మినం
గురుభూనాయకుసేన నొచ్చి కలయం గూలన్‌ ధరన్‌ గుంపులై
తిరుగం బాఱఁగఁ జొచ్చె విచ్చె మరలన్‌ దిగ్భ్రాంతి వాటిల్ల స
త్వరతన్‌ నల్గడఁ బాఱె నవ్విభుఁడు గర్వం బేది వెల్వెల్లఁగన్‌.
302
క. మనవారి కపుడు భీష్ముని | చనుటయుఁ గోదండగురుని సమయుటయును గ
ర్ణుని పొలియుటయును గ్రొత్తై | మనమున వెనుఁబాటు గదిరె మనుజాధీశా!
303
వ. అప్పు డద్దిక్కు జనంబులు. 304
చ. ధరణికి నింక నాయకుఁడు ధర్మతనూజుఁడు నేఁ డవశ్యముం
గురుపతి గూలు నెవ్వగలకుం గుదురయ్యెడు నాంబికేయుఁ డు
ద్ధురు లగు పాండునందనుల దుర్దమభంగి యెఱింగి ధర్మత
త్పరులకు గెల్పు బ్రాఁతె? హరిభక్తులఁ బొందవె భూరిసంపదల్‌?
305
వ. అని రట్టియెడ నీ కొడుకు నిజసారథిం జూచి ‘మనబలం బాహవంబున కోహటించి పాఱెడు నిత్తఱి నేను బరవసంబు సేసినఁ గాని నిలువ దవ్విధంబునకు రథం బనువై యుండఁ జేసి చేరఁ దె’ మ్మనిన వాఁ డట్ల చేయ నతం డేనుంగు డిగ్గి రథంబెక్కి యెక్కుడు మగఁటిమిం బొంగునంగంబులతో సైనికుల కడ్డంబు సని యెలుం గెత్తి. 306
ఉ. ‘ఎక్కడఁ బోవ వచ్చు? గిరులేనియుఁ గాననభూము లైనఁ దో
నెక్కియుఁ జొచ్చియుం బగతు రేడ్తెఱఁ గిట్టి చలంబునం దలల్‌
ద్రొక్కక తక్క రట్లయిన దుర్గతి వాటిలుఁ బోక నిల్చి బే
రుక్కునఁ బోరినన్‌ సుగతి యొండెను సంపద యొండెఁ జొప్పడున్‌.
307
వ. అట్లుం గాక. 308
క. పాండవబల మల్పంబై | యుండం గృష్ణుఁడు ధనంజయుండును డప్పిం
బెండువడఁగఁ గని మనకును | గం డడఁగఁగ నేల? గెలుపు గైకొన వచ్చున్‌.’
309
వ. అని పలికి కరతలం బెత్తి నిలునిలుమనిన నీబలం బతని నగ్గించుచు మరలె. నమ్మేటిమగండు ముంగలి యయి నిలిచి పొంగారం గవియు కౌంతేయసేనాసముద్రంబునకుఁ జెలియలికట్ట యయ్యె. నయ్యవసరంబునందు మునుకొని వడిం దఱుము వడముడిం బొదివి మనపదాతిప్రకరంబు దర్పంబున నార్పులు బొబ్బలుం జెలంగ బహువిధాస్త్రశస్త్రంబులు వరఁగించినం బెరిఁగిన మదాతిరేకంబున గదాదండంబు ధరియించి ఘోరాకారుం డగుచుఁ దేరు డిగ్గి పేరడవిఁ గూల్చు పెనుగాలి కైవడి నతం డేకవింశతి సహస్రసంఖ్యసుభటుల నేలపాలు సేసె నప్పుడు. 310
క. కరిహయరథబృందం బు | ద్ధురత నడరెఁ బాండునృపసుతుల మూఁకలపై
నరుఁ డబ్బలంబునకు ని | ష్ఠురగాండివ ముక్తశరపటుత్వము సూపెన్‌.
311
క. నకులసహదేవులును సా | త్యకియును రభసమున వాలురమ్ములు నిగుడన్‌
శకునిపయిఁ గవిసి రతఁడును | బ్రకటస్ఫురణంబునం దిరంబై పోరెన్‌.
312
చ. సమదగజాధిరూఢుఁ డయి సాల్వుఁడు పాండవసేనఁ జొచ్చి ఘో
టములఁ గలంచుచున్‌ గజఘటల్‌ విరియించుచుఁ గాల్బలంబుఁ జి
త్రముగ వధించుచున్‌ రథకదంబములన్‌ సమయించుచున్‌ మహో
గ్రముగఁ జరించువిస్ఫురణఁ గన్గొని కోపసముద్భటాకృతిన్‌.
313
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )