| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శల్యపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | అనుచు నమ్మొన యాలోకించి నిరూపించి. | 347 |
| క. |
పెనఁకువ యెడ త్రెవ్వక పదు | నెనిమిదిదివసములు సెల్లె బెనఁగంగా వనధిం బోలెడు కురుబల | మనఘా! కనుఁగొనఁగ గొప్పదాకృతి యయ్యెన్. |
348 |
| ఆ. |
దైవ మిట్లు గలఁచునే వీరి మదిమది | నుండి ఘోరమైన యుద్ధమునకుఁ దొడఁగ వలయునట్టి తొడరువు కావించి | కొనిరి చీఁకురాజుకొడుకు లేచి. |
349 |
| చ. |
అమరనదీసుతుండు వడినప్పుడు వీరలబుద్ధి సంధికా ర్యమునకుఁ జొచ్చునింక నని యాత్మఁ దలంచితి నమ్మహాత్ముఁడు న్సముచిత వాక్యవృత్తిఁ గురునాయకుఁ దేర్పఁగఁ జూచెఁ జిత్త దో షమహిమ నద్దురాత్ముఁడు ప్రశాంతత నొందఁడ యెన్నిభంగులన్. |
350 |
| క. |
గంగాతనయుఁడు దెగినను | సంగరమున కుత్సహింపఁజనునే తమకున్? వెంగలు లని యప్పుడు దెలి | యంగా నెఱిఁగితి సుయోధనాదులఁ గృష్ణా! |
351 |
| ఉ. |
దంతియుఁ దాను నాజి భగదత్తుఁడు గూలఁగఁ జూచి సింధుభూ కాంతుని చావు దెల్లముగఁ గన్గొని యాతనిఁ గావఁ బూని య ట్లంతలు రాజు లెల్ల సమయం గని ద్రోణునిపాటు గాంచి యా వంతయు నాత్మలోనఁ దెలియండు సుయోధనుఁ డెంత మూర్ఖుఁడో! |
352 |
| క. |
తన యనుజు లకట! దుశ్శా | సనుఁడును లోనైనవారు సమసిన చందం బును బంధుసహితముగఁ గ | ర్ణుని గీటడఁచిన విధంబునుం జూడఁ డొకొ! |
353 |
| క. |
అది యెల్ల నేల చెప్పఁగఁ? | దుది శల్యునిపాటు గనియుఁ దోఁపఁ డితఁడు బ ల్లిదుఁ డని ధర్మజు దెసఁ దలఁ | పిది కురుపతి బుద్ధికొలఁది యేటికి వగవన్? |
354 |
| క. |
క్షోణీరాజ్యార్ధము దన | ప్రాణము గలుగంగనీఁడు రారాజు జగ త్త్రాణపరాయణకరణ ధు | రీణుండగు పాండుసుతగరిష్ఠున కెట్లున్. |
355 |
| వ. | కావునఁ గొఱంతయును దీర్పవలసియున్న’ దనిన విష్ణుండు జిష్ణున కిట్లనియె. | 356 |
| ఉ. |
‘అక్కడ సంధికిం జనినయప్పుడు నవ్విదురుండు కృష్ణ! నీ విక్కడ కేల వచ్చితి? విహీనవివేకుఁడు దుర్మదాంధ్యముం దక్కునె? సంగరంబ యుచితం బగుకృత్యముగాక యిమ్మెయి న్ముక్కున నూర్పుగల్గఁ గుజనుండు సుయోధనుఁ డుర్వి యిచ్చునే?’ |
357 |
| వ. | అని బోధించె నదియునుంగాక దుర్యోధనుండు జనియించినప్పుడు మును ‘లిప్పాపాత్ముండు నిఖిల క్షత్రియక్షయ హేతు!’ వగునని యాదేశించిరిగాదే’ యనిన నర్జునుం డతని కిట్లనియె. | 358 |
| తే. |
‘అమ్మహాత్ములు సెప్పినయట్ల యయ్యె | నున్నవారలఁ బొలియించి తన్ను విడిచి కాని విడువండు ధృతరాష్ట్రసూనుఁ డుర్వి | ధర్మసూనున కిది నిశ్చితంబు గృష్ణ! |
359 |
| క. |
దుర్బలమగు నమ్మూఁకను | దోర్బల మెసఁగంగ నిపుడ త్రుంచెద నా దు ర్నిర్బంధపరుఁడు దనదగు | దౌర్బల్యము గనుచు మదము దక్కి కనుఁగొనన్. |
360 |
| వ. | రయంబున రథంబు గడపు’ మనుడు నుత్తుంగమాతంగమహీరుహశోభితంబును సాంద్రస్యందన గుల్మగహనంబును బహుళహయకక్షాకీర్ణంబును సముద్భట సుభట లతాలసితంబును నైన సుయోధను సేనా కాననంబునందు మాధవమహావాయువు ధనంజయదారుణానలంబు దరికొల్పిన. | 361 |
| క. |
ఆ కృష్ణవర్త్ముఁ డుజ్జ్వల | భీకరశరజిహ్వ లడరఁ బేర్చిన నధిక వ్యాకులత నొందె రోదసి | నాకౌకస్సమితి మెచ్చునం బొదలంగన్. |
362 |
| వ. | ఇట్లు దారుణరణవిహరణంబు సలిపి సవ్యసాచి యా సైన్యంబు నిపతిత విఘటిత భ్రాంత పలాయితంబు సేసినఁ దెరలక నిలిచి కురుపతి కరతలంబెత్తి నిలు నిలుమని యెలుంగు సూపిన నది మగుడఁ బురికొని నిగిడి నేమినినద ఘంటాక్వణనకింకిణీ నిక్వాణంబులు సెలంగఁ బాండవబలంబుఁ దాఁకిన ధృష్టద్యుమ్న శిఖండి శతానీకు లయ్యనీకంబు ననేకవిధసాయక నికాయంబులం గప్పి రప్పుడు ధృష్టద్యుమ్ను నరదంబు చక్కటికి సంరంభంబున. | 363 |
| ఉ. |
భూపతి మించి యా ద్రుపదభూపతనూజునురంబు నిర్భరా టోపత యుల్లసిల్లఁగఁ బటుప్రదరంబుల నొంప నాతఁ డు ద్దీపితకోపుఁడై హరులు ద్రెళ్ళఁగ సారథి డొల్ల నేయఁ గా నే పఱి తేరు డిగ్గి యతఁడెక్కె హయోత్తముఁ గౌరవేశ్వరా! |
364 |
| వ. | ఎక్కి కొండొక తొలంగి మాతంగ ఘటలం బురికొల్పిన నవి పురందరనందను నరదంబుఁ బొదివిన నవ్వీరుండు ఘోరనారాచధారల నవ్వారణంబులపైఁ గురియం గని గదాహస్తుండై యరదంబు డిగ్గి యనిలపుత్రుండు గవిసినఁ దుండంబు లవిసియు దంతంబులు దునిసియుఁ గుభంబులు వగిలియుఁ బ్రక్కలు చదిసియు వెన్నులు విఱిగియు నగ్గజంబు లొఱలుచు నెత్తురులు గ్రక్కుచుఁ దెరలుచు సుడివడుచుండ వెండియుం బైపై నురవణించు కరులం గనుంగొని ధర్మజనకులసహదేవులును ధృష్టద్యుమ్నాదియోధులు నద్దిక్కు తఱిమి రట్టియెడ నశ్వత్థామకృతవర్మకృపాచార్యులు దుర్యోధనుఁ దేరిగములలోనంగానక కలనం బడియెనో? యని యనుమానించుచు నచ్చటి మానవపతులం ‘గురుపతి యెచ్చట నున్నవాఁ?’డని యడిగినఁ గొందఱు శకునిదెసఁ దొలంగె ననఁ దక్కటి వా ‘రతని వెదక నేల బ్రదికియుండె నేనియుఁ గనికొందము పాండవులమీఁద నుఱికి పొడుతము గాక’ యనిన విని యట్ల చేయ నారథికత్రయంబును దదనీకంబును వెడలి సౌబలుఁడున్న చక్కటికిం జనియె నిట్లు దిక్కుమాలిన యమ్మొన చుట్టుముట్టి. | 365 |