పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ప్రథమాశ్వాసము
ఉలూకుఁడు సహదేవుచేత మృతుం డగుట (సం. 9-26-23)
సీ. ఆ సౌబలుండు శరాసనాంతరదీప్తుఁ | డగుటయు నకులుఁడు ననిలసుతుఁడు
దాఁకిన వారి నతండు పెక్కమ్ముల | నొప్పింప నతని తనూజుఁ డనిల
సుతసహదేవుల సునిశితశరవర్ష | మునఁ గప్ప నయ్యులూకుని ననేక
సాయకంబుల నొంచి శకునిమై నఱువది | యమ్ములు నాటించి యనుచరులను
 
తే. బెగడు పఱిచె నా భీముండు బె ట్టులూకుఁ | డడరి యన్నకులానుజు నంపవెల్లి
ముంప నతఁడేచి పటుభల్లమున శిరంబు | ద్రుంచె నన్నలయెదలు సంతోష మొంద.
386
క. తనయుఁడు వడ శకుని కనుం | గొని శోకం బాత్మ నారఁగూరఁగ నశ్రుల్‌
కనుఁగొనలయందు నినిచె | న్మనుజేశ్వర! విదురు భాషణంబులు దలఁచెన్‌.
387
వ. అ ట్లడలుచు నిట్టూర్పు నిగుడ సహదేవుపై నడరి మూఁడు నారాచంబుల నిగిడించిన. 388
చ. అవి వెసఁ ద్రుంచి యాతనిశరాసనముం దునుమాడె నక్కుమా
ర వరుఁ డతం డనిందితపరాక్రముఁడై పటుఖడ్గయష్టిదీ
ప్తవిపులముద్గరంబున విభాసితశక్తిని వైవఁ దోడుతో
నవియు ననేకబాణముల నానృపసూనుఁడు నుగ్గుసేసినన్‌.
389
క. కనుఁగొని పార్శ్వచరులు వి | చ్చిన శకునియుఁ బాఱె నుల్లసిల్లిరి కుంతీ
తనయులు దదీయసేనా | జను లార్చిరి కురువిభుఁడు విషాదము నొందెన్‌.
390
వ. ఇట్లు పాఱిన. 391
చ. అరదము సత్వరంబుగ శరావళి పెల్లుగఁ బర్వఁ బాండవా
వరజుఁడు పోవనీక పొదువన్‌ వడిఁ బింగలివారు పోరికిం
బురికొని త్రోచినన్‌ సుబలపుత్రుఁడు దత్తురగవ్రజంబుతో
బరవసమొప్పఁగా నతనిపైఁ గవిసెం గృతనిశ్చయాత్ముఁడై.
392
వ. కవిసినం గని గుణంబు సారించి శరాసారం బడరించి యా సహదేవుం డిట్లనియె. 393
చ. ‘తలఁకుట యొప్పునే నృపతి ధర్మము నూఁది యెదిర్చి యేమెయిన్‌
నిలుచుట యొప్పుఁగాక మహనీయుల ధర్మతనూభవాదులం
బలికితి వీవు జూదపునెపంబునఁ దత్ఫలమందె దిప్డు మా
చలము బలంబు నేర్పడియెఁ జచ్చిరి మీ యవివేకు లందఱున్‌.
394
వ. మమ్ము నపహసించిన వారిలోఁ గురుకులదాహకుం డొక్కరుండ తక్కె నద్దురాత్ముండు సూచుచుండ భవదీయ శిరంబుఁదాలఫలంబు లగుడంబునం బడవైచు పగిదిఁ బటుభల్లంబున డొల్ల నేసెద మామా! పాఱక నిలువుమీ!’ యని యట్లు బహుభంగులఁ బలికి యతం డేయు సాయకంబుల వారించి దశమార్గణంబులు మేనఁ జొనిపి. 395
క. తురగములు సిడము గొడుగును | శరాసనముఁ దునిమి యార్వ సాహసమున ని
ష్ఠుర శక్తిఁ బూన్చె నాతని | యురః స్థలము వైవ శకుని యుర్వీనాథా!
396
మ. సహదేవుం డది శాతభల్లమున నుత్సాహోగ్రుఁడై త్రుంచి దు
స్సహభల్లద్వితయంబునం గరయుగస్వైరచ్ఛిదాకేళి స
ల్పి హసద్వక్త్ర విలాస మొప్పెసఁగ నాభీలద్యుతిస్ఫారభ
ల్లహతిం గంఠము ద్రుంప మస్తకము డొల్లన్‌ డొల్లె మేనున్‌ మహిన్‌.
397
వ. ఇట్లు కౌరవులదుర్నయంబునకు మూలంబగు శకునిఁ దెగటార్చి పేర్చియార్చిన యనుజన్ము నాలోకించి ధర్మతనయ ప్రముఖులు పరమ ప్రమోదభరితాంతఃకరణులై నిజశంఖంబులు పూరింప శౌరియుఁ బాంచజన్యరావంబున రోదసి నింప సుయోధను సేన చెదరక బెదరక నిలిచి యా సౌబలు సైన్యంబు సహదేవునిపై ననేకాస్త్ర శస్త్రంబులు గురియుచుఁ గవిసినం గవ్వడియు వడముడియు నవి యన్నియు మోఘంబు లగునట్లు చేసి యమ్మూఁక బలువడనేసి యుల్లాసభాసితు లైనం గని జనపతి శోకాక్రాంతమతియై హతశేషులైన నిజ సైనికులం బురికొల్పిన వారలు రక్షకరహితులయ్యును దెంపు పెంపున శంకింపక యాసవ్యసాచిం బొదివి తదస్త్రశిఖాసందోహంబున మ్రందిపోయి రక్కురురాజు దనచుట్టును బయలగుటఁ గలయం జూచి కట్టెదురఁ జెలంగు నా కౌంతేయులం గనుంగొని తొలంగిపోవం దలంచె ననుటయు నాంబికేయుండు సంజయు దిక్కు మొగంబై. 398
తే. అట్లు మన సైన్యములు దెగటారినపుడు | కుంతి కొడుకులలో బలమెంత గలిగె?
నకట! నాకొడు కెట్టివాఁడయ్యెఁ జెపుమ! | యనుడు నతఁ డిట్టు లనియె నమ్మనుజపతికి.
399
వ. అట్టి యెడ రెండు వేలు రథంబు లేడునూఱు గజంబు లైదువేలు గుఱ్ఱంబులు పదివేలు కాలుమానిసియుఁ దానును ధృష్టద్యుమ్నుండును సంగరాంగణంబున మెఱసి యుండె. 400
క. పలపలని మూఁకలోఁ గాల్‌ | నిలువక గుఱ్ఱంబు డిగ్గి నీ కొడుకు గదా
కలిత భుజుండై యొక్కఁడుఁ | దొలఁగి చనియె నేమి చెప్పుదుం గురునాథా!
401
వ. అని ధృతరాష్ట్రునకు సంజయుండు దుర్యోధను పలాయనం బెఱింగించె నని చెప్పిన విని యటమీఁది వృత్తాంతం బె ట్లయ్యె నని యడుగుటయును. 402
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )