పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ద్వితీయాశ్వాసము
శల్యపర్వము - ద్వితీయాశ్వాసము
క. శ్రీ కరణ నిపుణ పదప | ద్మా! కేవల సత్త్వసద్మ! మాయావ్యవధూ
త్యేకాయనగమ్యా! మధు | రాకృతి సర్వత్రరమ్య! హరిహరనాథా!
1
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు నిజపుత్రుండు పరాజయంబు నొందుట యాక ర్ణించి యాంబికేయుండు. 2
క. ‘మద మడఁగి యొక్కరుండును | గద చేకొని రాజరాజు కాల్నడ నెట వో
మదిఁ దలఁచి తొలఁగెనొకొ! యా | పద లిట్టివి కలవె మనుజపతులకు నెందున్‌?
3
వ. అనంతర వర్తనంబు తెఱం గెఱింగింపు ‘మనుటయు నజ్జననాథునకు సంజయుం డిట్లనియె. 4
సీ. ‘ఏకాదశాక్షౌహిణీశుఁ డై పెంపునఁ | బొంపిరివోవు నప్పుడమిఱేఁడు
వెనుక నొక్కరుఁడును జన లేక యేకాకి | యై పోయె నచటికి ననతిదూర
మై యుత్తరము ముట్టినట్టితూర్పున నొక్క | మడు వున్న, దానిలో నడఁగియుండు
వాఁడుగా నట్టు లవ్వలనికిఁ జని చని, | విదురువాక్యంబులు మదిఁ దలంచి
 
ఆ. ‘యధికమతి నృపాలుననుజుండు సెప్పె న | ట్లకట! దానిఁ గొనన’ యనుచు శోక
తప్తచిత్తుఁ డయ్యె; దైవ మెవ్వరి నెట్లు | చేయఁ జాల? దేమి సెప్పఁ గలదు?
5
వ. అట్టియెడ సుడిసి చిక్కిన మూఁకలు వీఁకమై నెదిర్చినం బొదివి నిరవశేషంబుగా సమయించి కృష్ణసారథికంబును ధవళహయంబును గపీంద్రకేతనంబును నగు నుజ్జ్వలస్యందనంబున నప్పురందరనందనుండు బంధుమిత్రాభినందితుండై యొప్పె; నప్పుడు పొలికలన నీ బలం బఖిలంబును బెనుగాలిం బడిన పేరడవిపగిదిం గానంబడుచుండె; నందుఁ గృపాశ్వత్థామకృతవర్మలు మువ్వురు బ్రదికి పోయి; రాసమయంబున ధృష్టద్యుమ్నుండు నన్నుఁ గనుంగొని నగుచు సాత్యకి నుద్దేశించి. 6
తే. ‘వీని నేటికిఁ బట్టితి? వీఁడు బ్రదికి | యిచట వర్తించి మనకు నెగ్గేమి సేయు?
నప్రయోజన మిది; విడు’ మనిన ‘నేల | వీడుతు నీ ద్రోహితల దెగ నడుతు’ ననుచు.
7
వ. ఆ శైనేయుండు వాలు వెఱికి వ్రేయం జూచునంతఁ గృష్ణద్వైపాయనుండు సన్నిధిచేసి, యతని వారించి, ‘సంజయుం జంపుట యనుచితంబు; ముందల విడువు’మని యానతిచ్చిన నతండును వినతుండై’ యట్ల కాక యని పలికి నన్ను విడిచెఁ; గృష్ణద్వైపాయనుండు మదీయాననం బాలోకించి ‘బ్రదికిపోయి తెక్కడకైనం బొ మ్మనుటయు’ నమ్మునీంద్రు వీడ్కొంటి; నంత నతఁ డంతర్ధానంబు సేసె; నేను దత్ప్రదేశంబు వాసి నీసుతుండు సనిన చక్కటికిఁ గ్రోశమాత్రంబు వోయి ద్వైపాయనం బనం బ్రసిద్ధం బైన యమ్మడువు సమీపంబున. 8
తే. అతనిఁ గాంచితి; నతఁ డశ్రు లడర నడలు | చూడ్కి నామోము చక్కఁగాఁ జూడ కోర
వోవఁ జూచుచు దీనతఁ బొందియునికి | గని మనంబున శోకంబు గదుర నేను.
9
వ. ఒక్కింతసేపు పలుకు వెలువరింపఁ జాలక యూరకుండి, యెట్టకేల కెలుంగు దెచ్చుకొని పారాశర్యప్రసాదంబున బ్రదికినతెఱంగు సెప్పిన, నమ్మహీకాంతుండును గొంత ప్రొద్దు నిశ్చేష్టితుండై యుండి, పదంపడి నాదెసఁ జూచి ‘మనదెస బ్రదికిన వారు గలరే?’ యనినఁ గృపాచార్యాదిరథికత్రయంబును బేరుకొని ‘వారలు బ్రతికిపోయిరి; తక్కొరుండును బ్రదుకుట లే’దని యెఱింగించిన, నిట్టూర్పు నిగిడించుచు నామూఁపుపైఁ జే యిడి యన్నర నాథుండు నన్ను నీకడ కనుపం దలంచి నాతో ని ట్లనియె. 10
తే. ‘మాఱుమానిసి లేకుండ మడిసి రెల్ల | వారు నీ దెసఁ; బాండుభూవరతనూజు
లాప్తులుం దాము నున్న వా; | రాహవమునఁ | బడక తొలఁగితిఁ బోటులఁ బడియు నేను’.
11
వ. అని. 12
క. ‘కౌంతేయులబారిం బడ; | నింతియ సిరి చాలు; రాజ్య మెల్లను దారై
పొంత ననుఁ బెట్టుకొని యొక | కొంత యొసఁగిరేని నట్టికూ డేమిటికిన్‌?
13
క. అనుజులఁ దనుజుల మత్పరి | జనులను సమయించి వారు సమరోల్లాసం
బున మెఱయఁ జూడ నేర్తునె? | జననాథున కింతవట్టు సంజయ! చెపుమా!
14
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )