పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ద్వితీయాశ్వాసము
మంకణమహాముని మాహాత్మ్యాభివర్ణనము (సం. 9-37-1)
సీ. అతఁడు సరస్వతి నవగాహనము సేయు | చుండి యా చేరువ నోర్తు తడుపు
గట్టక నీళ్ళాడఁగాఁ జూడఁ దనదు శు | క్లము నిర్గమించిన ఘటసురక్షి
తము సేయ సప్తభేదము లొంది యది సత్పు | రుషు లైరి వారు మరుద్గణంబు
నకు సంజననకారణం బైరి; విను మొక్క | నాఁ డ త్తపస్వి వ్రేల్నాటి దర్భ
 
ఆ. గంటిఁ గూరయసరు గాఱిన నర్తించె | నతఁడు తపముసిద్ధి కాత్మఁ బొంగి
జగము లెల్లఁ దాన సంక్షోభ మొందె; ని | ర్జరులు భీతిఁ జనిరి శంభుఁ గాన.
160
వ. కని యంతయు నెఱింగించిన నద్దేవోత్తముం డాభూదేవోత్తముపాలి కరిగి ‘యిది యెంతటి విశేషంబు? దపంబు లిట్టివే? నర్తించుట మాను’ మని పలికి తన యంగుటంబు వ్రేలం గీఱిన నందు భస్మంబు గాఱిన నాసంయమి సిగ్గువడి దండప్రణామంబు సేసి. 161
ఆ. ‘దైవ మెల్లఁ దలఁప నీవ సమస్తజ | గంబులకును, నేడుగడయు నీవ;
కర్మఫలదుఁడవును గర్మప్రదుండవు | నీవ కరుణ నన్నుఁ గావు మభవ!’
162
వ. అని వెండియు ననేక ప్రకారంబులం బ్రశంసించినం బ్రసన్నుండై పశుపతి యతనికిఁ దపఃప్రభావం బక్షీణంబు గా వరం బిచ్చి చనియె; నమ్మహాముని నృత్యంబు మానిన జగంబుల సంక్షోభంబు శాంతం బయ్యె; నట్టి యమ్మహాత్మునినివాసం బైన సప్తసారస్వతంబున నుండి యాసీరి యౌశనంబునకుం బోయె; వినుము! తొల్లి రఘురామునిచేతఁ జచ్చిన మహోదరుం డను నసుర తలపునుక యొక్క తపస్వికాలఁ దగిలి పుచ్చ రాకున్న నతండు వేదనం బొందుచుండం గని యార్యులు ‘నౌశనం బనుతీర్థంబు శక్రుండు దపంబుసేసినచో టందుఁ బొమ్ము; నీదురితంబు వాయు’ ననిన మహోదరనామధేయుండగు నాసంయమి యచ్చటికిం జనినఁ గపాలంబు ముక్తం బయ్యె; దానంజేసి యది కపాలమోచనం బనం బరఁగు; నచ్చోటు గదలి పృథూదకంబున కరిగెఁ; దదీయ విశేషంబు వినుము! గాధి యను మహారాజు కొడుకు విశ్వామిత్రుం డనునతండు. 163
ఆ. తండ్రి యట్ల సకలధాత్రీశుఁ డై యుండి | దనుజమథనమునకు దండు వెడలి
యరుగునెడ వసిష్ఠునాశ్రమంబున పొంత | విడియఁ బరిజనములు వినయ మెడలి.
164
వ. అందు దుర్నయంబు లాచరించిన నమ్ముని కోపించి నిజహోమధేనువు నాలోకించి ‘నీ బలంబు పనుపు’ మనిన నది దనమాహాత్మ్యంబున నచట నావహిల్లిన ఘోరాకారు లగు వీరులఁ బనుప వార లారాజు వరూథిని మడియించిన శేషించిన జనంబులు పలుగడలం పాఱి; రట్లు దురవస్థం బొందు నాసేనం జూచి యగ్గాధినందనుం డెల్ల శక్తులకంటెఁ దపశ్శక్తి యెక్కుడగుట యెఱింగి యాపృథూదకంబునఁ దపంబు సేయుచుండ దానికి దేవపతి విఘ్నంబు సేయ, మఱియు నియమ నిష్ఠుండై బ్రహ్మచేత బ్రాహ్మణ్యంబును బడసె నత్తీర్థంబునుండి యాబలభద్రుండు బకాశ్రమంబున కరిగె; నయ్యెడఁ బకుండను మునీంద్రుండు తొల్లి. 165
క. ధృతరాష్ట్రుం డను ధరణీ | పతి దన్ను నధఃకరించి పలికినఁ గోపా
న్వితుఁడై హోమ మొనర్చెను | ఘృతనరమాంసముల నతనికిం గీ డొదవన్‌.
166
ఆ. నఱుకఁ బడిన యడవి తెఱఁగున నతని రా | ష్ట్రంబు సకల జంతు సముదయములు
మడియ విన్ననయ్యు నడలి యా భూపతి | యత్తపస్విపాలి కరుగుదెంచి.
167
వ. దండప్రణామం బాచరించి పెక్కుభంగులఁ దేలించి మున్ను ధేను నిమిత్తం బగుదుర్భాషణంబుల నింత పుట్టుటం జేసి యాసంయమికి ననేక ధేనువుల నొసంగి దురితోపశాంతి యొనర్చె; నట్టి బకాశ్రమంబున నుండి రేవతీరమణుండు యయాతంబునకుం బోయె నందు యయాతి యజ్ఞంబున భోజనసమయంబున ఘృతదుగ్ధాదులయందు విప్రుం డెయ్యది గోరిన నది యెల్ల సరస్వతి సంపూర్ణ మనోరథంబు గా నొసంగుచు వచ్చె; నయ్యెడఁ గదలి వసిష్ఠావగాహంబునకు వచ్చెఁ; దత్ప్రదేశంబు దొల్లి విశ్వామిత్రునాశ్రమం; బతండు వసిష్ఠునెడఁ దపోవిషయమత్సరంబునఁ గుపితుండై. 168
సీ. అతని వధించుటకై సరస్వతి మదిఁ | దలఁచిన నానది తత్‌క్షణంబ
సౌమ్యవేషంబునఁ జనుదెంచి నిభృత యై | పని యేమి? యనిన నమ్ముని వసిష్ఠుఁ
గొనిరమ్ము నాకడ కని పంచెఁ; బంచిన | వార లిద్దఱ తపోవైభవంబు
నకు భయమందుచు నరనాథ యరిగి వ | సిష్ఠున కప్పని సెప్పెఁ దెలియ
 
తే. నాతఁ డవ్వాహినికి నిట్టు లనియె ‘నన్ను | నీవు గొనిపోక తక్కిన నీకు శాప
మిచ్చు నగ్గాధిసుతుఁడు దదిచ్ఛ సలుపు | మించు కేనియుఁ గొంకక యెప్పుడైన.
169
వ. అని యనుజ్ఞ యిచ్చిన సరస్వతి యత్తపస్వి తనచేరువ నొకప్పుడు జపయుక్తుండై యుండం గూలాపహరణంబు సేసి వఱుత నమ్మహాత్ముం గొనిపోయిన, నతం డాంగిరసమంత్రముల నత్తరంగిణిం బ్రణుతించె; నదియు సంప్రీత యగుచు నమ్ముని విశ్వామిత్రునకు సన్నిహితుం జేసిన, నతని నగ్గాధిసూనుండు వధియింప సాధనం బన్వేషించు నాలోన వంచించి యా ప్రవాహం బవ్వసిష్ఠుఁ దొలంగించినఁ గోపించి విశ్వామిత్రుండు ‘శోణిత వాహిని వగు’ మని శపించిన నొక్కసంవత్సరం బత్తటిని దైత్యసేవితయై యుండె; నత్తీర్థంబునకుఁ గొందఱు మును లేతెంచి యా దురవస్థ నాలోకించి. 170
తే. అమ్మహానది నడిగి వా రత్తెఱంగు | దెలిసి నిజయత్నబలమునఁ దీర్పఁ దీఱె
నట్టిదురవస్థ; వారలు నాత్మఁ బ్రీతి | యూనఁ జలిపిరి పావనస్నానవిధులు.
171
వ. అప్పుడు గొందఱు బ్రహ్మరాక్షసు లమ్మునులకుఁ బ్రణమిల్లి తమచేసిన విప్రద్వేషగురుజనావమానదుష్టాన్న భక్షణాదులగు పాతకంబులు వేఱవేఱ యుపన్యసించి ‘యే మియ్యెడ వసియించి యున్నవారము; మాకు నిష్కృతి యనుగ్రహింపవలయు’ ననుటయు వార లాపనికి సరస్వతిం బ్రార్థించిన నమ్మహానది యరుణానదివలన నట్టితెఱం గగు టెఱుంగుం గావున నిగూఢంబుగా నరుణం దనలోనికిఁ దెచ్చి ‘దీన మజ్జనంబు సేయుఁ’ డని యనుమతి సేసిన. 172
ఆ. అజ్జలములఁ గ్రుంకి యాబ్రహ్మరాక్షసుల్‌ | తనువు లచట విడిచి ధర్మపరుల
గతికిఁ బోయి; రట్టు లతిగూఢ మై యున్న | యరుణ తెఱఁ గెఱింగి యమరపతియు.
173
వ. తాను సఖ్యంబు సేసి నమ్మించి నముచిఁ జంపిన పాపంబు తదీయస్నానంబునం బాపికొనియె; నట్టి పుణ్యస్థానంబుననుండి యత్తాలధ్వజుండు సోమతీర్థంబునకుం జనియె; నది సోముండు రాజసూయంబు చేసినచో; టయ్యెడ ననిమిషులు షణ్ముఖునకు నిర్జరసేనాధిపత్యంబునకు నభిషేకంబు సేసి; రతండు తారకాదులైన యసురులం దెగటార్చె నతని జననాదివృత్తాంతంబు కౌరవవంశజాతుండ వగు నీకు వినఁదగుఁ జెప్పెద నాకర్ణింపుము. 174
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )