పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ద్వితీయాశ్వాసము
పాండవులు గృష్ణసాత్యకులతోఁ గౌరవశిబిరమునకుం బోవుట (సం. 9-61-3)
వ. కృతకృత్యుల మైతిమి; ప్రొద్దునుం జాల వ్రాలె; సేనయు సైనికవరులును విశ్రమింపవలయుఁ; బోదము లెం’ డనినఁ బాండవులు దెలివొందఁ బాంచాలురునుం దక్కిన భూపాలురునుం బ్రమోదంబు నొంది; రప్పుడు కృష్ణుండు పాంచజన్యంబు పూరించిన నర్జునుండు దేవదత్తంబును, యుధిష్ఠిరుం డనంతవిజయంబును భీమసేనుండు పౌండ్రంబును, నకులసహదేవులు సుఘోషమణిపుష్పకంబులును బూరించిరి. సకలరథికోత్తములును దమతమ శంఖంబు లొత్తిరి. భేరీపణవాదితూర్యంబులు మ్రోసె. నా సముత్థితనినాదంబులు నింగి నిండె; నిఖిలజనంబులుం బాండవేయులం బొగడునులివు దిక్కుల దీటుకొనియె; ని ట్లుబ్బునం జెలంగుచు వార లందఱు నచ్చోటు గదలిరి; కౌంతేయులుఁ గౌరవ శిబిరంబునకుం జనిన సాత్యకి యనుగమనంబు సేసె; ధృష్టద్యుమ్నప్రముఖు లైన ద్రుపదజ్ఞాతులును ద్రౌపదేయులునుం దక్కినధరణీశులును దమవిడిదలలం గాని విశ్రమంబునకు వెరవుగా దని తలంచి తా రందుఁ బోయి నాఁటి రాత్రి నిలిచి రేపకడ గరిపుర ప్రయాణంబున కొదవం జనుదెంచువారుగా విన్నవించి ధర్మతనయు ననుమతి వడసి సైన్య సమేతంబుగాఁ బోయి రట్లు వార లటు వోవ నప్పాండునందనులు సని సంగీత ప్రవర్తక సంఘంబులు విరిసి చనిన రిత్తయై యున్న రంగస్థలంబుచందంబునం బాడరియున్న యాశిబిరంబుఁ బ్రవేశించి, నీనందను నగరు సొచ్చిన, నచ్చట నున్న పరిచారికులును దత్సహవాసులును మణికనకాది వస్తుసంచయాధ్యక్షులును నయ్యుధిష్ఠిరుంగాంచి యాదరణంబు వడసి; రక్కుంతీ నందనులు రథంబులు డిగ్గునవసరంబున వాసుదేవుండు వాసవి నాలోకించి. 332
క. ‘కవదొనలును గాండీవము | నవల నిడం బనుపు; ముంద రరదము డిగు; మే
న విదప డిగియెద; శుభకర | మవు నవ్విధ; మట్లు సేయు’ మనుడు నతండున్‌.
333
తే. ధనువు తూణీరయుగళంబుఁ గొనుచు రథము | డిగుడు, శౌరి పగ్గంబుల నొగల ముడిచి
డిగియెఁ; గేతనకపియు భూతగణయుతము | గాఁ దొలంగె; నత్తేరు తత్‌క్షణమ మండె.
334
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )