పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము
సంవర్తుండు మరుత్తుని యజ్ఞమున కుపద్రష్ట యగుట (సం. 14-7-23)
సీ. ‘నీ కృపగాంచితి నాకు నింకొండు వి | చారంబు లేటికి? సంయమీంద్ర!
యా దివస్పతియు బృహస్పతియును నేల? | పశుపతి విద్వేషపరతఁ గలఁచె
నేనియుఁ గలఁగుదునే?’ యని పలికి ‘మీ | సంగతి వాసిన సరసిజాప్త
చంద్రతారకకులాచలములు గల యంత | కాలంబుఁ బుణ్యలోకములు లేక
 
తే. పోవు’ నని శపథము శుద్ధభావవృత్తిఁ | బలుకుటయు, మెచ్చి యమ్మునిపతి ‘మహీంద్రు
కంటె నిను ధనవంతునిగా నొనర్చి | క్రతువు నడపుదు’ నని చెప్పి ప్రమద మెసఁగ.
058
వ. మఱియు నిట్లను ‘నెత్తెఱంగున నేను ధనవంతుండ నగుదు నంటేని వినుము. హిమవంతంబు నుత్తర భాగంబున ముంజవంతంబను పర్వతంబుగల దందు శివుండు శివాసహాయుండై సురసిద్ధ గరుడగంధర్వాది సమస్త భూత జాలంబు సేవింప విహరించుచుండు. 059
క. మరణజరారోగము ల | గ్గిరి యే డిరవులను లే వఖిల గుల్మలతా
తరువులఁ గుసుమఫలంబులు | గర మొప్పుచునుండు నెల్లకాలము లందున్‌.
060
తే. ఆ నగంబు పార్శ్వంబుల నరుణకిరణ | రుచివితావితానంబు ననుకరించుచు వెలుంగు
శుద్ధకాంచనమయ శిలాస్థూలవాలు | కాప్రభాజాల మాశ్చర్యకారి యగుచు.
061
వ. మన మయ్యెడకుం బోయి. 062
సీ. శ్రీకంఠు రుద్రుని శివుఁ బూషదంతఘ్ను | హరునిఁ గపర్ది శంకరుని నంత
కాంతకు వరదుని నాదిదేవునిఁ ద్రిలో | చను సహస్రాక్షుని శాంతమూర్తిఁ
జీరవాసుని ధన్వి సిద్ధు దండధరు మృ | గవ్యాధు నుష్ణీషిఁ గనకబాహుఁ
బశుపతి వృషు భూతపతి మాతృభక్తుని | నజు నగ్నివక్త్రుని నభవు భవుని
 
ఆ. భక్తిఁ బ్రస్తుతించి ప్రణతులఁ దేల్చి త | త్కరుణ వడసి పసిఁడి ద్రవ్వి తండ
ములు నృపాల! పెక్కుమోపులు దెత్తము | రమ్ము భారవహులఁ దెమ్ము చాల.’
063
క. అని పలికి యమ్మహాత్ముఁడు | గొని పోవఁగఁ బోయి శివు నకుంఠితకరుణన్‌
గనక మసంఖ్యము మోపులు | గొని వచ్చె నతండు మంచుకొండ యివులకున్‌.
064
వ. ఇట్లు మహాధనవంతుండై మరుత్తుండు సువర్ణమయంబులుగా యజ్ఞవాటంబును భాండప్రముఖసకల క్రియాసాధనంబులును శయ్యాసనాదులుం గావించుకొని తత్ప్రదేశంబున నతిమానుషంబగు విభవం బెసంగ యజనంబున కుపక్రమించుటయు, బృహస్పతి యంతయు నెఱింగి యంగంబు గృశంబై వెలరువాఱునట్టి వగం బొందిన సంక్రందనుండు సూచి యవ్వాచస్పతి కిట్లనియె. 065
ఆ. ‘తెలివు వొంది యున్నదియె నీదు చిత్తంబు? | సురల బ్రదుకుతెరువు లరసి నడపు
చున్నవాఁడవే! సముత్సాహమున వారు | నీకుఁ బ్రియ మొనర్చి నేర్చి మండ్రె?’
066
వ. అనుటయు నాచార్యుండు ‘సర్వంబు సంపన్నంబ’, యనిన ననిమిషపతి యతనితోడ. 067
క. ‘నీ యొడలు దస్సి వెలువెల | నై యున్నది; నీకు నిట్టి యధికపు వగపుం
జేయఁగ వెఱవని నీచులఁ | జేయుదు దండితులఁ గాఁగఁ జెప్పుము వారిన్‌.’
068
వ. అనవుడు నాచార్యుం ‘డట్టిదిలేదు; మరుత్తుండు మహనీయం బగు మఖం బొనరింప నుద్యోగించిన వాఁ డతనికి మద్విరోధి యగు సంవర్తుండు యాజకుండయి యది నడపువాఁడయ్యెననివింటి; మద్విషాదంబునకు మూలం బిది; యట్లు గాకుండం జేయవలయు; నజ్జననాయకు నియమించి సంవర్తుని యాజకత్వంబు నవశ్యంబును మాన్చునది’ యని పలికినం బాకశాసనుండు పార్శ్వంబున నున్న యగ్నిదేవు నాలోకించి ‘నీవు మరుత్తు పాలికిం బొ; మ్మతండు క్రతుకరణంబున కుత్సహించినవాఁడు; తదీయం బగు నుపదర్శనంబు బృహస్పతి యాచరించువాఁడుగా సంఘటించి ర’ మ్మని నియోగించిన. 069
ఆ. ‘అట్లు సేయువాఁడ’ నని యగ్ని నిజతను | స్ఫురణ మతిశయిల్ల నరుగుటయును.
నుల్ల మచ్చెరువున నూన మరుత్తుండు | ప్రణతి యాచరించి భక్తితోడ.
070
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )