పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము
మరుత్తుని యజ్ఞంబున హవిర్భాగంబులు గొన నింద్రాదులు వచ్చుట (సం. 14-10-19)
వ. అని పలికి దవ్వులన యవ్వజ్రంబు వారించి గంధర్వునకు వీడుకోలు సేయించి యయ్యోగీంద్రుండు దేవేంద్రుని దేవతలనుం బిలిచె; నమ్మహాత్ముని మహనీయమంత్రశక్తి నాహూతులైన యప్పురుహూతప్రభృతి బృందారకులు ప్రియంబున నరుగుదేర నమ్మునిపతి యనుజ్ఞ నజ్జనపతి వారల నెదుర్కొను తెఱంగు నడపి తానునుగూడ నడచి వారికి నర్ఘ ప్యాద్యాదిపూజనంబులు విధివిహిత ప్రకారంబునం జెల్లించె; నమ్మరుత్తుండును మరుత్పతికిం బ్రణమిల్లి ‘దేవా! నీవు విజయంచేసి నా జన్నంబు సఫలంబు సేసితి; కృతార్థుండనైతిం గృపాధామ! నా మీఁది యలుక మాని నన్నుం జల్లనిచూడ్కిం జూడు ‘మని ప్రార్థించి సంవర్తుం జూపి ‘యిత్తాపసపతి బృహస్పతి స్వరూపంబ కావునం గ్రతుయాజకుండుగాఁ బ్రతిగ్రహించితి నని విన్నవించుటయు ననిమిషనాథుండు ‘నీ వలనం బ్రీతిం బొందితి; నీతం డయ్యమరగురు ననుజుం డతని యట్లగుటకు సందియంబేమి?’ యనుచు వికచవదనుండై కనుంగొనిన నమ్మునివరుం డా దివిజవరున కిట్లనియె. 099
ఆ. ‘అఖిలలోకభర్త వమరేంద్ర! నీ విట్టు | లాదరమున వచ్చు టరయ నా త
పంబు ఫలముగాదె! పావనమూర్తి యీ | రాజు క్రతువుఁ బుణ్యరాశి యయ్యె.
100
చ. సకలవిధానదక్షుఁడవు సర్వము నారసి చేయఁ బంపు నీ
సకృపవిలోకనంబులను సార్థములై క్రతుమంత్రతంత్రముల్‌
వికలత లేక చెల్లు జనవిశ్రుతుఁ డీ నృపుఁడున్‌ భవద్దయన్‌
సుకృతులలోనఁ బెంపు గని చూడఁ గనుం దగఁ బుణ్యలోకముల్‌.’
101
వ. అని యిట్లు నిభృతుండై యభివర్ణపూర్వకంబుగా సంభాషణం బాచరించిన. 102
సీ. భూరి హర్షంబునఁ బొంది పురందరుం | డమృతాశనులఁ గలయంగఁ జూచి
‘యజ్ఞవాటం బుదాత్తాభిరామంబుగఁ | జేయింపుఁ, డప్సరః స్త్రీ జనంబు
నాట గంధర్వుల పాట జెల్లింపుఁడు | నావుడు వా రట్ల నడపి, మఱియు
సకలకర్మములకు సాహాయ్య మాచరిం | పంగ వేఱొక యగ్ని భంగి వెలఁగి
 
తే. లలితసముచితపీఠ మలంకరించి | వేడ్క సంవర్తముని హవిర్విధి యొనర్ప
యాగముజ్జ్వలమును సుప్రయోగకంబు | నగుచు నొప్పారె భరతకులాగ్రగణ్య!
103
తే. ప్రీతిఁ బేర్వేరఁ బిలిచి చేసేఁత సోమ | మమ్మహాయోగి యంది యీ నెమ్మిఁ బాన
మాచరించి సహస్రనేత్రాదులైన | యమరు లానందమునఁ దేలి రధిపముఖ్య!
104
వ. ఇట్లు మరుత్తుండు మరుత్పతికిం బరమతృప్తి గావించి యామంత్రణంబు సేయ నయ్యందఱు నభినందించి నిజ నివాసంబులకుం జని; రజ్జననాథుండు. 105
చ. యజనము సెల్లుకాలము సమాప్తతఁ బొందిననాఁడు తద్ద య
క్కజమగు భంగిఁ బ్రస్ఫురితకాంచన రాసు లనేకముల్‌ బహు
ద్విజులకు భక్తియుక్తియును వేడుకయున్‌ వినయంబు నొప్ప సం
భజనపరాత్ముఁడై యొసఁగెఁ బౌరవవంశపయోధిచంద్రమా!
106
తే. అంతఁ బోవక హేమమమత్వమహిత | యజ్ఞవాట భాండాది పదార్థములును
బ్రాహ్మణావళి కిచ్చె నప్పాట నతఁడు | హిమగిరిప్రాంతమునఁ గ్రతు వెలమిఁ జేసి.
107
వ. సంవర్తునిచేత ననుజ్ఞాతుండై నిజపురంబునకు నరుగుదెంచి వార్ధివేష్టిత వసుంధరావలయంబునం బుణ్యపరత వెలయం బాలించె; బ్రాహ్మణులుఁ దమ యోపినంతయుం బసిండి ద్రవ్వితండంబులు దెచ్చుకొని తక్కినదాని నచ్చట నొక్కెడ నిధిగా నిక్షేపించి దీనిం గాలాంతరంబున నెవ్వరేనిం గని రిదియక్కనిన వారిధనంబ యని రమ్మహాకాంచన సంచయంబు గొనివచ్చి విచ్చలవిడి నశ్వమేధయాగంబున సకలదేవతలం దృప్తులంజేయు’ మనియె; నట్లు వేదవ్యాసమునీశ్వరుండు సెప్పిన వచనంబులు వినియును బంధువిషయ శోకంబునం గ్రమ్మఱం దెలివి నొందియు నొందక ధూమంబు వొదివిన యనలంబునుంబోలె నున్న పాండవాగ్రజుం గనుంగొని కమలనాభుండు. 108
తే. ‘వంకయైన తలం పెల్ల వసుమతీశ! | యరయ మృత్యుపదం బగు నార్జవాన్వి
తంఖీఖీఖీబు బ్రహ్మపదం బింత తథ్య మేల | యీఱతాఱ తలంపుల బీఱవాఱ?
109
క. కర్మానుష్ఠానంబును | నిర్మలముగ నడపఁ బడదు నీచే విను మో
ధర్మతనూభవ! వగయును | నిర్మూలము సేయ విది మనీష గలిమియే?
110
వ. వగ నిర్మూలము సేయమి యెట్లంటేని నీ వంతశ్శత్రువుల నెఱుంగవు గాదె! కావున నేతద్విషయం బైన యొక్క యితి హాసంబు గల దాకర్ణింపుము. 111
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )