పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము
శ్రీకృష్ణుఁ డర్జునునకుఁ దత్త్వజ్ఞానస్థిరీకరణము చేయుట (సం. 14-16-12)
వ. ఏతద్విషయం బగునది యొక్కయితిహాసంబు గల దాకర్ణింపుము. నాకడకు నొక్క విప్రోత్తముండు వచ్చిన నేనును ‘దత్త్వజ్ఞానంబు తెఱం గుపదేశింపవే’ యనుటయు నతండు కాశ్యపనామధేయుం డగు నొక్క ధరామరుం డొక్కెడ విజితేంద్రియుండును జ్ఞానవిజ్ఞానశాలియుఁ ద్య క్తసంసారపరిగ్రహుండును బ్రబుద్ధసేవితుండును నగు నొక్క సిద్ధునిం గాంచి సంభృతవినయుండై శిష్యత్వంబున భక్తి నాశ్రయించిన నమ్మహాద్విజునకు నమ్మహనీయుండు సెప్పిన వాక్యంబులు సెప్పెన; నవధానంబుతో విను’ మని పల్కి మదీయవదనంబునం జూడ్కి నిలిపి యిట్లనియె. 158
ఆ. అట్లు భక్తిఁ దన్ను నాశ్రయించిన శుచి | త్వాధికుండు నిర్మలాత్మకుండు
నతులవినయపరుఁడు నగు విప్రవరుని వీ | క్షించి యిట్టులనియె సిద్ధవరుఁడు
159
సీ. ‘పుణ్యంబు లగు కర్మముల నెప్పుడును జేసి | యింపారుచుండు నైహికసుఖంబుఁ
ద్రిదినంబుఁ బడసితి ధీయుత! యత్యంత | యత్నలబ్ధం బైన యట్టి పదము
పదపడి యొక మాత్ర భ్రంశంబు నొంది కా | మక్రోధ ముఖచిత్తముల విశేష
ములఁ బొరిఁబొరి జన్మమును మరణంబును | గలుగంగ నేను దల్లులను దండ్రు
 
తే. లను సహోదరులను బుత్త్రులను ననేక | జాతి కలితులఁ గాంచితి జున్నుఁ బాలు
వివిధభంగుల వానిఁ ద్రావితి సుహృద్వి | యోగధననాశ దుర్దశ లొందెఁ బెక్కు’
160
క. మానస శారీరము లగు | నానావేదనల వివిధ నరకగతుల దుః
ఖానేకత్వ మొనర్చు వి | మాననవధబంధనప్రమర్దనకృతులన్‌.
161
వ. అనుభవించుచు నుండి విసివి లోకతంత్రంబు పరిత్యజించితిఁ; బదంపడి యాత్మప్రసాదంబున నిట్టి సిద్ధి వడసితి; నింక లోకంబుల నాలోకింప నాకుం బ్రజాసర్గంబు గల యంత గాలంబును శుభంబ నిరంతరంబై కలుగుచుండు; నే నంతకంతకు నెక్కుడు లెస్సయగు దశలన పొందుదు; బ్రహ్మానందంబు సులభంబ’ యని పలికి మఱియును. 162
ఉ. ‘ప్రీతుఁడ నైతి నీ దెసఁ బరిస్ఫుటభంగిని జెప్పు మెద్ది నా
చేత నుపాస్తిమైఁ బడయఁ జేరితి నీ కది గల్గు నట్లుగాఁ
జూతు నవశ్యమున్‌ వినయసుందర! నన్ను నెఱింగి వచ్చి తీ
వీ తెలి వస్మదీయ మతికెక్కిన నిన్నుఁ బరిగ్రహించితిన్‌.’
163
క. అనుడు నతఁడు హర్షించుచు | ‘ననుఁ బరతత్త్వ ప్రబోధనమునఁ గృతార్థా
త్మునిఁ జేసి జన్మమృతి దుః | ఖ నిరాస మొనర్పు పరమకారుణ్యనిధీ!’
164
వ. అనుచుం దచ్చరణంబులు కరంబుల నవలంబించి, ప్రణతి యాచరించి, కేలు మొగిచి యున్న నయ్యుర్వీ సురోత్తముతో నా సిద్ధసత్తముండు ‘నీకుం బరిపాటిం జెప్పిన; సావధానమానసుండవై యాకర్ణింపు మని యిట్లనియె.’ 165
ఆ. ‘ధర్మసాధనంబు దనువు; ధర్మము పరి | జ్ఞానదాయి యట్లు గాన తనువు
నోమవలయు మర్త్యుఁ డేమిటి నేమఱ | కాత్మహితము గోరి యనఘచరిత!
166
వ. ఏమఱుటల తెఱంగు వివరించెద. 167
సీ. తన సత్త్వమును బలంబును దన కయ్యెడు | కాలంబు నారయఁగాఁ దలంపఁ
డాహారముల గొను నవియును నగునవి | గానివి యను వివేకంబు బుద్ధిఁ
జొనుపఁడు బహుళభోజన మొక మరి సేయు | నొక మరి దుర్నిష్ఠ నుపవసించు
గతకాలమును నపక్వంబును గురుదుష్ట | విషమవిరుద్ధము విపులరసము
 
తే. నైన యన్నము దా నరయక భుజించుఁ | గుడుపుపైఁ గుడ్చు దిననిద్ర గూరు సురత
పరత నొందుఁ బె ల్లాయాసపడు విమూఢుఁ | డతని బాధించు దోషత్రయంబుఁ గెరలి.’
168
వ. అని చెప్పి. 169
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )