| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అని వెండియు నవ్విప్రుం డిట్లను. ‘జనకచక్రవర్తికి నొక్క బ్రాహ్మణునకుం గలిగిన సంవాదంబు సెప్పెద నాకర్ణింపుము. జనకుండు తన కట్టెదుర బ్రాహ్మణుండు కొఱగామి సేసిన నతనితో ‘నీవు నా విషయంబున వసియింప వలదు పొ’ మ్మనిన నతండు. | 087 |
| క. |
‘నీ విషయ మెంత వ? ట్టది | యే విని పరవిషయమునకు నేఁగెదఁ దెలియం గా వినిపింపు’ మనుడు నా | భూవల్లభుఁ డూరకుండెఁ బుణ్యచరిత్రా! |
088 |
| ఆ. |
ఊరకుండి మూర్ఛ నూని యొక్కింత సే | పునకుఁ దేఱి యిట్టులనియె ‘నాదు తాత తండ్రి తరము ధరణి మద్వశ్యత | నుండ నాకు మమత యొలయ దందు. |
089 |
| వ. | మిథిల నెప్పుడు వసియించెద; నిప్పురంబును మదీయంబని యంగీకరింపం బడదు కావున నిది నా విషయంబున లేమింజేసి మున్ను నీతో నాడిన మాటలఁ బుట్టిన వగ పెంపున మూర్ఛవచ్చె’ ననిన విని యవ్విప్రుం డా భూవిభు నాననం బాలోకించి. | 090 |
| క. |
‘నరనాయక! నీ యేలెడు | పురమున భూమిని మమత్వబుద్ధి గలుగ కి ట్లెరవై యుండుటకుఁ గతం | బరయఁగ నెద్ది? వినిపింపు మది విశదముగన్.’ |
091 |
| వ. | అనుటయు నజ్జనపతి యతని కిట్లనియె. | 092 |
| తే. |
‘అరయ నివి యెట్లుఁ జెడియెడు నవియకాన | వినుము మద్ధన మిది యని వీనిలోన నొకటి యందు నంగీకార మొలయ దెల్ల | విషయమును నా యదియ యను విధము గలదె?’ |
093 |
| వ. | ఎట్లంటేని ఘ్రాణాదులకు గోచరంబు లయినను గంధాదులు సెడంగలయవి గావున నాయవి యనకుండుటం జేసి భూమ్యాదిభూతంబులు నాచేత నిర్జితంబులై మద్వశగత్వంబు నొంది యుండు.’ | 094 |
| చ. |
అనవుడు బ్రాహ్మణప్రవరుఁ డల్లన నవ్వుచు ‘నిన్ను నారయ న్మనమున వేడ్క పుట్టి నరనాయక! వచ్చితి నేను ధర్ముఁడం బనుపడు నివ్వివేకపరిపాకము గాఢనిరూఢభావ మొం ది నిలుచుఁ గాత! నీ దగు మదిన్ సతతంబును శాంతికారియై. |
095 |
| వ. | అని ధర్మదేవత జనకునకు వరం బిచ్చి యంతర్ధానంబు సేసె’ నని చెప్పి యా ధరణీసురోత్తముం డయ్యుత్తమాగంగనతో ‘హితోపదేశంబు సేసెద; నవహిత వయి యాకర్ణింపు’ మని పలికి యిట్లను ‘సంసారవర్తనంబు వదలవిడిచి యే నేకతంబ యున్నయెడ నీవు మ్రుచ్చిలి వచ్చి ‘మదీయవైరాగ్యంబు మాన్పఁ దలంచి నాకు నధ్యాత్మబోధంబు గలుగంజేయు’ మని యభ్యర్థించిన నీ తలం పెఱింగియు నెఱుంగని వాఁడపోలె నధ్యాత్మ విద్యాబోధకప్రకారంబు లైన వాక్యంబులు సెప్పితి; నేనింక లోకంబులం గలసి చరించువాఁడంగాను; నిక్కపు బ్రాహ్మణుండ నయితి; బ్రహ్మచారి నయితి; జీవన్ముక్తుండ నయితి; మిముబోంట్ల కొలఁదిగా నన్నుంజూచెద వది నా తెఱం గెఱుంగమి; యేను జగంబు సమస్తంబును వ్యాపించి యున్నవాఁడ; నా యున్న భంగికి నా బుద్ధి సకల పృథ్వీరాజ్యంబును నాకలోకాధి రాజ్యంబును సరిగావని తలంచు నా బుద్ధియ నాకు ధనంబు; దారువుల నగ్నియున్న చందంబున సర్వజంతువుల యందును నంతర్గతయై సిద్ధియున్నది; గురువాస గృహవాస వనవాస పరులగు బ్రాహ్మణులకెల్లను శ్రేయః ప్రాప్తికిం దెరువొక్కండ; యందఱును సరిత్తులు సాగరంబుఁ బ్రాపించిన తెఱంగునఁ బరతత్త్వంబు నొందుదురు; బుద్ధి నిమ్మార్గంబు నధిగమింప నగుఁగాని శరీరంబున వశంబుగాదు కర్మంబు లాద్యంతవంతంబులు శరీరంబు గర్మబంధనకరం బింత యెఱుంగుదుం గాన నా హృదయంబునం బరలోకభయంబులేదు నా చెప్పిన యధ్యాత్మ విద్యావిషయ వాక్యంబుల తాత్పర్యంబు చిత్తంబున నెలకొలిపి భావనానిరతవయి యుండుము; నన్న పోలెదు; వెఱవకు’ మనినఁ బతికి సాష్టాంగదండ ప్రణామం బాచరించి కేలు మొగిచి. | 096 |
| సీ. |
‘నీవు సెప్పిన మహనీయవాక్యనికాయ | మతిగహనం బకృతాత్ములకును నర్థగ్రహణశక్తి యనఘ! కల్గునె కృతా | త్ములకైన? గ్రమ్మనఁ దెలియవచ్చి యుండ దయ్యెఱుకకు నుదయింపఁ బట్టైన | యట్టి యుపాయంబు నాదరమున నాకుఁ బ్రసాదింపవే కరుణాకర!’ నావుడు నాతఁ డన్నాతితోడ |
|
| ఆ. |
‘నరణి బ్రాహ్మణుండు గురుఁ డుత్తరారణి | దపము శ్రుతము నిర్మథన మొనర్చి జ్ఞానవహ్ని వుట్టు మానిని! యని చెప్ప | వనిత యిట్టులనియె వల్లభునకు. |
097 |
| క. |
జనవినుతచరిత! బ్రాహ్మణుఁ | డనఁగా క్షేత్రజ్ఞుఁ డగుట యల్పము దోఁచెన్; మనమున నతని నరణిగాఁ | గొను టవ్వస్తువు నెఱింగికొని పిదపఁ గదా!’ |
098 |
| వ. | అనిన నతం డిట్లనియె. | 099 |
| ఆ. |
‘అతనిఁ దోఁపఁ జేయునట్టి సాధనము లే; | దింద్రియముల కందఁ; డేమి లక్ష ణములు లేవు; నిర్గుణత్వనిరూఢుం డ | హంత లేమిఁ దోఁచుఁ గాంత! కనుము.’ |
100 |
| వ. | అని నిర్దేశించుటయు క్షేత్రజ్ఞవిషయసంశయంబు వాసి యయ్యింతి శాంతి నొందె’ నని గోవిందుండు సెప్పి గాండీవి ‘యా బ్రాహ్మణుండును బ్రాహ్మణియు నిట్టి వారగుదురె! వారెచ్చటివారు? వారల నా కెఱింగింపవే’ యని యడిగిన నద్దేవుం డతని యాననం బాలోకించి. | 101 |
| క. |
‘నా మనమును బుద్ధియును గృ | పా మహితా! బ్రాహ్మణుండు బ్రాహ్మణియు హృషీ కామేయమైన క్షేత్ర | జ్ఞానుల వస్తువును నేన యనియె నరేంద్రా!’ |
102 |