| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అట్లు వోయి పోయి, మార్గంబు కెలనం జేరువ నున్న యుదంకాశ్రమంబు గని, యందుఁ జని, వినయం బొప్ప నమ్మునిం గని, యతని చేయు నతిథి సత్కారంబులం బ్రియంబంది, యతనిపాల నాసీనుండయి యుండ, నతం డప్పుండరీకాక్షున కిట్లనియె. | 028 |
| చ. |
‘భరతులపాలి కేఁగి, తగఁ బాండవ కౌరవ బంధుభావమున్ గరము దృఢంబు సేసితె? సుఖస్థితి రాజుల వారి వారి వి స్ఫురిత మహాధిరాజ్యముల చొప్పుల నిల్పితె? పక్షపాతితా దురితము లేని నీవు జనతోష విధాన విశారదుండవై.’ |
029 |
| వ. | అని యిట్లెఱుంగనివాఁడయి యడిగెడు నట్లపోలె, నిందా గర్భంబుగాఁ బలికినం, బద్మనాభుండు దానును దాని నెఱుంగమి భావించి, యా భార్గవు నాననం బాలోకించి. | 030 |
| చ. |
‘కర ముచితంబుగాఁ బలికి, గర్వపుమాట నదల్చి, భీతికిన్ దెరు వగునట్ల చెప్పి, గడుదీనత దోఁపఁగ నాడి, సంధి క క్కురుపతిఁ దమ్ముప్రోవు మొగకొల్పఁగ జాలన; నాకు భీష్ముఁడు న్గురుఁడును దోడు చెప్పిరి; మునుల్ బహుభంగుల నొత్తి రత్తఱిన్. |
031 |
| వ. | అతిలోభంబునం జేసి వంశధర్మంబు విడిచి, యెవ్విధంబులను సంధికిం జొరక, కురుకుమారులు పాండవులతో భండనంబొనర్చి, సబంధు పరిజనంబుగా మరణంబు నొంది, యుత్తమ లోకంబుల కరిగి; రిక్కడఁ బాండు నందన పంచకంబు ద్రిక్కఁ దక్కటి వారెల్ల నట్లపోయిరి; కాల నియతి గడవ నెవ్వరికిని శక్యం బగునే?’ యనిన విని రోషకషాయితంబు లగు తారకంబు లుద్వృత్తంబులు సేయుచు నత్తపోధన సత్తముండు. | 032 |
| క. |
‘కౌరవ కులమును మిథ్యా | చారుఁడవై త్రుంచి తకట!; శక్తుఁడ వయ్యున్ నేరిమిమైఁ జేయవ పొం | దారఁగ; నిక్కిల్బిషమున కంతటికిఁ దగన్. |
033 |
| వ. | ఘోరప్రకారంబగు శాపంబు నీకిచ్చెద’ ననిన, నచ్యుతుం డా మునితో, ‘నా మాటలు దేటపడ విని తగినయట్లు సేయుదుగాక’ యని పలికి యిట్లనియె. | 034 |
| చ. |
‘కినియుట మాను; మేలె మునికిం గుపితత్వము? శాంతవృత్తి నా యనునయ మాదరింపు; విను, మల్పతపంబులచేతఁ గోలుపో దునె? మఱి యట్లుఁగాక యతిదుష్కరమైన తపంబు, సంచితం బనఁదగు బ్రహ్మచర్యమును నాఱడివోవె కటా! శపించినన్.’ |
035 |
| వ. | అనిన విని యుదంకుండు శ్రీవత్సాంకు నవలోకించి. | 036 |
| క. |
‘అగుఁ గాక; నీవు సెప్పెడు | తగ వెయ్యది సెపుమ; వినియెదం; బోలిన నే మగిడించెద శాపోన్ముఖ | బగు మన్మానసము’ ననుడు నల్లన నగుచున్. |
037 |
| చ. |
‘తమము రజస్సు సత్త్వము నుదంక! మదీయ వశప్రవర్త మా నములు; మరుద్వసు ప్రభృతి నాకిచయంబు మదుద్భవంబు; స ర్వము నను నేన నిల్తు; సుఖవాసత నన్ దగఁ జెంది నిల్చు స ర్వము; విను; మేన చూవె యపరంబు పరం బనఁగల్గు తత్త్వముల్. |
038 |
| తే. |
ప్రణవ ముఖవేదములుఁ జతుర్వర్ణములుఁ, జ | తుర్విధాశ్రమములును, దత్సర్వ కర్మ జాతములును, సమంచిత స్వర్గ మోక్ష | ములును మన్మయముల కాఁగఁ దెలిసికొనుము. |
039 |
| క. |
క్రతుపరులు నన్న తగ సం | స్తుతించి ఫల మందఁ గండ్రు; దోషయుతులు స మ్మతిఁ బ్రాయశ్చిత్తంబులఁ | గృతాత్ము లగుదురు మదీయకీర్తన పరులై. |
040 |
| క. |
మానసు మదగ్ర పుత్త్రుం | గా నెఱుఁగుము ధర్మునిని; జగద్రక్షకు నై యే నభిమత కాలములను | మానిత జన్మముల నొంది మనుతుఁ దపస్వీ! |
041 |
| క. |
భవ వర్ధన విలయంబుల | నవలీలన వరుస బ్రహ్మయన, విష్ణుఁ డనన్ శివుఁ డన, నిర్వర్తింతును | భువనంబుల నేన చూవె భూరిమహిమలన్. |
042 |
| క. |
ధర్మంబు కలఁకఁ గాంచి, య | ధార్మికులం బొలియఁ జేసి, ధార్మికులను బే రర్మిలి రక్షింతు నుచిత | కర్మాచరణముల నే జగద్ధితమునకై. |
043 |
| వ. | అట్టివాఁడ నయి యుండియు. నధర్మపరులగు ధార్తరాష్ట్రుల నత్యంత ధార్మికులగు ధర్మనందనాదులతోఁ గలుపుటకుం బలుదెఱంగులం బడితి; నది దివ్యజ్ఞాన దేదీప్యమానులగు పారాశర్యప్రభృతిమునివరుల చిత్తంబుల కెక్కె; నక్కౌరవులు దమదౌర్మాత్యంబున మాహాత్మ్యవంతులగు నా కౌంతేయులం దొడరి ధర్మసమరంబున సమసిరి; నా చేసినపని యిట్టిది; నన్ను నుదంక! నీ వింక నే మనియెద వను’ మని పలికిన నతండు వినతుండగుచు నిట్లనియె. | 044 |
| ఉ. |
‘ఇప్పుడు నీ మహామహిమ యేర్పడ, సమ్యగనుగ్రహంబునన్ జెప్పిన యీ సమంచిత విశేషము లెల్ల నెఱుంగుదున్; మదిం గప్పిన యీ దురాగ్రహపు గర్వము ముంచికొనంగ నాకు మున్ చొప్పడియెన్; సుధాసదృశ సూక్తులఁ దేర్చితి వీవయచ్యుతా!” |
045 |
| వ. | అని వెండియు. | 046 |
| ఆ. |
‘అతులమైన నీ దయా మహిమకు నేను | బాత్ర మగుదు నేనిఁ బద్మనాభ! యనుపమాన తావకాకృతిఁ జూపవే | నాకుఁ జూడ్కియును మనంబు నలర.’ |
047 |