పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - ప్రథమాశ్వాసము
సంజయుఁడు ధృతరాష్ట్రునకు భారతయుద్ధంబు సెప్పఁబూనుట (సం. 6-16-7)
ఉ. ‘ప్రాంశుఁ బయోదనీలతనుభాసితు నుజ్జ్వల దండధారుఁ బిం
గాంశు జటాచ్ఛటాభరణు నాగమపుంజపదార్థతత్త్వ ని
స్సంశయకారుఁ గృష్ణమృగచర్మకృతాంబరకృత్యు భారతీ
వంశవివర్ధనుం ద్రిదశవందితు సాత్యవతేయుఁ గొల్చెదన్‌.’
71
వ. అని పలికి పారాశర్యుం జిత్తంబున నిలిపి నమస్కరించి ధృతరాష్ట్రున కిట్లనియె. 72
క. ‘వినినదియును, నెయ్యెడ నేఁ | గనినదియును, మునికృపం బ్రకాశంబై తోఁ
చిన యదియును, విశదంబుగ | వినిపించెద మొదలుకొని సవిస్తారముగన్‌.
73
వ. ఆ రాత్రి నిన్ను వీడుకొని మన దండునకుం జని, నీ కొడుకు నగరు సముచిత ప్రకారంబునం బ్రవేశించు నప్పు డతండు గాంగేయాది కౌరవులును దగు రాజులును బరివేష్టింపం బరిమిత స్థానంబున నుండ, నేనును బొడసూపి,యతని యాదరణంబు వడసి కొలిచి యుండితిం; బదంపడి సమర విషయంబులైన సంభాషణంబుల సమయంబున నమ్మేదినీశ్వరుండు దుశ్శాసనుం గనుంగొని యిట్లనియె. 74
క. ‘మనకుఁ బాండురాజ తనయవర్గమునకుఁ | గయ్య మయ్యెఁ; బెద్ద కాలమేని
నెదురు చూచుచుండ నొదవె నివ్విధ, మిందుఁ | బూని చేయవలయుదాని వినుము.
75
క. కన్నాకు మనకు భీష్ముం; | డిన్నరవరుఁ గావవలయు నెమ్మెయి నైనం;
దన్నుం గాచిన నితఁడు జ | గన్నుతముగ రణమునం బగఱ నడఁగించున్‌.
76
ఆ. ఎల్లవారిఁ గాచు నితఁ డని యెప్పుడుఁ | దలఁతు; మితనిఁ గావవలయు టేమి
యని తలంచె దేని విను; మిందఱకు నిది | వినఁగవలయు నట్టి పని కుమార!
77
వ. సత్యవ్రతుం డగు నిమ్మహానుభావుండు. 78
క. వినుఁ డన్యు లెవ్వరును నా | మునుమునఁ బడి బ్రదుక రాలమున; నేను శిఖం
డిని నోర్వఁ జాలఁ జుండీ! | యని మన యుద్యోగవేళయప్పుడ చెప్పెన్‌.
79
ఉ. ఏమఱి రక్ష సాలని మృగేంద్రుని నక్కయుఁ గోలుపుచ్చు; సం
గ్రామములోనఁ గన్గలిగి కావక తక్కిన నా శిఖండిచే
నీ మనుజేంద్రుఁ గోల్పడమె? యిట్టిది గోల్పులి నిద్రవోవ ను
ద్దామ బలంబుమై గొఱియ దాఁకి వధించినయట్టు లుండదే.
80
క. కావున నీ యుద్భటరథి | కావలి నివ్విభునిఁ గాచునట్లుగఁ బనుపం
గావలయు మీర లందఱు | నేవలఁ జూచిన శిఖండి కెదురుం డెపుడున్‌.’
81
వ. అని నియమించి కొలువు విరిసి చని యుచిత విధంబున నుండె; నంతఁ బ్రభాతం బగుటయు నమ్మహీపతి పడవాళ్ళం బనిచి బలుమానిసులను బలంబులను బవరంబునకు వెడల నియోగించిన, శంఖ దుందుభి ప్రముఖ మంగళ తూర్య నిస్వనంబులను నయ్యై సాధనంబులు సమకట్ట సముచిత పరివారంబునకుంజెప్పెడు దొరల పలుకుల గంభీర నాదంబులను, గట్టుమట్లు కదలఁ దిగిచినం జెలంగు కరితురంగంబుల బృంహిత హేషిత ఘోషంబులను బూన్పం దిగుచు రథంబుల నేమిస్వనంబులను, బెలుచ నొండొరులం బిలుచు పదాతుల యెలుంగుల విపులధ్వనులనుం, బేర్చిన మహారవంబున శిబిరంబు చంద్రోదయ ఘూర్ణమాన మహార్ణవంబును గ్రేణి సేయుచుండ సూర్యోదయంబైన సైన్యంబులు సెలంగుచు వెడలునప్పుడు. 82
తే. కనకభూషణజాలంబుకతన గజము | లెరవళులు వోవు కొండల నెనసి యొప్పె;
వల్గనంబుల హేషలవలన నబ్ధి | ఘనతరంగంబు లనఁ దురంగములు వొలిచె.
83
క. అరదములు సవరణలతోఁ | బరపై యొక్కొక్క యూరి పరపున నరిగెం
బరుసని పలుకుల నాకృతి | పరుషత నసురాలివోలె భటతతి మెఱసెన్‌.
84
వ. అట్టియెడ. 85
మ. పరిధానంబును దేరు నశ్వములుఁ జాపంబుం బరిస్ఫీత వ
జ్రరుచివ్యాప్త సువర్ణతాళమయ చంచత్కేతువున్‌ వర్మముం
గర మొప్పం దెలుపారు వెల్గొడుగుతో గంగాసుతుం డా సుధా
కరుఁడుంబోలె వెలింగె దర్ప మెసఁగం గౌరవ్యసైన్యాబ్ధికిన్‌.
86
సీ. కాంచనమయ వేదికా, కనత్కేతనో | జ్జ్వల విభ్రమం బొప్పఁ గలశజుండుఁ,
గనక గోవృషసాంద్ర కాంతి కాంతధ్వజ | విభవ విలాసంబు వెలయఁ గృపుఁడుఁ,
మణిసింహ లాంగూల మహితకేతుప్రభా | స్ఫురణంబు మెఱయంగ గురుసుతుండు,
రత్నశిలారశ్మి రాజిత కదళికా | మహిమ శోభిల్లంగ మద్రవిభుఁడు
 
తే. వెడలి తమ తమ చతురంగ వితతు లెల్ల | నుచిత గతి నూల్కొనంగఁ జేయుచుఁ గడంగి
సంగరోత్సవ సంభృతోత్సాహు లగుచు | నగుచుఁ దగుమాట లాడుచు నడచి రెలమి.
87
క. సమరక్రీడా సన్నా | హము లొప్పఁగఁ దక్కుఁ గలుగునట్టి దొరలు ద
ర్పము పల్లవింప వెడలిరి | తమ తమ కేతువులు గ్రాల ధరణీనాథా!
88
వ. వా రెవ్వ రంటేని వినుము. 89
క. కల్పితదృఢచతురంగా | నల్పం బై గండు మిగిలి యాదవబల మా
కల్పోజ్జ్వలతఁ గొలువ నవి | కల్పుఁడు గృతవర్మ సనియె గాఢస్ఫూర్తిన్‌.
90
క. రథములు దఱచై చెలువగు | పృథుసైన్యముతోడ బంధుబృందముఁ దానుం
బ్రథనోత్సుకవృత్తి మహా | రథుఁడు జయద్రథుఁడు వొలిచెఁ బ్రస్ఫురితగతిన్‌.
91
మ. చలదుర్వీధరలీలఁ గ్రాలు మదవత్సామోద్భవస్తోమ మ
గ్గలమై యేచిన సేన లొప్పఁగ దిశల్‌ గంపింప విందానువిం
దులుఁ గాళింగ మహీవిభుండు భగదత్తుండున్‌ భవత్సేనయో
ధులకుం గన్నుల పండువై నడచి రుత్తుంగాంగ సంరంభులై.
92
క. కొడుకులుఁ దమ్ములు గుఱ్ఱపు | దడములుఁ బెక్కైన బలవితానముఁ దగుమై
నడపించుచు మెలుపున సం | గడములతో నరుగు శకుని గడు నొప్పారెన్‌.
93
మ. తనతోఁ గాల్వురు సాలఁ గల్గు బలసంతానంబుతోఁ బ్రీతిఁ బు
త్రుని వీరోత్తము సోమదత్తు విలసద్దోర్దర్ప దుర్దాంతుఁ బౌ
త్త్రుని భూరిశ్రవసుం గనుంగొనుచు నింద్రుం గ్రేణి సేయంగ నే
చిన పెంపొప్పఁగ బాహ్లికుం డరిగె నిశ్చింతంబునం బోరికిన్‌.
94
వ. కాంభోజరా జగు సుదక్షిణుం డక్షీణ విభవంబున వెడలె; మఱియుం గోసలపతి యగు బృహద్బలుండును, మాహిష్మతీ పురనాథుం డగు నీలుండును, ద్రిగర్తేశ్వరుం డగు సుశర్మయు, నసురేంద్రులగు నలంబస హలాయుధులును, సాల్వ సౌవీర శూరసే నాభీర యవన వసుధాధిపులును లోనుగా ననేక దేశాధీశు లాత్మీయ చతురంగ బలసమన్వితులును నిజధ్వజ విరాజమానులును నానాభరణోజ్జ్వలాంగులును నయి సంగర కౌతుకంబు మొగంబులం దొంగలింప నరిగి ; రివ్విధంబునం బది యక్షౌహిణులు నడవం బదునొకండవ యక్షౌహిణితోఁ గురుక్షోణీవల్లభుండు విస్ఫురిత భూషణభూషితం బైన గంధ సింధురంబు నెక్కి వెలి గొడుగులు మెఱయం దొడవులం దఱచైన వజ్రంబుల యుద్దామంబు లగు దీధితిస్తోమంబులును జామరంబులుం గలయం బొలయ బహురత్నప్రభా విభాసితం బయిన భుజంగకేతనంబు గ్రాలఁ గెలంకుల దుశ్శాసన దుర్మర్షణ వివింశతి వికర్ణాదు లగు సోదరులు వాహన వల్గనంబులు మెఱసి మెఱుఁగారు తమ తమ సిడంబు లుల్లసిల్లం జెలువు మిగిలి చనుదేరం జనియె; నిట్లు కౌరవసైన్యంబు గూడికొని కోదండ గదాదండ కుంత క్షురికా ముసల ముద్గర తోమర పరశు భింది పాల శూల ప్రముఖ నిఖిల హేతివ్రాతంబులను భర్మపరికర్మ నిర్మాణశోభిత వర్మంబులును వివిధవర్ణ విచిత్ర తనుత్రాణంబులును, మణిగణోజ్జ్వలజ్వాలాజటిల కేతనంబులం బరమాభీలసుందర సమ్మర్దం బయ్యె; న ట్లున్న యప్పుడు. 95
తే. అమరు తొడవుల వజ్రాంశు లంచపిండు | కరణి హరినీలములఁ బేర్చుకాంతి యళుల
పగిది మాణిక్యరుచి పద్మభంగి మెఱయఁ | గురుబలంబు గెందామర కొలనిఁ బోలె.
96
వ. అట్టియెడ భీష్ముండు భూవల్లభులనెల్లం గూడం బిలిపించి వారలతో నిట్లనియె. 97
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )