పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - ప్రథమాశ్వాసము
భీష్ముని ప్రథమ దివస యుద్ధము (సం. 6-42-1)
వ. అనుటయు సంజయుం డతని కి ట్లనియె భవదగ్రనందనుం డత్యంతోదగ్రవ్యగ్రుండై యాగ్రహంబునం బనిచినం బ్రకటదోర్గర్వదుర్దముం డగు దుశ్శాసనుండు పురి కొలుపం గురుసైన్యంబులు శంఖ భేరీ మృదంగాది నిస్వనమ్ములు సెలంగ గాంగేయుండు దొలుతం గదలఁ గేతుశోభాభిరాముం డగుచు నుద్దామ గతిం గవిసినం గనుంగొని. 233
ఉ. పాండునృపాలనందనులు పావని మున్నుగ నేచి యప్డు భీ
ష్ముండు గడంక మై నడచు చోటికిఁ జక్కటి గాఁగఁ ద్రోచి యొం
డొండ కడంగి సేన తమ యుబ్బున కుబ్బఁగ నన్యసైన్య వే
దండ ముఖాంగముల్‌ దృణ వితానముగాఁ గొని నిర్వికారులై.
234
వ. ఉరవడించు సమయంబున. 235
క. ఘనతరగర్జా ధ్వనులును, | ఘనపథమఖిలంబుఁ దూఁటు కట్టెడు తూర్య
స్వనములునుం గబళించుచు | ననిలతనయు సింహనాద మడరెం బెలుచన్‌.
236
వ. ఇట్లు ప్రతిభటతురంగమాతంగంబుల గుండియ లవియ నందంద యార్చి పేర్చిన భీము నెదిర్చి దుశ్శాసనుండును దుర్ముఖుండును దుష్ప్రహుండును దుర్మర్షణుండును వివింశతియు వృషసేనుండును జిత్రసేనుండును వికర్ణుండును బురుమిత్రుండును దుర్యోధను చూడ్కికి వేడ్క సేయుచుం దాఁకిన. 237
క. ఉద్యతులై కవలును ధృ | ష్టద్యుమ్నుఁడుఁ గడఁగఁ దోన సౌభద్రుండున్‌
మాద్యద్గతిఁ గవియుడు నే | కోద్యోగత ద్రౌపదీసుతోత్కర మడరెన్‌.
238
వ. ఇవ్విధంబున వృకోదరునకుం దలకడచి తాఁకి వజ్రనిభమ్ములగు వాలమ్ములు శైలోపములగు కౌరవవీరుల పయిం గురియ నక్కుమారవర్గంబు ననర్గళప్రసారం బగు శరాసారంబుల వారలఁ గప్పె; నట్టియెడం గొండొకసేపు. 239
క. ఱిచ్చవడి యుభయబలములు | నచ్చెరువుగఁ జిత్రరూపు లట్లుండ శర
ప్రోచ్చలితచండదీప్తి స | ముచ్చయములు పెలుచఁ బరఁగె ముసుఁగువడంగాన్‌.
240
క. పదపడి దుర్యోధనుఁ డు | న్మదుఁడై తఱుమంగ ధర్మనందనుఁడు జయా
స్పదముగఁ బురికొల్పఁగ బె | ట్టిదముగ నొండొంటిఁ దలపడియె సైన్యంబుల్‌.
241
సీ. కప్పారు రేణువు గమలాప్తబింబంబు | రాహుమండలమన రమణఁ గప్పుఁ,
దెల్లని రజము శోభిల్లు సంగ్రామరం | గమునకుఁ దగు మేలుకట్టునట్లు,
ఖచరకాంతల యలకములందుఁ గెందూళి | యళులపై పుప్పొడి ననుకరించు,
నడరి పచ్చని పాంశు వమరు దిశాభిత్తి | తలములఁ గనకంపుఁ దగడు పగిదిఁ,
 
తే. బాండవానీకమును గురుబలము నొక్క | పెట్ట రథ గజ హయ భటాభీలచటుల
గతిఁ బరిక్షుణ్ణ సంగరక్షితితలముగ | వీఁక బెరసిన యత్తొలుతాఁకు నపుడు
242
మ. కరిఘంటానిచయస్వనంబులుఁ దురంగస్ఫీతహేషా సము
త్కరనాదంబులు హేతిపంక్తిపటుసంఘట్టోత్థరావంబులున్‌
ధరణీభాగనభోంతరం బడరి యుద్యత్తూర్యనానాధ్వని
స్ఫురణం బేమియుఁ దోఁప నీవ మొనలన్‌ భూపాలచూడామణీ!
243
వ. తదనంతరంబ. 244
క. కరికరశీకర తురగో | త్కరలాలాజాల రక్తధారాపటలీ
పరిషిక్తంబై సంగర | ధరణీ రజ మడఁగె నద్భుతం బలరారన్‌.
245
క. కురుపాండవసైన్యంబుల | దొర లడియాలముల నొప్పుతో మెఱయు సము
ద్ధురవీరధ్వజములఁ బొలి | చిరి శౌర్యస్ఫూర్తి మూర్తి సేకొన్నక్రియన్‌.
246
వ. అట్టియెడ. 247
క. మీతండ్రి భవత్సుతులకుఁ | జేతోముద మొదవఁ గడఁగి సేన మిగిలి ప్ర
ద్యోతనుఁడు నభోమధ్య | స్ఫీతుం డైనట్లు వెలిఁగె భీషణమూర్తిన్‌.
248
వ. ఇట్లు మెఱసిన. 249
ఉ. అర్జునుఁ డప్డు భీష్ముఁ గని యగ్గలికన్‌ గుణరావ సంగమ
స్ఫూర్జిత దేవదత్తరవశోభితుఁ డై రణకేళి కౌతుకా
వర్జితచిత్తవృత్తి ననివార్యపరాక్రమలీలఁ దాఁక న
త్యూర్జితరౌద్ర మయ్యె బహుళోగ్రమహాస్త్ర గతాగతంబులన్‌.
250
తే. తఱిమి సాత్యకి గృతవర్మఁ దాఁక నతఁడు | నేచి మార్కొన నిరుమేను పూచి యొప్పు
మిగులు మోదుగు మ్రాఁకుల పగిది గాఁగ | నడరె మార్కొన్న రెండువా లంపగములు.
251
చ. మదమునఁ గోసలేంద్రు నభిమన్యుఁడు దాఁకిన నా బృహద్బలుం
డెదిరి కడంగి సూతుఁ బడ నేసి హయంబులఁ జంపఁ జూడ్కిఁ గెం
పొదవఁగఁ బార్థసూనుఁడు మహోగ్రత నట్టుల చేసి, కేతనం
బు దునిమి విల్లుఁ ద్రుంచి శరపూరితగాత్రునిఁ జేసె నాతనిన్‌.
252
తే. భీమసేనునిపై మనభీష్ముఁ డలుక | నడరె నక్కురుముఖ్యుల యస్త్రశస్త్ర
కౌశలంబులు సూడ నక్కజము లైన | నచ్చెరువు నొంది సేనలు పిచ్చలింప.
253
సీ. వీఁకమై నకులునిఁ దాఁకి దుశ్శాసనుఁ | డత్యుగ్రబాణచయమునఁ బొదివె,
నక్కుమారుఁడు దరహాసాభిరాముఁ డై | భల్ల మొక్కటి దొడ్గి విల్లు దునిమి
యేడ్తెఱ నిరువదియేనుదూపులు వడి | నడరింప రయమున నతఁడు నొండు
విల్లెత్తికొని శరవితతి నంతంతన | నఱకి పాండవుకేతనంబు ద్రుంచె;
 
తే. దుర్ముఖుఁడు సహదేవునితోడఁ దొడరి | మెఱుఁగు వాలమ్ము లేసిన నుఱక యాతఁ
డన్నియును మగిడించి రథ్యముల నొంచి, | యతని సారథిఁ దెగటార్చి యార్చి పేర్చె.
254
చ. సరభసుఁ డై యుధిష్ఠిరుఁడు శల్యునిఁ దాఁకుడు నాతఁ డమ్మహీ
శ్వరు మహనీయచాప మనివారణఁ ద్రుంచిన, నొండు విల్లు భీ
కరతరశీఘ్రలీలఁ గొని కన్నుల నవ్వుచుఁ బాండవాగ్రజుం
డరిబల ముక్కు దక్క వడి నాతనిపైఁ గురిసెన్‌ శితాస్త్రముల్‌.
255
సీ. ఏచి ధృష్టద్యుమ్నుఁ డేడ్తెఱ ద్రోణుపై | నడరిన నవలీల నాతఁ డతని
ఘనశరాసనముఁ ద్రిఖండంబుగాఁ జేసి | నారాచ మొక్కటి నాటె మేన;
వేఱొక్క విల్లెత్తి వెసఁ బదునాలుగు | శాతబాణములఁ బాంచాలసుతుఁడు
గలశజు నేసె; మాగధసహదేవుండు | భూరిశ్రవునిఁ దాఁకి భుజశిఖరము
 
తే. మెఱుఁగుటమ్ముల నొంచిన నుఱక యతఁడు | వానియుర ముగ్రశరమున వ్రయ్యఁజేయ,
వార లిరువురు వృత్రుండు వాసవుండుఁ | బోలెఁ బోరిరి సేనలు వొగడుచుండ.
256
తే. ధృష్టకేతుండు కౌరవోత్కృష్టుఁ డైన | బాహ్లికుని మాఱుకొని తీవ్రబాణనవక
మేసె; నాతండు లాఘవ మెసక మెసఁగ | ఘనశరంబులు పదినవకములు గురిసె.
257
క. అచలనిభుఁ డగు నలంబసుఁ | బ్రచలితభూభాగుఁ డగుచుఁ బఱతెంచి ఘటో
త్కచుఁడు దలపడిన నా రజ | నిచరేంద్రుల పోరు కీర్తనీయం బయ్యెన్‌.
258
సీ. గర్వంబు మెఱయ శిఖండి యశ్వత్థామ | నెదిరిన, నాతండు మద మెలర్ప
నారాచ మురమున నాటింప, నొచ్చియు | ద్రుపదనందనుఁ డతిక్రూరశరముఁ
దద్వక్షమునఁ గీలితము సేసె; భగదత్తుఁ | డుఱక విరాటుపై నురవడించి
కదిసిన గగనంబు గప్పె బాణాసార | యుగమును బెరసి మహోగ్రభంగిఁ
 
తే. గైకయాధీశుఁ డగు బృహత్‌ క్షత్త్రవిభుఁడు | గృపుఁడు దలఁపడి యొండొరు కేతనముల
హరుల ధనువులఁ దునిమి నిష్ఠురకృపాణ | దారుణాకారు లై యరదములు డిగిరి.
259
ఉ. అట్టియెడం గనుంగొని జయద్రథుఁడున్‌ ద్రుపదుండు వచ్చి యా
కట్టుపకాసు లిద్దఱకు గ్రక్కున నడ్డము సొచ్చి యొండొరున్‌
బెట్టుగఁ దాఁకి తీవ్రశరపీడితదేహులఁ జేసి, రెట్టి లా
వెట్టిపరాక్రమస్ఫురణ యెట్టిరయం బని పిచ్చలింపఁగన్‌.
260
ఉ. మన్యుసముజ్జ్వలుండు నభిమానియు నైన వికర్ణుఁడున్‌ యుధా
మన్యుఁడు నేచి యొండొరుల మార్కొని రౌద్రరసం బలోక సా
మాన్యము గాఁగ నస్ఖలితమత్సరముల్‌ మెఱయంగఁ బోరి ర
న్యోన్యనిశాతసాయక నిరంతరవర్షములన్‌ మునుంగుచున్‌.
261
ఆ. ధరణినాథ! చేకితానుండు గడఁగి సు | శర్మమీఁద నిశితశరచయంబు
గురియ, నితఁడు నతనిఁ గ్రూరాస్త్రనికర సం | పిహితగాత్రుఁ జేసి పేర్చి యార్చె.
262
క. శకుని ప్రతివింధ్యుఁ దాఁకిన | బ్రకటబలుం డా యుధిష్ఠిరప్రియసుతుఁ డు
ద్భృకుటి యగుచుఁ గవిసెను సిం | హ కిశోరము గజముఁ బొదువున ట్లతనిపయిన్‌.
263
తే. భీమనందనుఁ డగు శ్రుతసోముఁ గడిమిఁ | దాఁకెఁ గాంభోజనృపతి సుదక్షిణుండు
వార లిరువురు నొండొరుం గ్రూరబాణ | జాలముల నెట్లుఁ దెరలుపఁ జాలరైరి.
264
ఉ. అంతకవిక్రముండు మహిమాస్పదమూర్తి భుజంగకన్యకా
సంతతకీర్తనీయబలశాలి గిరీటితనూభవుం డిరా
వంతుఁడు బాహుగర్వధనవంతు శ్రుతాయువుఁ దాఁకె వార ల
త్యంతరయంబునన్‌ విరథు లైరి పరస్పరబాణఘట్టనన్‌.
265
సీ. విందానువిందులు గ్రందుగ వెసఁ గుంతి | భోజుని నాతనిపుత్రుఁ దాఁకి
రా పురజిత్తు బాణాసారమున విందుఁ | బొదివె నుగ్రతఁ గుంతిభోజుఁ డేయు
తూపులు పెనుగద దొలఁగంగ జడియుచు | ననువిందుఁ డతనిపై నడరె బెలుచఁ;
గైకేయు లేవురు గాంధారరాజు లే | వురతోడఁ గ్రూరసంగర మొనర్చి;
 
తే. రుత్తరునిమీఁద నీ తనయుండు దీర్ఘ | బాహుఁ డురవడిఁ గదిసి యుత్సాహలీల
నెఱపె; నకులాత్మజుఁడు శతానీకుఁ డేచి | వడి నులూకునిఁ దలపడి కడిమి మెఱసె.
266
వ. ఇవ్విధంబున వెండియు రెండు సేనలం జేయంగల దండి మగ లొండొరులం దాఁకిన, నధికసంరంభ ద్వంద్వయుద్ధంబు సిద్ధచారణఖేచరులు సూచి పొగడుచుండ నిగిడి, చతురంగంబులుం దనతన జాతిం బదులు పదులును నూఱులు నూఱులును, వేలు వేలును, బెక్కులు పెక్కులునుం దలపడి,యెడనెడంగలయన్‌ బెరయం గ్రమంబున సందడి కయ్యంబు నూలుకొనినఁ గ్రందునం దమకించి యుభయ సైనికు లున్మత్తుల గతిం గవియ బాణంబులుఁ గృపాణంబులుఁ గరిదంతంబులు నరదంబుల నొగలు నొండొంటిం దాఁకి తుత్తుమురులయిన తుములంబు కతన భయంకరం బగు నతిసంకులంబున సామజవాజిరథంబుల యురవడికి నోసరింపని కాలు బలంబులు, నుత్తుంగమాతంగస్యందన సందోహంబుల పయిం బఱపు రాహుతులును, గరటిఘటావిఘటనంబు గావించు రథికులును, నిది యది యనక యెల్ల బలంబులం జొచ్చిన మొగంబునఁ జిందఱవందఱ సేయు గజారోహకులు నగుచు నిర్మర్యాదంబుగాఁ బెనంగు సైన్యద్వితయంబు మందరక్షుభితాంబుధిచందం బగుటకుం దగి, యుచ్చి పోయెడు శరంబులు నిరుమెయిన్‌ గెలిచిన కుంతక్షురి కాదులును, బ్రవాళజాలంబులుం బోలి బొలుపు మిగులుచండ విశిఖంబులు ముఖంబులన్‌ బెట్టు నాటిన జిఱ్ఱనం దిరుగుశుండాలంబులు ప్రళయకాలంబున సురకరువలిచే దిర్దిరం దిరిగెడు కులనగంబులఁ గ్రేణిసేయఁ గరవాలగదాభల్లప్రముఖంబు లగు శస్త్రాస్త్రంబులఁ గుంభికుంభతురంగముఖ భటకపాలాదు లవియు చప్పుళ్ళును, వివిధాయుధ ప్రహతుల నొఱలు హరినరనాగంబుల రావంబులును, దారుణప్రకారంబున దిక్తటదారణంబు సేయుచుం జెలంగఁ, జేయి దునిసినం దక్కటిచేతం గైదువు గొని కవియువారును, గాలు దునిసిన నెదిరి మీఁదికి లంఘించువారును, దల దునిసినం దారు మును గన్నిడినవారిం బొడిచిపడువారును, దెగిపడియు నవుడు గఱచుటయు బొమముడి వడుటయును సడలని తలల నొప్పువారును, మావంతులు నేనుంగులు వికలంబు లైన సమీపవర్తుల వాహనంబుల సమారోహణంబు సేసి పరాక్రమించువారును, నొచ్చియు నీడం బోక చెలులకుం జుట్టంబులకు నడ్డపడువారును మార్బలంబునం జేరి చుట్టం బని తప్పింపక నొప్పించువారును సుభటులు సొచ్చి చెండిన వండం దఱిగినట్లుండు వేదండహయచయంబులును నాశ్వికులు పైకొని మీఁది మానిసులం దునిమిన మ్రోడుపడు రథంబులును, రథనేమి ఘట్టనంబున దట్టంబు లగు పదాతిగాత్రంబులును, నిభంబులు వొదివి నేలతో వ్రేసియుఁ గాలం జమరియుఁ దూల వైచియుఁ గొమ్ముల గ్రుచ్చి యెత్తియు బారిసమరిన వికటాకారంబు లగు ఘోటకంబులునై ఘోరభంగి యగు సంగరంబు సెల్లుచుండ మధ్యాహ్నసమయంబున. 267
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )