పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము
భీష్ముని ద్వితీయదివస యుద్ధక్రమము (సం. 6-47-1)
తే. పుండరీకంబు లుద్దండపుండరీక | చారుభంగి లేయెండ కెంజాయ నొప్పె
నంత నక్కడఁ గురుబల మధికరభస | తుములముగఁ ద్రోచి నడతెంచె సమరమునకు.
22
వ. అయ్యవసరంబున దుర్యోధనుండు భీష్మ ద్రోణాశ్వత్థామ కృప శల్య కృతవర్మల నాలోకించి. 23
క. ఒకఁ డొకఁడ పాండుపుత్త్రుల | సకల బలంబులను గెలువఁ జాలుదు రుగ్రా
ధిక శౌర్య సత్త్వులందఱు! నొకతల యటె | మిమ్ము నోర్వ నోపునె హరుఁడున్‌?
24
క. ఐనను గ్రౌంచవ్యూహవి | ధానంబున మోహరించి దారుణచారు
స్థానక మై కుంతీసుత | సేన వొలిచె మనము నిర్విశేషంబునకున్‌.
25
క. అనురూపము లగు మాఱొ | డ్డనముల్‌ ప్రస్ఫురితములు ధృఢంబులుగాఁ దీ
ర్చినఁ గాక తెఱం గగునే?’ యని మొన లేర్పఱిచెఁ గౌరవాన్వయముఖ్యా!
26
వ. దుశ్శాసన వికర్ణవిందాను విందులును శూరసేనయవన త్రిగర్త కుకురు దేశంబులవారు నొక్కవలనను ద్రోణాచార్యుండును గుంతల దశార్ణ విదర్భులును గాంధార సింధుసౌవీరపతులు నొక్క దిక్కునను భీష్ముండు మహాసైన్యంబుతో నడుమనుం గా మూఁడు మోహరంబులయ్యెఁ; గృతవర్మయు శల్యుండును నశ్మంత కాశ్మీరులు గొందఱు దమ్ములుం దానును మానవేంద్రుండును వెనుక దెస నిలిచె నిత్తెఱంగున రెండు బలంబులు నాయితంబులై శంఖభేరీ మృదంగాది తూర్యస్వనంబులు సెలంగ నొండొంటిం గదియ నడచె’ ననిన విని ధృతరాష్ట్రుం ‘డివ్విధంబునం గదిసి యెవ్వరెట్లు గయ్యంబు సేసి?’ రని యడిగిన నతనికి సంజయుం డిట్లనియె. 27
తే. ‘ఏచి దుర్యోధనుండు చేవీచి యెలుఁగు | సూపి పురికొల్ప నెంతయు నేపు మిగిలి
మనబలంబులు పాండు కుమారసైన్య | సమితితోఁ దాఁకె నత్యంత సంకులముగ.
28
వ. అట్టి యెడ. 29
ఉ. ఱెక్కలు సించి, కంఠమున ఱేకులు వాపి, శిరంబు వ్రచ్చి పే
రుక్కునఁ గ్రొంచచంద మగు నొడ్డు గలంగఁగఁ జేసి భీష్ముఁ డే
దిక్కునఁ దానయై దిశలు దీటుకొనన్‌ శరకోటి నింపఁ గెం
పెక్కిన కంటిక్రేవ చెలువెక్కుడు సేయఁగఁ గ్రీడి కృష్ణుతోన్‌.
30
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )