పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - తృతీయాశ్వాసము
ఘటోత్కచుండు ద్రోణాచార్యప్రభృతులతో యుద్ధంబు సేయుట (సం. 6-88-25)
క. కొందఱసూతులు వొలిసిరి | కొందఱిచాపములు దునిసెఁ గొందఱ చటుల
స్యందనహయాలి వడియెను | గొందఱ యంగములు వ్రస్సెఁ గురుకులముఖ్యా!
121
వ. ఇ ట్లతిరథమహారథులం జిక్కువఱిచినరక్కసున కలిగి రయంబున సాధనంబులు సమకట్టికొని రభసంబున నాకుంభసంభవాది ద్వాదశ రథికవరులు నొక్కపెట్ట చుట్టుముట్టి మహాస్త్రజ్వాలా జాలంబులం బొదివిన. 122
ఆ. ఓర్వరాక దానవోత్తముఁ డంబర | వీథి కెగసి పోయి విపులరవము
సెలఁగఁ బెలుచ నడరి జీమూత భంగి దు | ర్దాంతుఁడైనఁ జూచి ధర్మసుతుఁడు.
123
వ. భీమసేనుతో నిట్లనియె నిక్కడ భీష్ముబారిం బడిన పాంచాల బలంబులఁ బరిపాలింపను, నక్కడ నాచార్యాదుల కగపడ్డ ఘటోత్కచుం గావను వలసియున్నయది యివ్వలనికిం గవ్వడి గలం డవ్వలనికి వేగంబ యరుగు మనిన సింహనాదంబు సేయుచు. 124
క. కౌరవబలములు సుడివడ | మారుతి గవియుటయు మెఱసి మార్కొని కురుధా
త్రీరమణుఁ డర్ధచంద్రా | కారశరము దొడిగి ధనువు గ్రక్కునఁ దునిమెన్‌.
125
తే. తునిమి తోడన క్రొవ్వాఁడి దొడ్డనార | సంబు భీముని వక్షస్‌స్థలంబు దూఱ
నేయుటయు సోలఁ గని ద్రౌపదేయు లడరఁ | గడఁగె సౌభద్రుఁడును ఘటోత్కచుఁడుఁ గలసె.
126
వ. ఇట్లు దండ్రి నొచ్చినఁ బాండుపౌత్త్రులు నీపుత్త్రునిపై నొక్కపెట్ట మిక్కుటం బగుకోపంబునం గవిసిన. 127
చ. కని కృపబాహ్లికాది రథి | క ప్రకరంబు గడంగి వారి మా
ర్కొని పెనఁగంగఁ దేఱి కడుఁ | గ్రూరత నేచిన మారుతాత్మజుం
జెనసి గురుండు రక్తపరి | షిక్తునిఁ జేసిన నాతఁ డల్గి యా
తని నొక నారసంబున ను | దగ్రత మూర్ఛ మునుంగ నేసినన్‌.
128
మ. ధనురాచార్యునిఁ జూచి తత్తనయుఁడున్‌ ధాత్రీశుఁడున్‌ భీము మా
ర్కొని రాతం డెలనవ్వు చెన్నుగ గదా ఘోరాకృతిం దేరు డి
గ్గిన యాలోనన తేఱి ద్రోణుఁడు గడంగెం జూచి తోడై కృపా
ది నికాయంబు గడంగి వాయు సుతుపైఁ దీవ్రాస్త్రముల్‌ నింపఁగన్‌.
129
క. ఏపున హిడింబసుతుఁడును | ద్రౌపదిపుత్త్రులు సుభద్రతనయుఁడుఁ గోపో
ద్దీపితు లై వారల యా | టోపముఁ గుదియించి రతిపటుప్రదరములన్‌.
130
వ. అప్పు డనూపభూపాలుండును భీమసేన సఖిత్వలోలుండు నగు నీలుండు నశ్వత్థామం దొడరి నొచ్చినం గని ఘటోత్కచుండు. 131
క. తలపడి యగ్గురునందనుఁ | జలమున నొప్పింప గురుఁడు సరభసముగ ను
జ్జ్వలబాణావృతుఁ జేసిన | బలమఱి దనుజుండు మాయఁ బన్నెఁ గుపితుఁడై.
132
వ. ఇవ్విధంబున హిడింబాసూనుండు సేసిన మాయం జేసి. 133
క. గురుఁడు మొదలైన యా ప | న్నిరువురుఁ గురుపతియు నొవ్వ నేటులఁ బడి నె
త్తురు దొరఁగ సోలి సంగర | ధరణిం బడినట్లు దోఁచెఁ దత్సేనలకున్‌.
134
చ. కనుఁగొని సైన్యముల్‌ విఱిగి క్రందుకొనన్‌ వెసఁబాఱ నాపగా
తనయుఁడు సేన నాఁగి యివి దైత్యులమాయలు గాని బొంకుబొం
కని యెలుఁగెత్తి చెప్పఁగ భయంబున నమ్మక పోయె నట్లు వో
యినఁ జనుదెంచెఁ గౌరవ మహీశుఁడు దీనత భీష్ముపాలికిన్‌.
135
వ. వచ్చి యి ట్లనియె. 136
క. నీవును ద్రోణుఁడు గలుగం | గా వైరులచేత నేను గష్టపడితిఁ గా
దే వారితోడఁ దలపడి | చా వొండెను విజయ మొండె సంపాదింతున్‌.
137
చ. అన విని నవ్వి పాండవుల యంతటివారికిఁ గాక నీకు మా
ర్కొన నగు నయ్య! యిప్పరుసు కుత్సితవర్తన మిట్టి దుస్తరం
బునఁ దగులావుసేయ మము బోఁటులు లేరె? చలంబు డింపు మీ
వనిపతితోడఁ జెప్పి సరిదాత్మజుఁ డప్పుడు ప్రాభవంబునన్‌.
138
వ. భగదత్తు నాలోకించి. 139
క. దనుజు లొనరించు మాయలు | నినుఁ జేరవు వారి గెలుతు వీ విప్పుడ యీ
జనపతి మెచ్చఁగఁ నా దై | త్యుని గెలువుము నీదు సేనతో నడరి వడిన్‌.
140
వ. అని భీష్ముండు పలికినం బ్రాగ్జ్యోతిషపతి మేటి మగండుగావున అమ్మాటకుం బొంగి సింగం బడరిన చందంబున నార్చి సుప్రతీకంబు నెక్కి సేనా సమేతుండై. 141
తే. పరఁగి తోఁతెంచుపాండవబలముమీఁదఁ | గవియుటయుఁ నంతనంతఁ గౌరవుల మూఁక
మరలి యేర్పడఁ జూచి యమ్మాట యపుడు | నిజముగాఁ గొని యాజికి నిగిడె మగుడ.
142
వ. ఇ ట్లుభయసైన్యంబులుం దలపడిన సందడికయ్యంబున నపరాహ్ణం బగుచు నుండ. 143
క. నగపతియుఁ బోనిగజపతిఁ | దగ నేడ్తెఱ నెక్కి ప్రబలదైత్యబలముతో
నిగుడఁగ ఘటోత్కచుం డా | భగదత్తునిమీఁదఁ గవిసెఁ బార్థివముఖ్యా!
144
వ. తదవసరంబున వృకోదరుం డరదంబు రయంబు మెఱయ నయ్యభిమన్యు ద్రౌపదేయ ప్రముఖులుం దానును హైడింబునకుం దో డై కడంగె నట్టియెడ. 145
ఆ. పొదివి పలువు రేయఁ బొడువ వ్రేయఁగ భగ | దత్తుదంతిరక్తధార లొప్పెఁ
జెలువు రెట్టిగాఁగ జేవుఱుసెలయేఱు | లున్నతాచలమున నురలునట్లు.
146
క. శూలంబున హైడింబుఁడు | గాలాకృతితోడ వైవఁగా నది పొడి యై
రాలెడునట్లుగ మగఁటిమి | వ్రాలినభగదత్తుఁ డేసె వడి భల్లమునన్‌.
147
వ. ఇ ట్లేసి యార్చి వెండియు. 148
ఆ. భీముహరులఁ గూల్చి పేర్చి సౌభద్రాది | యోధవరుల నెల్ల నుఱక తఱచు
టంపవానఁ దడిపి హయరథభట సమూ | హంబుఁ జదిపె సమదహస్తిఁ బఱపి.
149
క. మందరము మహాంభోనిధి | యందుఁ దిరుగునట్లు పాండవానీకములో
నం దిరిగి సుప్రతీక మ | మందగతిం జంపెఁ బెక్కు మాతంగములన్‌.
150
క. అలిగి దశార్ణాధీశుఁడు | గొలిపెను భగదత్తుమీఁదఁ గ్రూరగజము ను
జ్జ్వలము లగునతనితోమర ములతాఁకున నది చలించి మొగతిరిగె వెసన్‌.
151
వ. ఇవ్విధంబునం బోరు భగదత్తుం గనుంగొని గండుమిగిలి కురువిభుండు గురుకృపాది యోధవీర సమేతంబుగాఁ దఱిమినం దమ బలంబులు గోలాహలబహుళంబు లగుటయుఁ బాండవాగ్రజుండు పార్థపాంచాల పురస్సరుండై యవ్వలనికిం గ్రొ వ్వలరం గోల్తల సేసె నట్టి సమయంబున. 152
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )