పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - తృతీయాశ్వాసము
భీష్ముని నవమదివస యుద్ధము (సం. 6-95-1)
తే. ‘ఇతఁడు పాంచాలు రాదిగ నెల్ల బలముఁ | జంపి పాండుతనూజుల సమరభూమి
గెలువఁ గలవాఁడ నని రాత్రి వలికె నేఁడు | దఱిమి మనలావుఁ జేవయు మెఱయ వలయు.’
185
క. అని యాడు తులువమాటలు విని | బీభత్సంబు సిగ్గు విపులవిషాదం
బును నొక్కపెట్ట పుట్టఁగ | ననిమిషతటినీతనూజుఁ డతిదుఃఖితుఁడై.
186
వ. తన్నుం దాన యుపశమించుకొనియున్నం గనుంగొని కౌరవేశ్వరుం డతని క న్నెఱింగినవాఁడై దుశ్శాసనునితో నిట్లనియె. 187
క. ‘మనమెల్లఁ బితామహునొ | ద్దన యుండుద మదియుఁ గా కితనిముందటఁ బె
ట్టన వలయు శత్రుబలమ | ర్దను లిరువదిరెండువేలరథములవారిన్‌.
188
వ. అని నియోగించిన నతండట్ల చేసె. నద్ధరణీశుండు గురుకృపాశ్వత్థామల నాలోకించి గాంగేయుం జూపి “సత్యవ్రతుండగునీతండు శిఖండిపై నేయనని మన మెత్తి విడియునాఁడ చెప్పుట మీ రెఱుంగుదుర కాదె! యన్నీచునకు గోచరంబు గాకుండ నిమ్మహానుభావుం బొదివికొని రావలయు” ననిన వారలు నట్లకాకయని రయ్యమరనదీసూనుండు సర్వతోభద్రవ్యూహం బొనర్చె నందుఁ గృపాచార్యకృతవర్మ శల్యశకునిసుదక్షిణ సైంధవులును గురుకుమారులుం దానును ముందట నిలిచెఁ దదనుమతిం గుంభసంభవభూరిశ్రవో భగదత్తులు వలపటను, సోమదత్తద్రోణపుత్రవిందానువిందులు దాపటను హలాయుధాలంబుసశ్రుతాయువులు వెనుకను ద్రిగర్త ప్రకరపరివృతుం డై జననాథుండు నడుమను నిలిచి రంతకు మున్న కౌంతేయులు సైన్యసమేతంబుగా వెడలి రట్టియెడ నర్జునుండు మన మొగ్గరంబు సూచి ధృష్టద్యుమ్నున కి ట్లనియె. 189
తే. ‘కంటె గాంగేయు? నతనిచక్కటి శిఖండిఁ | బెట్టు మీతని మనమెల్లఁ బిండుగట్టి
పొదివికొనివత్త మివ్విధంబునకుఁ దగ ద | ళంబుగా మోహరింపు బలంబు నెల్ల.’
190
వ. అనిన విని యతం డట్ల చేయుదు నని సాత్యకి విరాటులు వలపటను, అభిమన్యు పాంచాల కేకయులు దాపటను, నకులసహదేవ ద్రౌపదేయపురస్సరుండైన యుధిష్ఠిరుండు నడుమను, జేకితానకుంతి భోజులు వెనుకంగా నొనర్చి యగ్రభాగంబున శిఖండి నునిచి యతనికెలంకుల డాసి భీమసేన ఘటోత్కచు లొక్కవలనను, బార్థుండుఁ దాను నొక్కదిక్కున నిలిచి తక్కినయోధవీరులం గలయం జేర్చి గట్టిమొనగా నమర్చె ని ట్లుభయ సైన్యంబులుం బన్ని భేరీభాంకారశంఖాదినిస్వనగర్జాస్ఫూర్జిత బహుళంబుగా నొండొంటిం దాఁకె నట్టి సమయంబున. 191
క. చెంగట నభిమన్యుండు | పిశంగతురంగప్రచారచంచద్రథుఁడై
పొంగి మనదిక్కు ప్రజమీఁ | దం గవిసెం జిచ్చు దూది దరికొనుమాడ్కిన్‌.
192
వ. ఇట్లు గవిసి. 193
తే. మెఱసి మండలచారి యై కొఱవి ద్రిప్పి | నట్లు గురుకృపసింధురాజాదు లైన
యోధవీరులు వెగడంద నులివు మిగిలి | తరువఁబడు నబ్ధిక్రియ సేన దిరుగఁబడఁగ.
194
వ. ఇట్లు మాఱు లేక తఱుముచున్న సౌభద్రుం గనుంగొని కౌరవపతి యలంబుసుతో నిట్లనియె ‘వీఁడు రెండవ యర్జునుం డై మనబలంబులఁ గలంచుచున్నవాఁ డర్జుననందను నెదుర్కొన నీవకాని మాఱు లే దేము పాండవుల కడ్డపడియెదము నీవు వీనిం బొదివి భంజింపుము.’ 195
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )