పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - తృతీయాశ్వాసము
ధర్మరాజు రహస్యప్రకారంబున భీష్మునియొద్దకుఁ బోవుట (సం. 6-103-50)
ఆ. నీ తలంపు లెస్స నీవు మున్ననినట్ల | కాక భీష్ముఁ డలుక గదిరిపోరఁ
జక్కఁ జూచెనేని శత్రువుల్‌ వొలియరె? | యిప్పుడతని పాలికేఁగు మధిప!
292
సీ. నీవు దన్నడిగిన నిజవధోపాయం బవశ్యంబుఁ జెప్పు దేవవ్రతుండు
మనము రహస్యవర్తనమున నందఱమును జని య మ్మహాత్మునకు భక్తి
నెరఁగి తెల్లంబుగ హితకార్యగతి వినయంబుమైఁ బ్రార్థించి యడిగి యతని
సదయమంత్రోపదేశంబున నెగడుద’ మని యిట్లు హరి నిశ్చయంబు సేయ
 
ఆ. నయ్యజాతశత్రుఁ డనుజులు నతఁడును | దాను సౌమ్యవేషధరణమొప్ప
నతినిగూఢ వృత్తి నాపగాసుతుమంది | రమున కరిగి సముచితముగఁ జొచ్చి.
293
వ. అతనిం గాంచి యధికభక్తిం బ్రస్తవనపూర్వకంబుగాఁ దత్పాదంబులకుం బ్రణమిల్లిన నతం డత్యాదరంబునఁ బేరుపేర వారలందఱసేమంబు లడిగి యి ట్లనియె. 294
క. ‘ఇచ్చటికి మీర లందఱు | వచ్చిన పనియేమి? యేది వలసిన నడుగుం
డిచ్చెద దుష్కరమైనను | జెచ్చెరఁ దలకొని ఘటింపఁ జేసెదఁ బ్రీతిన్‌.’
295
వ. అని తెలివొందిన మొగంబుతో నడిగిన దీనాననుం డగుచు ధర్మసూనుం డతని కి ట్లనియె. 296
క. ‘మా కెమ్మెయి సామ్రాజ్యము | సేకుఱు నెబ్భంగి బహుళసేనోత్సాద
వ్యాకులత రాక తక్కుం | జేకొని యత్తెఱఁగు కరుణఁ జెప్పఁగ వలయున్‌.’
297
క. అనవుడు‘నేఁ బెనఁగఁగ మీ | కనఘా! సైన్యక్షయంబు నగు సామ్రాజ్యం
బును గానేరదు గావున | నను నిర్జింపంగ శోభనము లెల్ల నగున్‌.’
298
వ. అని పలికిన శాంతనవునకుం గౌంతేయాగ్రజుం డి ట్లనియె. 299
ఉ. ‘చిచ్చఱకన్ను మూసికొని చేతిత్రిశూలము డాఁచి లీలమై
వచ్చిన రుద్రుచందమున వ్రాలుదు వీ వనిలోన నోర్వఁగా
వచ్చునె నిన్ను నెట్టి మగవారికి? నీకృప నాశ్రయింపఁగా
వచ్చితి మెవ్విధిన్‌ గెలువవచ్చు మహాత్మ! యెఱుంగఁ జెప్పవే?’
300
క. అనుటయు ని ట్లను గంగా | తనయుఁడు ‘నీ చెప్పినట్ల తథ్యం బది న
న్ననిమిషులు గెలుతు రే? చే | ధనువుండఁగ వినుము తద్విధము దేటవడన్‌.
301
తే. ఇట్టివానిఁగ నన్ను మీరెఱిఁగి యిచటి | కిందఱును వచ్చి యక్కటా! యిట్టు లడుగ
మీకుఁ బ్రియమైన కార్యంబు మెయికొనంగఁ | గనుట కంటెను సుకృతంబు గలదె నాకు?
302
వ. ఏ నా యుధ వ్యాపారంబువలన నుదాసీనత్వంబు నొందిన నన్ను జయింప సమకూరు జోడు వుచ్చినవానిని, గైదువు బెట్టినవానిని, సిడంబు డించినవానిని, నంగనను, నంగనాపూర్వుని, నంగనాభిధానునిఁ దలచీర వీడినవానిని, భ్రాతృహీనుని, నపుత్రకునిం గని యేటుఁ బోటుఁ దక్కి సమరంబు సేయ మానుదు. మఱియు నొక్క వ్రతంబు పూనినవాఁడం బుట్టి నప్పుడు లేక నడుమ దైవం బిచ్చిన పురుషత్వంబు గలవానితోడఁ గయ్యంబు సేయం గావున మీకు నొక్క యుపాయంబు సెప్పెద. ద్రుపదు నపత్యం బైన శిఖండి యట్టివాఁడగుట మీరెఱుంగు దుర కాదె? విశేషించి ముందటి పుట్టువున నంగన యగుట వాని కెదు రేయకుండుదు నర్జునుండు వానిం బురస్కరించుకొని వచ్చి యే నేయుట మానినయెడ నొప్పించి పడవైచునది. పదంపడి బంధుమిత్త్రు లగు ధార్తరాష్ట్రుల గెలుచుట సుకరం బగునిది నాపను పేను బనిచి నట్ల చేయుం డని సహృదయంబుగాఁ జెప్పిన నట్లు దేవవ్రతుచేత ననుజ్ఞాతు లై వార లతనికి నమస్కరించి వీడ్కొని విడిదలకుం బోవుచున్న సమయంబున బీభత్సుండు. 303
ఆ. సురనదీసుతుండు పరలోకగతి నిరీ | క్షించుటకును దాను గృతకవృత్తిఁ
జంపవలయుటకును సవిషాదమానసుం | డగుచు నిట్టు లనియె నచ్యుతునకు.
304
క. ‘గురునిఁ గృతప్రజ్ఞుని ధ | ర్మ రతు వయోవృద్ధు లోకమాన్యు దయాళున్‌
సురతటినీసుతు వంచనఁ | బురుషోత్తమ! చంపబుద్ధి వుట్టదు నాకున్‌.
305
ఆ. నన్నుఁ బాంసుకేళి నున్న నర్మిలి నెత్తి | మేనిధూళి దనదు మేను వొరయఁ
బ్రీతిఁ గౌఁగిలించి మా తండ్రి గుణము ల | గ్గించి కన్నునీరు నించునతఁడు.
306
ఉ. అక్కట! తండ్రి లేని మము నమ్మెయిఁ బెంచిన తాత ని మ్మెయిం
ద్రెక్కొనఁగా దతండు సముదీర్ణభుజాబలశౌర్యశాలియై
యిక్కడి సేనఁ జక్కడిచెనేనియుఁ జూతున కాక ధర్మముం
దక్కుట కోర్వఁ జాలుదునె? ధర్మజుతమ్ములు క్రూరకర్ములే?’
307
వ. అనిన విని కృష్ణుం డా జిష్ణున కిట్లనియె. 308
ఉ. ‘క్రూరత కోర్చి యించుకయు రోయక పైకొని యెల్లభంగులన్‌
వైరులఁ జంపి భూప్రజకు వర్ధనముం గలిగించి పాడిమైఁ
గో రరి గొంచు సద్వ్యయము గోరి యొనర్చుట రాజధర్మవి
స్తారముగా బలారికి వచస్పతి సెప్పుట యప్రసిద్ధమే?
309
చ. అనిమొన నోర్తు భీష్ము నని యాడిననీదగు పూన్కి లోక మె
ల్లను వినియుండఁగా నిటు చలం బెడలం జన దెట్టు లైనఁ జం
పన తగు రాజధర్మపరిపాలన గా కిది క్రూరకర్మమే?
నిను విధిపంచె శాంతనవునిం దెగటార్పఁగ వేయు నేటికిన్‌.’
310
చ. అనుటయుఁ గ్రీడి యిట్టు లను నాద్రుపదాత్మజుజన్మ మాపగా
తనయవధార్థ మం డ్రదియుఁ దప్ప దతండును వాని నేయఁ డే
ను నతని నేయుచందమున నూల్కొని యన్యుల నేయుచుండు వాఁ
డనితరవధ్యకాయుఁ డగు నాయనఁ దాఁ బడ నేయు నుగ్రతన్‌.
311
వ. అనవుడు నవ్వి కవ్వడికిం గమలనాభుం డి ట్లనియె. 312
ఉ. ‘నీ వొకరుండు దక్కఁగ ననింద్య పరాక్రమశాలి భీష్మునిం
జావఁగ నేయ నెవ్వఁడును జాలఁడు నీతలఁ పెన్నిభంగులన్‌
దైవము చూపువోలెఁ దుదిదాఁకునె? యవ్విధ మిట్టు లుండఁగాఁ
ద్రోవఁగ వచ్చునే? యెటులు ద్రోచినఁ బోవదు చూచి యుండుమీ.’
313
వ. అని పలికిన విని యతం డట్ల కాక యప్పటికి నెట్లయిన నట్లయ్యెడు నని యర్జునుం డియ్యకొనిన గోవిందుండును, ధర్మనందనాదులుం బ్రమోదంబు నొంది రివ్విధంబున శిబిరంబున కరిగి పాండవులు పుండరీకాక్షుని నిజ నివాసంబున కనిచి తమ తమ నికేతనములకుం జని యా రాత్రి సుఖనిద్ర సేసి’ రని చెప్పిన సంజయునకు ధృతరాష్ట్రుం డి ట్లనియె. 314
క. పాండుసుతు లేమిభంగి శి | ఖండిం గూర్చికొని యాపగాసుతుపై ను
ద్దండగతి నడచి రెట్లు? ప్ర | చండతతో సమరకేలి సలిపిరి? చెపుమా.’
315
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )